పార్లమెంట్‌‌‌‌‌‌ను రాహుల్ తప్పుదోవ పట్టించారు: కేటీఆర్

పార్లమెంట్‌‌‌‌‌‌ను రాహుల్ తప్పుదోవ పట్టించారు: కేటీఆర్
  • కులగణన సర్వేలో బీసీల జనాభా ఎలా తగ్గిందంటూ రాహుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ​కేటీఆర్ లేఖ

హైదరాబాద్, వెలుగు: కులగణన సర్వే విషయంలో పార్లమెంటును కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తప్పుదోవ పట్టించారని బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేలో బీసీల సంఖ్య 1.85 కోట్లుగా తేలిందని, రాష్ట్ర జనాభాలో అది 51 శాతమని పేర్కొన్నారు. మైనారిటీ బీసీలనూ కలిపితే మొత్తం 61 శాతమన్నారు. 

కానీ, ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు చేసిన కులగణన సర్వేలో బీసీ జనాభా 1.64 కోట్లకు ఎలా తగ్గిందని ప్రశ్నించారు. ఈ మేరకు బుధవారం ఆయన రాహుల్ గాంధీకి లేఖ రాశారు. ఈ తప్పుడు లెక్కలను ఎవరూ నమ్మే పరిస్థితి లేదన్నారు. లక్షలాది మంది వివరాలు సర్వేలో లేవని, అలాంటిది సర్వే మొత్తం పూర్తయినట్టు పార్లమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రాహుల్ చెప్పడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే అవుతుందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చే ఉద్దేశం లేదని అసెంబ్లీ సమావేశాల సాక్షిగా తేలిపోయిందన్నారు. 

కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇచ్చిన హామీని తుంగలో తొక్కి, చివరికి కాంగ్రెస్ పార్టీ పరంగా మాత్రమే సీట్లు ఇస్తామని చేతులెత్తేయడం మోసం కాకపోతే మరేంటని కేటీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ చేసిన ద్రోహాన్ని చూస్తూ ఊరుకోవడానికి బీసీలు సిద్ధంగా లేరన్నారు. ఎన్నికల్లో లబ్ధి పొందడమే లక్ష్యంగా డిక్లరేషన్ల పేరుతో అబద్ధాలు ప్రచారం చేశారని, ఇప్పుడు ఆ డిక్లరేషన్లకు సర్కారు గోరీ కట్టిందని మండిపడ్డారు. 

ఎట్ల ప్రచారం చేసుకుంటరు..

తెలంగాణలో అమలు చేయని హామీలను, ఇక్కడి ప్రజలకు అందిస్తున్నట్టు ఎలా ప్రచారం చేసుకుంటారని రాహుల్ గాంధీని కేటీఆర్ ప్రశ్నించారు. కులగణనలో దొర్లిన తప్పులను సవరించాల్సిన బాధ్యతను మరిచి బంతిని కేంద్రం పరిధిలోకి నెట్టి చేతులు దులుపుకోవాలని చూస్తే సహించేది లేదని హెచ్చరించారు. బీసీ సంఘాల నేతలు కులగణన నివేదికను చించేసి నిరసన తెలిపారన్నారు. 

పదేండ్లలో అగ్రవర్ణాల జనాభా పెరిగి.. బీసీల జనాభా తగ్గడం ఎలా సాధ్యమో చెప్పాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. బీసీల భవిష్యత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను నిర్దేశించే కీలకమైన కోటాను తప్పులకుప్పగా తయారు చేశారని ఆరోపించారు. ఈ తప్పుల నివేదికతో బీసీలకు రాబోయే రోజుల్లో ఉద్యోగ, రాజకీయ అవకాశాలు కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. ఈ ఫెయిల్యూర్ మోడల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను దేశవ్యాప్తంగా అమలు చేయాలని రాహుల్ కోరడం విడ్డూరమన్నారు. గ్యారంటీల పేరిట చేసిన గారడీని, డిక్లరేషన్ పేరిట చేసిన దగాను చూశాక ఏ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీని ప్రజలను నమ్మరని కేటీఆర్ అన్నారు.