ఎన్నికల నిబంధనల మేరకే ఖర్చు చేయాలి: రాహుల్ రాజ్

ఆదిలాబాద్, వెలుగు: ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకే రాజకీయ నేతలు ఖర్చు చేయాల్సి ఉంటుందని ఆదిలాబాద్ కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. బుధవారం కలెక్టరేట్​లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎన్నికల ఖర్చలను పక్కాగా పరిశీలించి నమోదు చేస్తామని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేయనున్నట్లు తెలిపారు. 

ఎన్నికల ఖర్చును నిశితంగా పరిశీలించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని.. ఆయా పార్టీలు, అభ్యర్థులు ఎప్పటికప్పుడు ఎన్నికల ఖర్చుల వివరాలను తెలియజేయాల్సి ఉంటుందన్నారు. అర్హులైన ప్రతి ఓటరు తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించుకునేలా చొరవ చూపాలని రాజకీయ పార్టీల ప్రతినిధులకు సూచించారు. సభలు, సమావేశాలు, ర్యాలీల నిర్వహణ కోసం కనీసం 48 గంటల ముందు అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సమావేశంలో శిక్షణ సహయ కలెక్టర్ వికాస్ మహతో, ఆర్డీవో స్రవంతి, తహసీల్దార్ శ్రీనివాస్, ఎన్నిల విభాగం పర్యవేక్షకురాలు నలంద ప్రియ తదితరులు పాల్గొన్నారు.

ఎలక్షన్ రూల్స్ కట్టుదిట్టంగా అమలు

ఆసిఫాబాద్: అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా జిల్లాలో ఎలక్షన్ రూల్స్ కట్టుదిట్టంగా అమలు చేస్తామని ఆసిఫాబాద్ ఎస్పీ సురేశ్ కుమార్ తెలిపారు. జిల్లాలో ఏర్పాటు చేసిన ఇంటర్ డిస్ట్రిక్ట్ చెక్ పోస్టులు, బోర్డర్ చెక్ పోస్టులను  బుధవారం తనిఖీ చేశారు. ఈసందర్భంగా మాట్లాడుతూ.. ఎన్నికల నియమావళిని జిల్లాలో కట్టుదిట్టంగా అమలు చేస్తామని.. నగదు, మద్యం, ఉచిత పంపిణీలపై ప్రత్యేక నిఘా ఉంటుందన్నారు. 

మోడల్ కోడ్ అమల్లోకి వచ్చినందున రూ.50వేల నగదు కంటే ఎక్కువ మొత్తంలో తీసుకెళ్లే వారితోపాటు పెద్ద మొత్తంలో బంగారం, ఇతర వస్తువులను తీసుకెళ్లేవారు ఆధారాలను చూపాలని.. లేకపోతే సీజ్ చేస్తామని హెచ్చరించారు. చెక్ పోస్ట్ సిబ్బంది 24 గంటలు షిఫ్టుల పద్ధతిలో విధుల్లో ఉంటూ వాహనాల తనిఖీ పకడ్బందీగా నిర్వహించాలని, అప్రమత్తoగా వ్యవహరించాలని ఆదేశించారు.