దేశవ్యాప్తంగా కులగణన చేయాలి.. లోక్​సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ డిమాండ్

దేశవ్యాప్తంగా కులగణన చేయాలి.. లోక్​సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ డిమాండ్
  • తెలంగాణలో సర్వే చేశాం.. ఓబీసీలు 55 %పైనే ఉన్నరు
  • దేశవ్యాప్తంగా కూడా ఇలాంటి లెక్కలే వస్తయ్
  • నిరుద్యోగ సమస్యపై యూపీఏ, ఎన్డీఏ విఫలం
  • మేక్ ఇన్ ఇండియా మంచిదే, కానీ మోదీ ఫెయిల్
  • జీడీపీ 2014లో 15%.. ఇప్పుడు12%కు పడిపోయింది
  • ప్రధానిని ఆహ్వానించాలని కోరేందుకే అమెరికాకు విదేశాంగ మంత్రి వెళ్లారంటూ కామెంట్​

న్యూఢిల్లీ: దేశ జనాభాలో సగానికిపైగా ఉన్న ఓబీసీలకు అధికారం మాత్రం లేదని లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. దళితులు, గిరిజనులు, ఓబీసీలంతా కలిపితే 90% వరకూ ఉంటారని, కానీ వారికి సరైన అధికారాలు, సంపద మాత్రం దక్కడం లేదన్నారు. ‘‘మేం తెలంగాణలో కులగణన చేశాం. అందులో షాకింగ్ నిజాలు తెలిశాయి. తెలంగాణలో దాదాపు 90% మంది దళితులు, ఆదివాసీలు, ఓబీసీలే ఉన్నారని తేలింది. దేశమంతటా కూడా ఇలాగే ఉంటుందని నేను నమ్ముతున్నాను. ఓబీసీల జనాభా 50% కంటే ఎక్కడా తక్కువగా ఉండదని భావిస్తున్నా” అని ఆయన చెప్పారు. సోమవారం లోక్ సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడారు.

దేశంలో ఒక్క కార్పొరేట్ సంస్థకు కూడా దళితులు, ఓబీసీలు యజమానులుగా లేరన్నారు. దేశమంతటా కులగణనతోనే అణగారిన వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు. ‘‘పోయిన ఏడాది బడ్జెట్ సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ హల్వా సెరెమోనీలో పలువురు ఆఫీసర్లతో ఫొటో దిగారు. ఆ ఫొటోలో ఒక్కరు కూడా దళిత లేదా ఓబీసీ అధికారులు లేరని నేను అప్పుడు ప్రస్తావించాను. ఈసారి ఫొటోనే రిలీజ్ చేయలేదు. హల్వా పంచారు. మరి దానిని ఎవరికి తినిపించారో చూపించలేదు” అని ఎద్దేవా చేశారు. 

ఉత్పాదక రంగంతోనే దేశం అభివృద్ధి జరుగుతుందని, సంపదలో ఓబీసీలు, దళితులు, ఆదివాసీలకూ భాగస్వామ్యం ఉండాలన్నారు. అయితే, దేశంలోని 90% మంది చేతిలో ఎంత సంపద ఉందన్నది కులగణనతోనే తేలుతుందన్నారు. ‘‘ఇక్కడ సభలో బీజేపీకి చెందిన ఓబీసీ, దళిత, ఆదివాసీ ఎంపీలు కూడా ఉన్నారు. గుర్తుంచుకోండి. మీరు జనాభాలో 50% ఉన్నారు. కానీ మీకు నిజమైన అధికారం మాత్రం లేదు. మీరు ఇక్కడ కూర్చున్నారు. కానీ నోరు తెరవలేరని నాకు తెలుసు. ఇదే ఈ దేశంలోని అసలు నిజం” అని రాహుల్ అన్నారు.   

కులగణనలో ఏఐని వాడుకోవాలి.. 
దేశవ్యాప్తంగా కులగణన చేపట్టేందుకు ఏఐ టెక్నాలజీని వాడుకోవాలని రాహుల్ సూచించారు. డేటా విశ్లేషణకు ఏఐ టెక్నాలజీని వాడుకుంటే దేశంలో ఒక సామాజిక విప్లవం వస్తుందన్నారు. ‘‘మనం ఒకేటైంలో రెండు మార్గాల్లో వెళ్లాలి. ఒకటి దేశ పరిపాలనలో, సంస్థల్లో, సంపద పంపిణీలో ఓబీసీ, దళితులు, ఆదివాసీల భాగస్వామ్యాన్ని పెంచడం. రెండోది దేశ అభివృద్ధి కోసం చైనాను మించి ఉత్పాదకత పెంచడం. మోటార్లు, బ్యాటరీలు, సోలార్ ప్యానెల్స్ వంటి వాటి ఉత్పత్తిలో చైనాను అధిగమించడం” అని రాహుల్ సూచించారు. 

