- కులం, మతం పేరుతో సమాజాన్ని విడదీసే కుట్ర చేస్తున్నడు
- బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు లక్ష్మణ్ ఫైర్
- కామారెడ్డి డిక్లరేషన్ ఎక్కడని నిలదీత
హైదరాబాద్, వెలుగు: బీసీలపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మొసలి కన్నీరు కారుస్తున్నారని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. సమాజాన్ని విడదీయాలనే ఏకైక ఎజెండాతో కుల, మత, ప్రాంతం, భాష పేరుతో రాహుల్ కుట్రచేస్తున్నారని, బీసీలను రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
మంగళవారం బీజేపీ హైదరాబాద్ సెంట్రల్ జిల్లా ఆఫీసులో బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. దీనికి లక్ష్మణ్ చీఫ్ గెస్టుగా హాజరై మాట్లాడారు. ఆర్టికల్370ని రద్దుచేసి జమ్మూకాశ్మీర్ లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు కల్పించిన ఘనత తమ ప్రభుత్వానిదన్నారు. 70 ఏండ్లలో కాశ్మీర్ లో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు కాంగ్రెస్ ఎందుకు రిజర్వేషన్లు కల్పించలేకపోయిందని ఆయన ప్రశ్నించారు.
నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీతో పొత్తు పెట్టుకొని కాంగ్రెస్ వేర్పాటువాదానికి వంత పాడుతోందని, ఆర్టికల్ 370ని మళ్లీ తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. ‘‘కేంద్ర ప్రభుత్వంలో, పార్లమెంటులో ప్రిన్సిపల్ సెక్రటరీలు, జాయింట్ సెక్రటరీలు పట్టుమని పదిమంది కూడా లేరంటూ రాహుల్ నిందలు వేస్తున్నారు.
యూపీఏ పాలనలో రిజర్వేషన్లను సక్రమంగా అమలుచేసి, బీసీలను ఐఏఎస్ ఆఫీసర్లుగా నియమించినట్లయితే, ఇప్పుడు పార్లమెంటులో ప్రిన్సిపల్ సెక్రటరీలు, జాయింట్ సెక్రటరీలుగా పదోన్నతులు సాధించేవారు. మరి రిజర్వేషన్లు ఎందుకు అమలు చేయలేదో రాహుల్ చెప్పాలి” అని లక్ష్మణ్ డిమాండ్ చేశారు. అలాగే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కామారెడ్డి డిక్లరేషన్ సభలో రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని, ఆ హామీ అమలు ఎక్కడని ఆయన ప్రశ్నించారు.
కాగా.. బీజేపీ సభ్యత్వ నమోదులో ఓబీసీ మోర్చా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన సూచించారు. ఈ సమావేశంలో ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆనంద్ గౌడ్, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు, సెంట్రల్ జిల్లా ప్రెసిడెంట్ గౌతం రావు, రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు.