రాహుల్ క్షమాపణ చెప్పాలి: లక్ష్మణ్

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహానికి నివాళులు అర్పించిన రాహుల్ గాంధీ.. అక్కడే రెండడుగుల దూరంలో ఉన్న మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు విగ్రహానికి ఎందుకు నివాళులు అర్పించలేదని బీజేపీ ఎంపీ, ఓబీసీ మోర్చా నేషనల్ ప్రెసిడెంట్ లక్ష్మణ్ ప్రశ్నించారు. దేశ ఆర్థిక స్థితిని మార్చిన పీవీ.. కాంగ్రెస్ నాయకుడే కదా? మరి ఆయనను ఎందుకు పట్టించుకోలేదని నిలదీశారు. ఇందుకు దేశ, రాష్ట్ర ప్రజలకు రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని బుధవారం ప్రకటనలో డిమాండ్ చేశారు. 

‘‘ప్రధానిగా సేవ చేసిన పీవీ నర్సింహారావు అంతిమ సంస్కారాలు ఢిల్లీలో చేయకుండా ఆనాడు అవమానించారు. ఇప్పుడు ఆయన విగ్రహానికి నివాళులు అర్పించకుండా మరోసారి అవమానించారు” అని లక్ష్మణ్ మండిపడ్డారు. రాహుల్ మెప్పు కోసం రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఇలా చేశారా? జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. చార్మినార్ దగ్గరికి వెళ్లి మాట్లాడిన రాహుల్.. పక్కనే ఉన్న చరిత్రాత్మకమైన భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ యాత్రకు టీఆర్ఎస్ పూర్తి మద్దతు ఇచ్చిందని.. ఇది కాంగ్రెస్, టీఆర్ఎస్ ల జోడో యాత్రలా సాగిందని అన్నారు.