- తొలి ఇన్నింగ్స్ లో ఇండియా 421/7
- ఇప్పటికే 175 రన్స్ ఆధిక్యం
- ఉప్పల్‌లో ఇంగ్లండ్‌తో తొలి టెస్ట్
హైదరాబాద్, వెలుగు : తొలి రోజు స్పిన్నర్లు ఇంగ్లండ్‌కు చుక్కలు చూపెడితే.. రెండో రోజు బ్యాటర్లు తడాఖా చూపెట్టారు. దాంతో ఉప్పల్ టెస్టులో టీమిండియా హవానే నడుస్తోంది. రెండో రోజే 175 పరుగుల ఆధిక్యంలోకి వచ్చిన ఆతిథ్య జట్టు మ్యాచ్‌ను తన చేతుల్లోకి తీసుకుంది. ఓవర్‌నైట్‌స్కోరు 119/1 తో ఆట కొనసాగించిన ఇండియా శుక్రవారం రెండో రోజు చివరకు తొలి ఇన్నింగ్స్ లో 421/7 తో నిలిచింది. మిడిలార్డర్ బ్యాటర్ కేఎల్ రాహుల్
(123 బాల్స్ లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 86), ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా (155 బాల్స్ లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 81 బ్యాటింగ్ ) సత్తా చాటారు. తెలుగు ఆటగాడు శ్రీకర్ భరత్ (41) ఫర్వాలేదనిపించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో టామ్ హార్ట్లీ, జో రూట్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ప్రస్తుతం జడేజా, అక్షర్ పటేల్ (35 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.
ఇండియాదే ఆధిపత్యం.. ఆధిక్యం
తొమ్మిది మందిలో ఎనిమిది మంది బ్యాటర్లు మంచి ఆరంభం దక్కించుకున్నారు. వారిలో ముగ్గురు 80 ప్లస్ స్కోర్లు చేశారు. ఇద్దరు అజేయంగా ఉండగా.. ఐదు హాఫ్ సెంచరీ పార్ట్నర్షిప్స్ వచ్చాయి. మొత్తంగా ఇంగ్లండ్ బ్యాటర్లు వణికిపోయిన ఉప్పల్ పిచ్‌పై ఇండియన్స్ జోరు చూపెడుతూ మ్యాచ్ ను పూర్తిగా తమ కంట్రోల్ లోకి తీసుకెళ్లారు. ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ రోజంతా బౌలింగ్ చేసినా ఆరే వికెట్లు పడగొట్టింది. అందులో రెండు పార్ట్ టైమ్ స్పిన్నర్ జో రూట్ పడగొట్టాడు. రెండో రోజు ఆట మొదలైన నాలుగో బాల్ కే ఓవర్ నైట్ బ్యాటర్ జైస్వాల్ ను ఔట్ చేశాడు. రూట్ వేసిన టాస్ బాల్ ను డ్రైవ్ చేసే ప్రయత్నంలో జైస్వాల్ అతనికే రిటర్న్ క్యాచ్ ఇచ్చాడు.
గిల్ (23) కు తోడైన కేఎల్ రాహుల్ సౌతాఫ్రికా టూర్ ఫామ్ ను కొనసాగించాడు. హార్ట్లీ బౌలింగ్ లో వరుస ఫోర్లతో టచ్ లోకి వచ్చిన అతను క్లాసిక్ షాట్లతో అలరించాడు. అయితే, క్రీజులో కుదురుకున్న గిల్ .. హార్ట్లీ ఫ్లయిటెడ్ బాల్ కు చెత్త షాట్ ఆడి వికెట్ పారేసుకున్నాడు. అయినా వెనక్కు తగ్గని రాహుల్ మార్క్ వుడ్ వేసిన తర్వాతి ఓవర్లోనే మూడు ఫోర్లతో స్టేడియాన్ని హోరెత్తించాడు. అతనికి శ్రేయస్ అయ్యర్ (35) నుంచి కాసేపు మంచి సపోర్ట్ లభించింది. హార్ట్లీ బౌలింగ్ లో పుల్ షాట్ తో సిక్స్ కొట్టిన అయ్యర్ కాన్ఫిడెన్స్ పెంచుకున్నాడు. మరోవైపు జోరు కొనసాగించిన రాహుల్ ఫిఫ్టీ పూర్తి చేసుకోగా ఇండియా 222/3తో లంచ్ కు వెళ్లింది. కానీ, బ్రేక్ నుంచి వచ్చిన మూడో ఓవర్లోనే రెహాన్ అహ్మద్ బౌలింగ్ లో శ్రేయస్ ఔటవడంతో నాలుగో వికెట్ కు 64 రన్స్ పార్ట్ నర్ షిప్ బ్రేక్ అయింది.
