ఎగ్జిట్​ పోల్​ కాదు.. మోదీ మీడియా పోల్​ : రాహుల్​ గాంధీ

ఎగ్జిట్​ పోల్​ కాదు.. మోదీ మీడియా పోల్​  : రాహుల్​ గాంధీ

ఎగ్జిట్‌ పోల్స్ ఫలితాలన్నీ NDA హ్యాట్రిక్ కొట్టడం ఖాయం అని తేల్చి చెప్పాయి. అటు INDIA కూటమికి గరిష్ఠంగా 167 సీట్లు సాధిస్తుందని ఎగ్జిట్ పోల్ అంచనాలు వెల్లడించాయి. ఈ క్రమంలోనే రాహుల్ గాంధీని మీడియా ప్రశ్నించింది. ఈ ఎగ్జిట్‌ పోల్ ఫలితాలపై మీ అభిప్రాయమేంటని అడిగింది. అందుకు రాహుల్ ఆసక్తికర సమాధానమిచ్చారు. సిద్దూ మూసేవాలా పాట "295" ని కోట్ చేస్తూ బదులిచ్చారు. "మీరు సిద్దు మూసేవాలా 295 పాట వినలేదా" అని అడిగారు. పరోక్షంగా కూటమికి 295 సీట్లు వస్తాయని ఇలా చెప్పారు. ఇక ఎగ్జిట్ పోల్‌ ఫలితాలపైనా సెటైర్లు వేశారు. అది ఎగ్జిట్ పోల్ కాదని, మోదీ మీడియా పోల్ అని చురకలు అంటించారు. అవన్నీ ఊహాజనితమైన లెక్కలే అని తేల్చి చెప్పారు. 


జూన్ 4న ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ క్రమంలోనే కాంగ్రెస్ కీలక సమావేశం నిర్వహించింది. ఈ సమావేశం జరిగిన సమయంలోనే రాహుల్‌ని మీడియా ప్రశ్నించగా ఇలా సమాధానమిచ్చారు. ఇక కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్‌ ఈ భేటీపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఎగ్జిట్ పోల్‌ అంతా బోగస్ అని కొట్టి పారేశారు. కూటమి 295 సీట్లు సాధిస్తుందన్న నమ్మకం ఉందని ధీమా వ్యక్తం చేశారు. జైరాం రమేశ్ కూడా ఎగ్జిట్ పోల్ అంచనాలను కొట్టి పారేశారు. జూన్ 4న ఫలితాలు ఈ అంచనాలకు పూర్తి భిన్నంగా ఉండబోతున్నాయని వెల్లడించారు. తమకు ఆ నమ్మకం ఉందని తేల్చి చెప్పారు.