న్యూఢిల్లీ: గాయాల నుంచి కోలుకున్న ఇండియా ప్లేయర్లు కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ టీమిండియాలో రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఆసియా కప్‌నకు టీమ్ సెలెక్షన్ ముంగిట ఈ ఇద్దరూ బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ)లో మ్యాచ్ ప్రాక్టీస్‌లో నిమగ్నమయ్యారు. వీళ్లు మ్యాచ్ ఆడుతున్న ఓ వీడియోలో శ్రేయస్ బౌలర్ వేసిన బాల్‌ను కవర్స్ మీదుగా కొట్టగా.. కేఎల్ నాన్‌స్ట్రయికింగ్ ఎండ్‌లో ఉన్నాడు.
అయితే, ఈ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ 50 ఓవర్ల పాటు వికెట్ కీపింగ్ చేశాడా? శ్రేయస్ అయ్యర్ మొత్తం ఇన్నింగ్స్‌లో ఫీల్డింగ్ చేశాడా? అన్నది తెలియరాలేదు. ఈ ఇద్దరూ ఆసియా, వరల్డ్ కప్ టీమ్‌లో ఆడాలంటే 50 ఓవర్ల పాటు కీపింగ్, ఫీల్డింగ్ చేసే ఫిట్‌నెస్ సాధించాలి. కేవలం బ్యాటింగ్ ఫిట్‌నెస్‌ను పరిగణనలోకి తీసుకొని టీమ్‌లోకి ఎంపిక చేయలేరు. అయితే, కేఎల్, అయ్యర్ ఫిట్‌నెస్ స్టేటస్‌పై ఎన్‌సీఏ పెద్దలు నోరు మెదపడం లేదు.
మరోవైపు ఈ ఇద్దరూ ఆసియా కప్‌లో ఆడాలని కోరుకుంటున్న అజిత్ అగర్కార్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ టీమ్ సెలెక్షన్‌ను ఆలస్యం చేస్తోంది. అయితే, ఈ వారంలోపే టీమ్‌ను ప్రకటించాల్సిన నేపథ్యంలో ఈ లోపే అయ్యర్, కేఎల్ మ్యాచ్ ఫిట్‌నెస్‌ను నిరూపించుకోవాలి. లేదంటే తిలక్ వర్మకు చాన్స్ ఇవ్వాలని సెలెక్టర్లు భావిస్తున్నట్టు తెలుస్తోంది.