ఈ టైమ్‌లో రాహుల్ కు జడేజా తోడవ్వగా ఇండియా మరింత స్పీడ్ పెంచింది. రెహాన్ ఓవర్లో రాహుల్ రెండు సిక్సర్లతో స్కోరు 250 దాటించడంతో పాటు జట్టును ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. మరోవైపు 3 రన్స్ వద్ద కీపర్ క్యాచ్ డ్రాప్, 17 రన్స్ వద్ద ఎల్బీ నుంచి రివ్యూ లో బయటపడ్డ జడేజా ఈ చాన్స్ లను సద్వినియోగం చేసుకున్నాడు. నాణ్యమైన షాట్లతో ఆకట్టుకున్నాడు. అయితే, సెంచరీ దిశగా కదిలిన రాహుల్ ఓ భారీ షాట్ కు ట్రై చేసి రెహాన్ కు క్యాచ్ ఇచ్చాడు. కేఎల్ ప్లేస్ లో బ్యాటింగ్ కు వచ్చిన కీపర్ భరత్ కాస్త ఇబ్బంది పడ్డాడు. పేసర్ వుడ్ తో పాటు స్పిన్నర్ల బౌలింగ్ లోనూ తడబడగా.. టీ బ్రేక్ కు ముందు ఇంగ్లండ్ రన్స్ ను కట్టడి చేసింది. అయితే ఇండియా 309/5తో టీకి వెళ్లొచ్చిన తర్వాత భరత్ కూడా కాస్త వేగం పెంచాడు.
మరోవైపు తన ట్రేడ్ మార్క్ షాట్లతో ఫ్యాన్స్ కు కిక్ ఇచ్చిన జడేజా 84 బాల్స్ లో ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. అయితే రూట్ బౌలింగ్ స్వీప్ షాట్ ఆడే ప్రయత్నంలో భరత్ ఎల్బీ అవ్వడంతో ఆరో వికెట్ కు 68 రన్స్ పార్ట్ నర్ షిప్ బ్రేక్ అయింది. కాసేపటికే జడేజాతో సమన్వయలోపంతో అశ్విన్ (1) రనౌటవ్వడంతో ఇంగ్లండ్ పుంజుకునేలా కనిపించింది. కానీ, జడేజాకు తోడైన అక్షర్ ఆ చాన్స్ ఇవ్వలేదు. ఇద్దరు లెఫ్టాండ్ ఆల్ రౌండర్లు టాపార్డర్ బ్యాటర్లను తలపించేలా బ్యాటింగ్ చేశారు. హార్ట్లీ ఓవర్లో చివరి మూడు బాల్స్ కు 4, 6,4 కొట్టిన అక్షర్ పటేల్ రెండో రోజుకు సూపర్ ఫినిషింగ్ ఇచ్చాడు.
సంక్షిప్త స్కోర్లు
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ : 246 ఆలౌట్; ఇండియా తొలి ఇన్నింగ్స్: 110 ఓవర్లలో 421/7 (రాహుల్ 86, జడేజా 81 బ్యాటింగ్, జో రూట్ 2/77).