మనం బలపడితే, అమెరికా అధ్యక్షుడే వస్తరు..  
దేశంలో ఉత్పాదకత నామమాత్రంగానే ఉందని రాహుల్ అన్నారు. ‘‘మనం వ్యవస్థీకృత ఉత్పాదకత రంగాన్ని చైనీయులకు అప్పగించాం. మనం ఫోన్​ను ఉపయోగించిన ప్రతిసారీ, షర్టులు, స్నీకర్లు ధరించిన ప్రతిసారీ చైనాకు ట్యాక్స్ కడుతున్నాం. మనం ప్రొడక్షన్ పై కాకుండా కన్జంప్షన్​పై మాత్రమే ఫోకస్ పెడితే.. భారీ లోటులో పడిపోతాం. అసమానతలు పెరుగుతాయి. తద్వారా నిరుద్యోగం పెరిగి సామాజిక సమస్యగా పరిణమిస్తుంది. చైనా బల్క్ ప్రొడక్షన్ డాటాను, అమెరికా కన్జంప్షన్ డాటాను కంట్రోల్ చేస్తున్నాయి. కానీ ఇండియా ఈ రెండు రంగాల్లోనూ సమర్థంగా లేదు. అందుకే దేశవ్యాప్తంగా ఒక బలమైన ప్రొడక్షన్ నెట్ వర్క్​ను నిర్మించాల్సిన అవసరం ఉంది” అని ఆయన చెప్పారు. ‘‘మనం బలమైన ప్రొడక్షన్ సిస్టంను ఏర్పాటు చేసుకుని, ఏఐ వంటి టెక్నాలజీల్లో అగ్రగామిగా ఎదిగితే.. అప్పుడు అమెరికా అధ్యక్షుడి ప్రమాణ స్వీకారానికి మన ప్రధానిని ఆహ్వానించాలంటూ విదేశాంగ మంత్రిని మూడు నాలుగు సార్లు అక్కడికి పంపాల్సిన అవసరం ఉండదు. అమెరికా అధ్యక్షుడే భారత్​కు వచ్చి, మన ప్రధానిని ఆహ్వానిస్తారు” అని రాహుల్ అన్నారు. 

నిరుద్యోగ సమస్యపై యూపీఏ, ఎన్డీఏ ఫెయిల్..
దేశంలో నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంలో గత యూపీఏ సర్కారు, ఇప్పటి ఎన్డీఏ సర్కారు విఫలమయ్యాయని రాహుల్ అన్నారు. ఉపాధి కల్పనపై దేశ యువతకు స్పష్టమైన సమాధానం చెప్పడంలో ప్రభుత్వాలు ఫెయిల్ అయ్యాయన్నారు. ప్రధాని మోదీ మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాన్ని తెచ్చినా.. జీడీపీ మాత్రం పడిపోయిందన్నారు. దేశ జీడీపీ 2014లో 15.3% ఉండగా.. ఇప్పుడు అది 12.6 శాతానికి పడిపోయిందన్నారు. మేక్​ ఇన్​ ఇండియా ఆచరణలో విఫలమవడంతో ప్రొడక్షన్ సెక్టార్​లో మనం చైనా కన్నా చాలా ఏండ్లు వెనకబడ్డామన్నారు. మరోవైపు చైనా మన భూభాగాన్ని 4 వేల చ.కి.మీ. ఆక్రమించుకున్నా 
కేంద్రం పట్టించుకోవడంలేదని ఆరోపించారు.

మహారాష్ట్రలో 70 లక్షల ఓటర్లను చేర్చారు..
మహారాష్ట్రలో లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల మధ్య కొత్తగా 70 లక్షల ఓటర్లను జాబితాలో చేర్చారని, ఇది హిమాచల్ రాష్ట్రం జనాభాతో సమానమని రాహుల్ గాంధీ అన్నారు. దీనికి సంబంధించిన మొత్తం డేటాను ఆ రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలకు ఎన్నికల సంఘం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మహారాష్ట్ర ఎన్నికలు జరిగిన తీరుపై అనేక సందేహాలు ఉన్నాయన్నారు. ప్రతిపక్షాలు అడిగిన డేటాను ఎన్నికల సంఘం కచ్చితంగా ఇవ్వబోదని తనకు తెలుసన్నారు. 

ఓటు హక్కుకు కూడా రక్షణ లేకపోతే రాజ్యాంగానికే అర్థం లేదన్నారు. కాగా, పార్లమెంట్ ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేసిన ప్రసంగంలో తనకు కొత్తదనం ఏమీ కనిపించలేదని రాహుల్ గాంధీ అన్నారు.

