సెహ్వాగ్‌ను మించిన మెరుపులు.. డబుల్ సెంచరీతో హైదరాబాద్ కుర్రాడి విధ్వంసం

సెహ్వాగ్‌ను మించిన మెరుపులు.. డబుల్ సెంచరీతో హైదరాబాద్ కుర్రాడి విధ్వంసం

హైదరాబాద్ కుర్రాడు రాహుల్ సింగ్ డబుల్ సెంచరీతో అదరగొట్టాడు. ఇందులో విశేషం ఏముంది అనుకుంటే పొరపాటే. ఎందుకంటే దిగ్గజాలకు సైతం సాధ్యం కాని రికార్డ్ ను మన తెలుగు కుర్రాడు సాధించాడు. ముఖ్యంగా ఇండియన్ క్రికెట్ లోనే విధ్వంసకర క్రికెటర్ గా భావించే సెహ్వాగ్ ను మించిపోయాడు. హైదరాబాద్ లో నిలకడగా ఆడే బ్యాటర్లు ఎంతమంది ఉన్నప్పటికీ..వేగంగా ఆడే బ్యాటర్ లేడనే ఒక వెలితి ఉండేది. కానీ ఇప్పుడు రాహుల్ సింగ్ ఇన్నింగ్స్ చూసిన తర్వాత ఈ లోటు తీరిపోయిందనే చెప్పాలి. 

దేశంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే రంజీ ట్రోఫీ నిన్న (జనవరి 5) ప్రారంభమైంది. ఇందులో భాగంగా హైదరాబాద్ తమ తొలి మ్యాచ్ ను నాగాలాండ్ తో తలపడింది. ఈ మ్యాచ్ లో రాహుల్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 143 బంతుల్లోనే డబుల్ సెంచరీ చేసి ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో వేగంగా ఈ ఘనత సాధించిన రెండో ఆటగాడిగా రికార్డుల పుస్తకాల్లోకి ఎక్కాడు. 1984-85 సీజన్‌లో బరోడాతో జరిగిన మ్యాచ్‌లో రవిశాస్త్రి 123 బంతుల్లో డబుల్ సెంచరీ ఘనత పూర్తి చేసుకున్నాడు.           

ఈ మ్యాచ్ లో 157 బంతుల్లో 9 సిక్సర్లు, 23 బౌండరీలతో 214 పరుగులు చేసి ఔటయ్యాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో భారత విధ్వంసకర వీరుడు సెహ్వాగ్ తన ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీని 168 బంతుల్లో పూర్తి చేసుకోగా.. రాహుల్ కు మాత్రం కేవలం 143 బంతులు అవసరమయ్యాయి. రాహుల్ సింగ్ తో పాటు తన్మయ్ అగర్వాల్ (80), కెప్టెన్ తిలక్ వర్మ (100*) రాణించడంతో తొలి రోజు హైదరాబాద్ 6.18 రన్ రేట్ తో 76.4 ఓవర్లలో 474/5 పరుగుల భారీ స్కోర్ చేసింది.