- ఉప ఎన్నిక కోసం వందల కోట్లు ఎక్కడివి?
- కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ధరణిని కట్టడి చేస్తం
మహబూబ్‌నగర్/షాద్‌నగర్, వెలుగు: రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ధరణి పోర్టల్‌ను కట్టడి చేస్తామని, సీఎం కేసీఆర్ ఎవరెవరి భూములు లాక్కున్నారో.. వాటన్నింటినీ వాపస్ ఇప్పిస్తామని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. దళితులు, ఆదివాసీలకు భూములపై హక్కులు కల్పిస్తామని, బ్యాంకు రుణాలు వచ్చేలా ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. ఆయన చేపట్టిన భారత్ జోడో యాత్ర 52వ రోజు ఆదివారం ఉదయం మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల నుంచి మొదలైంది. 26 కిలోమీటర్ల మేర కొనసాగి రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌కు చేరుకోగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో రాహుల్ మాట్లాడారు. సీఎం అవినీతి సొమ్మును కూడగట్టుకోవడం తప్ప ప్రజల సమస్యల గురించి పట్టించుకోవట్లేదని ఆరోపించారు. అందుకే ప్రతిరోజూ ఉదయం ఇరిగేషన్ వివరాలు.. సాయంత్రం ధరణి పోర్టల్ వివరాలను అడిగి తెలుసుకుంటారని అన్నారు. విద్య, వైద్యంపై ఖర్చు చేయాల్సిన డబ్బులను ఇరిగేషన్‌కు మళ్లించారని.. వాటిని కూడా ఇరిగేషన్‌కు ఖర్చు చేయకుండా కేసీఆర్ తన జేబులోనే వేసుకుంటున్నారని ఆరోపించారు. తెలంగాణలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కేసీఆర్, ఉద్యోగాలను భర్తీ చేయకుండా నిరుద్యోగులను మోసం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో ప్రజా సమస్యలు తెలుసుకోవాల్సిన అధికార పార్టీ లీడర్లు.. ఆ పని చేయకపోగా వాళ్ల గొంతు నొక్కేస్తున్నారని మండిపడ్డారు.
రాష్ట్రంలో చేనేతపై జీఎస్టీ ఎందుకు?
తెలంగాణలో చేనేతతో పాటు హ్యాండ్ క్రాఫ్ట్‌పై ప్రభుత్వం జీఎస్టీ విధిస్తోందని రాహుల్ మండిపడ్డారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే జీఎస్టీ ఎత్తివేసి కార్మికులకు పరిహారం ఇస్తామని హామీ ఇచ్చారు. నోట్ల రద్దు, జీఎస్టీ అమలు.. పాలసీలో లేవని, కానీ వాటిని అమలు చేస్తున్నారని అన్నారు. దీంతో చిన్న, మధ్య తరగతి వ్యాపారులు, రైతులను దోచుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలను ప్రైవేటీకరిస్తున్నారని, చదువుకున్న యువకులేమో ఉద్యోగాలు లేక కూలీ పనులు చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
ఉప ఎన్నికకు 200 కోట్లు ఎక్కడివి?
తెలంగాణలో జరిగే ప్రతి ఉప ఎన్నికప్పుడు టీఆర్ఎస్ పార్టీ వందల కోట్లు ఖర్చు చేస్తోందని, ఇప్పుడు జరగబోయే మునుగోడు ఎన్నికకు కూడా రూ.200 కోట్ల వరకు ఖర్చు పెడుతోందని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఆ డబ్బంతా ఎక్కడిదని ఆయన ప్రశ్నించారు. ప్రజల నుంచి అక్రమంగా, చోరీ చేసిన డబ్బునే తిరిగి ప్రజలను పంచుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.