- లక్నో పేసర్ ఉనాద్కట్ కూడా
- స్కానింగ్ కోసం నేడు ముంబైకి కేఎల్
న్యూఢిల్లీ: లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్, పేసర్ జైదేవ్ ఉనాద్కట్ గాయాల కారణంగా ఈ ఐపీఎల్‌లో మిగతా మ్యాచ్‌లకు దూరం కానున్నారు. మంగళవారం ఆర్‌సీబీతో మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తూ రాహుల్‌కు గాయమైంది. బాల్‌ను ఆపేందుకు రన్నింగ్ చేస్తుండగా తొడ కండరాలు పట్టేయడంతో విపరీతమైన నొప్పితో గ్రౌండ్ వీడాడు. చివర్లో బ్యాటింగ్‌కు వచ్చినా కనీసం సింగిల్ కూడా తీయలేకపోయాడు. మరోవైపు ఉనాద్కట్ సైతం ప్రాక్టీస్ లో గాయపడ్డాడు. కింద పడటంతో అతని ఎడమ భుజానికి దెబ్బ తగిలింది. కేఎల్, ఉనాద్కట్ గాయాలు తీవ్రమైనవని తెలుస్తోంది దాంతో, ఐపీఎల్‌తో పాటు జూన్ లో ఆస్ట్రేలియాతో జరిగే వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్‌కు కూడా ఈ ఇద్దరూ దూరమయ్యే అవకాశం కనిపిస్తోంది. గురువారం కేఎల్‌ను ముంబైకి తీసుకెళ్లి స్కానింగ్ నిర్వహించనున్నారు. సెంట్రల్ కాంట్రాక్టు ప్లేయర్లు కావడంతో రాహుల్‌తో పాటు ఉనాద్కట్ కూడాబీసీసీఐ మెడికల్ టీమ్ పర్యవేక్షణలోకి వెళ్లనున్నారు. ‘కేఎల్ ప్రస్తుతం లక్నో టీమ్‌తోనే ఉన్నాడు. ఇంకా స్కానింగ్ చేయలేదు. ఇలాంటి గాయం అయినప్పుడు చాలా నొప్పి ఉంటుంది. వాపు కూడా వస్తుంది. వాపు తగ్గేందుకు 24 నుంచి 48 గంటల సమయం పడుతుంది. ఆ తర్వాతే స్కాన్ చేయాల్సి ఉంటుంది. కేఎల్ ఇండియా టీమ్‌లో కీలక మెంబర్. కాబట్టి మిగతా ఐపీఎల్‌లో అతను బరిలోకి దిగబోడు. ఒకసారి స్కానింగ్ నిర్వహించి గాయం ఏ స్థాయిలో ఉందో తెలిసిన తర్వాత బీసీసీఐ మెడికల్ టీమ్ తదుపరి చర్యలు తీసుకుంటుంది. ఉనాద్కట్ భుజానికి గాయమైంది. ఎముక కదలకపోవడంతో అతను బౌలింగ్ వేసే పరిస్థితి లేదు. తను కూడా ఐపీఎల్‌కు దూరమైనట్టే. డబ్ల్యూటీసీ ఫైనల్ వరకు అతను ఫిట్‌నెస్ సాధిస్తాడో లేదో చూడాలి’ అని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. పటీదార్ సర్జరీ సక్సెస్ గాయంతో ఐపీఎల్ నుంచి వైదొలిగిన ఆర్‌సీబీ ప్లేయర్ రజత్ పటీదార్‌కు సర్జరీ పూర్తయింది. యూకేలో అతని మడమకు చేసిన సర్జరీ సక్సెస్ అయింది. ఈ విషయాన్ని పటీదార్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. బెడ్‌పై ఉన్న ఫొటోను షేర్ చేశాడు.