
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్ రాయ్ బరేలీలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా కుండగంజ్ లోని విశాక ఇండస్ట్రీస్ లిమిటెడ్ ప్లాంట్ ను సందర్శించారు. కంపెనీ ఏర్పాటు చేసిన ఆటమ్ ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్ ను ప్రారంభించారు. అదే విధంగా2 మెగావాట్ల (2MW) ఆటమ్ రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్ ను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విశాఖ ఇండస్ట్రీస్ చైర్మన్, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్, మేనేజింగ్ డైరెక్టర్ సరోజా వివేక్, ఎంపీ వంశీకృష్ణ పాల్గొన్నారు.
గ్రీన్ ఎనర్జీ రంగంలో దేశ అభివృద్ధికి విశాక ఆటమ్ ఉత్పత్తులు ఎంతగానో ఉపయోగపడతాయని ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ప్రశంసించారు. పర్యావరణ అనుకూల ఉత్పత్తులు తయారు చేయడం అభినందనీయం అని అన్నారు. పునరుత్పాదక ఇంధన వనరులు భవిష్యత్ తరాలకు ఎంతో అవసరమని ఆయన అన్నారు.
రాయ్ బరేలీ పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీని విశాక ఇండస్ట్రీస్ కంపెనీ సందర్శనకు సాదరంగా ఆహ్వానించారు విశాఖ ఇండస్ట్రీస్ చైర్మన్, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్, మేనేజింగ్ డైరెక్టర్ సరోజా వివేక్, ఎంపీ వంశీకృష్ణ. కంపెనీ తయారు చేస్తున్న ఉత్పత్తులను రాహుల్ కు స్వయంగా వివరించారు. గ్రీన్ ఎనర్జీకి అవసరమయ్యే ఉత్పత్తులను భవిష్యత్తులో మరిన్ని తీసుకొస్తామని కంపెనీ యాజమాన్యం ఈ సందర్భంగా తెలిపింది.