దేశం పరువు తీశారు: జైశంకర్  
ట్రంప్ ప్రమాణ స్వీకారానికి మోదీని ఆహ్వానిం చాలని కోరేందుకే విదేశాంగ మంత్రి యూఎస్ వెళ్లారని రాహుల్ గాంధీ చేసిన కామెంట్లపై జైశంకర్ కూడా ఫైర్ అయ్యారు. లోక్ సభలో రాహుల్ స్పీచ్ తర్వాత జైశంకర్ ట్వీట్ చేశారు. ‘‘రాహుల్ గాంధీ అబద్ధాలు రాజకీయ లబ్ధి కోసమే కావచ్చు.. కానీ ఆ మాటలు విదేశాల్లో మన దేశం పరువు తీసేలా ఉన్నాయి” అని మండిపడ్డారు. 

‘‘గత డిసెంబర్​లో నా అమెరికా పర్యటన గురించి రాహుల్ చెప్పిన మాటలు తప్పు. నేను అప్పటి బైడెన్ సర్కారులోని విదేశాంగ మంత్రి, ఎన్ఎస్ఏతో సమావేశం కోసం వెళ్లాను. అలాగే కౌన్సెల్స్ జనరల్ సమావేశానికి అధ్యక్షత వహించాను. అంతే తప్ప నేను ఎక్కడా మోదీని ఆహ్వానించాలని ఎవరినీ కోరలేదు. అసలు అలాంటి కార్యక్రమాల కు మన ప్రధాని ఎన్నడూ హాజరు కాలేదు. వాటికి దేశం తరఫున ప్రత్యేక ప్రతినిధులే హాజరవుతారు” అని జైశంకర్ వివరించారు.   

సభలో రాహుల్ X రిజిజు 
దేశంలో ఓబీసీలకు అధికారం దక్కడంలేదని, ట్రంప్ ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోదీని ఆహ్వానించాలని కోరేందుకు విదేశాంగ మంత్రి మూడు నాలుగు సార్లు యూఎస్​లో పర్యటించారంటూ లోక్ సభలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు మండిపడ్డారు. దేశానికి ప్రధానిగా ఉన్న ఓబీసీ నేత మోదీ ఈ సభలోనే ఉన్నా.. ఆయన ముఖం మీ కండ్లకు కనిపించడంలేదా? అని రాహుల్​పై రిజిజు ఫైర్ అయ్యారు. ‘‘ప్రతిపక్ష నేత ఏమీ చూడలేరు. ఆయన ఓబీసీ, ఓబీసీ అని మాట్లాడతారు. కానీ సభలోనే ఉన్న ఓబీసీ ప్రధానిని మాత్రం చూడలేరు” అని విమర్శించారు. బీజేపీ ఎంపీలు కూడా సభలో నిరసనలు తెలిపారు. మోదీ మాత్రం సైలెంట్గా ఉండిపోయారు. మంత్రి జైశంకర్​పై రాహుల్ చేసిన కామెంట్లపైనా రిజిజు తీవ్రంగా స్పందించారు.

‘‘ప్రతిపక్ష నేత ఇలాంటి నిరాధారమైన ప్రకటనలు చేయడం దారుణం. ఇది రెండు దేశాల మధ్య రిలేషన్ షిప్​కు సంబంధించిన విషయం. ప్రధానిని ఆహ్వానించాలని కోరేందుకే విదేశాంగ మంత్రి అమెరికాకు వెళ్లారని రాహుల్​కు ఎవరు చెప్పారో స్పష్టం చేయాలి” అని అన్నారు. రాహుల్ స్పందిస్తూ.. ‘‘నా ప్రశ్న మిమ్మల్ని డిస్టర్బ్ చేసి ఉంటే సారీ” అని బదులిచ్చారు. కాగా, విదేశాంగ మంత్రిపై, బార్డర్ వివాదంపై లోక్ సభలో రాహుల్ చేసిన కామెంట్లు దేశాన్ని తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని ఆయన కామెంట్లను రికార్డుల నుంచి తొలగించాలని బీజేపీ ఎంపీలు డిమాండ్ చేశారు. అంతేకాకుండా ప్రతిపక్ష నేతపై ప్రివిలేజ్ మోషన్ కూడా ప్రవేశపెట్టనున్నట్టు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి.

మేం తెలంగాణలో కులగణన చేశాం
అక్కడ దాదాపు 90 శాతం మంది దళితులు, ఆదివాసీలు, ఓబీసీలే ఉన్నారని తేలింది. దేశంలో ఓబీసీల జనాభా 50 శాతం కంటే ఎక్కడా తక్కువగా ఉండదు. లోక్​సభలో బీజేపీకి చెందిన ఓబీసీ, దళిత, ఆదివాసీ ఎంపీలు కూడా ఉన్నరు. కానీ వీరికి నిజమైన అధికారం లేదు. వాళ్లు సభలో కూర్చున్నా .. నోరు తెరవలేరని నాకు తెలుసు. ఇదే ఈ దేశంలోని అసలు నిజం.