
- ఐపీఎల్–18లో ఢిల్లీకి వరుసగా నాలుగో విజయం
- 6 వికెట్ల తేడాతో బెంగళూరుపై గెలుపు
- సాల్ట్, టిమ్ డేవిడ్ శ్రమ వృధా
బెంగళూరు: ఐపీఎల్–18లో ఢిల్లీ క్యాపిటల్స్ అపజయమే లేకుండా దూసుకుపోతోంది. చిన్న ఛేజింగ్‌లో కేఎల్ రాహుల్ (53 బాల్స్‌లో 7 ఫోర్లు, 1 సిక్స్‌తో 93 నాటౌట్) దంచికొట్టడంతో గురువారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో ఢిల్లీ 6 వికెట్ల తేడాతో బెంగళూరుపై నెగ్గింది. టాస్ ఓడిన బెంగళూరు 20 ఓవర్లలో 163/7 స్కోరు చేసింది. ఫిల్ సాల్ట్ (17 బాల్స్‌లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 37), టిమ్ డేవిడ్ (20 బాల్స్‌లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 37 నాటౌట్), రజత్ పటీదార్ (25) మెరుగ్గా ఆడారు. తర్వాత ఢిల్లీ 17.5 ఓవర్లలో 169/4 స్కోరు చేసింది. స్టబ్స్ (23 బాల్స్‌లో 4 ఫోర్లు, 1 సిక్స్‌తో 38 నాటౌట్) అండగా నిలిచాడు. రాహుల్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
బ్యాటర్లు ఫెయిల్..
బెంగళూరుకు మెరుగైన ఆరంభం లభించినా మిడిలార్డర్ వైఫల్యంతో భారీ స్కోరు చేయలేకపోయింది. ఓపెనింగ్‌లో సాల్ట్, విరాట్ కోహ్లీ (22) పోటీపడి ఫోర్లు, సిక్స్‌లు కొట్టడంతో తొలి వికెట్‌కు 23 బాల్స్‌లోనే 61 రన్స్ జతయ్యాయి. కానీ 11 బాల్స్ తేడాలో సాల్ట్, దేవదుత్ పడిక్కల్ (1) ఔటయ్యారు. మరో 8 బాల్స్ తర్వాత విరాట్ కూడా వెనుదిరగడంతో ఆర్సీబీ స్కోరు 74/3గా మారింది. ఈ దశలో రజత్ నెమ్మదిగా ఆడినా రెండో ఎండ్‌లో సహకారం కరువైంది. ఢిల్లీ స్పిన్నర్లు విప్రాజ్ నిగమ్ (2/18), కుల్దీప్ యాదవ్ (2/17) కట్టుదిట్టమైన బౌలింగ్‌తో స్కోరును కట్టడి చేశారు. దీంతో వరుస విరామాల్లో లివింగ్‌స్టోన్ (4), జితేష్ శర్మ (3) ఔటయ్యారు.కొద్ది సేపటికే రజత్ కూడా వికెట్ ఇవ్వడంతో పవర్‌ప్లేలో 64 రన్స్ చేసిన ఆర్సీబీ 15 ఓవర్లు ముగిసేసరికి 117/6తో కష్టాల్లో పడింది. ఈ దశలో క్రునాల్ పాండ్యా (18), టిమ్ డేవిడ్ భారీ హిట్టింగ్‌కు ట్రై చేశారు. 18వ ఓవర్‌లో క్రునాల్ ఔట్‌కావడం మరింత దెబ్బకొట్టింది. 19వ ఓవర్‌లో 6, 4, 6తో 17 రన్స్ రాబట్టిన డేవిడ్ తర్వాతి ఓవర్‌లో 6, 6, 4తో 19 రన్స్ దంచాడు. భువనేశ్వర్ (1 నాటౌట్)తో ఎనిమిదో వికెట్‌కు 17 బాల్స్‌లోనే 38 రన్స్ జత చేయడంతో ఆ మాత్రం స్కోరైనా వచ్చింది.
తడబడి.. తేరుకుని
ఛేజింగ్‌లో ఢిల్లీ ఆరంభంలో తడబడినా రాహుల్, స్టబ్స్ సూపర్ ఇన్నింగ్స్‌తో ఈజీగా గెలిపించారు. ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లో యష్ దయాల్ (1/45).. డుఫ్లెసిస్ (2)ను ఔట్ చేశాడు. భువనేశ్వర్ (2/26) వరుస ఓవర్లలో జాక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్ (7), అభిషేక్ పోరెల్ (7)ను పెవిలియన్‌కు పంపడంతో డీసీ 30/3తో ఎదురీత మొదలుపెట్టింది. ఈ దశలో రాహుల్, అక్షర్ పటేల్ (15) నిలకడగా ఆడటంతో 39/3తో పవర్‌ప్లేను ముగించింది. ఫీల్డింగ్ పెరిగిన తర్వాత కూడా బెంగళూరు పేసర్ హాజిల్‌వుడ్, స్పిన్నర్ సుయాష్ శర్మ (1/25) మెరుగ్గా బౌలింగ్ చేశారు. రాహుల్ సిక్స్ కొట్టినా, 9వ ఓవర్‌లో అక్షర్‌ను ఔట్ చేయడంతో నాలుగో వికెట్‌కు 28 రన్స్ పార్ట్‌నర్‌షిప్ ముగిసింది. ఫస్ట్ టెన్‌లో డీసీ 66/4తో నిలిచింది. స్టబ్స్ రాకతో 11వ ఓవర్ నుంచి ఇన్నింగ్స్‌లో వేగం పెరిగింది. రాహుల్ రెండు సిక్స్‌లు, ఓ ఫోర్ కొట్టగా, స్టబ్స్ ఫోర్‌తో పాటు సింగిల్స్ రాబట్టాడు. ఈ క్రమంలో 37 బాల్స్‌లో ఫిఫ్టీ పూర్తి చేసిన రాహుల్ 15వ ఓవర్‌లో 4, 4, 4, 6తో 22 రన్స్ దంచాడు. తర్వాతి రెండు ఓవర్స్‌లో స్టబ్స్ 4, 6, 4, 4తో 25 రన్స్ రాబట్టాడు. ఇక 18 బాల్స్‌లో 18 రన్స్ అవసరమైన దశలో రాహుల్ 6, 4, 5 వైడ్స్, 6తో 13 బాల్స్ మిగిలి ఉండగానే మ్యాచ్ గెలిపించాడు. ఈ ఇద్దరు ఐదో వికెట్‌కు 55 బాల్స్‌లోనే 111 రన్స్ జోడించారు.
సంక్షిప్త స్కోర్లు
బెంగళూరు: 20 ఓవర్లలో 163/7 (సాల్ట్ 37, టిమ్ డేవిడ్ 37*, కుల్దీప్ 2/17, నిగమ్ 2/18). ఢిల్లీ: 17.5 ఓవర్లలో 169/4 (రాహుల్ 93*, స్టబ్స్ 38*, భువనేశ్వర్ 2/26).