రాహుల్ పౌరసత్వం ఇష్యూ.. కేంద్రానికి ఢిల్లీ హైకోర్టు ప్రశ్న

రాహుల్ పౌరసత్వం ఇష్యూ.. కేంద్రానికి ఢిల్లీ హైకోర్టు ప్రశ్న

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీ భారత పౌరసత్వంపై నిర్ణయం తీసుకునేలా హోం మంత్రిత్వ శాఖను ఆదేశించాలని బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి చేసిన పిటిషన్‌పై కేంద్రం వైఖరిని తెలియజేయాలని ఢిల్లీ హైకోర్టు శుక్రవారం కోరింది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ విభు బఖ్రు, జస్టిస్ తుషార్ రావు గేదెల బెంచ్ ఈ విషయంలో సంబంధిత అధికారుల నుంచి సూచనలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వ ప్రాక్సీ అడ్వకేట్‎ను కోరింది. 

ఈ పిటిషన్‌పై మొదట నోటీసు జారీ చేయడానికి  కోర్టు మొగ్గు చూపింది. అయితే, ఈ విషయంలో గతంలో ప్రభుత్వం తరఫున వాదించిన అడ్వకేట్‎ను సీనియర్ న్యాయవాదిగా నియమించినట్లు కేంద్రం ప్రాక్సీ న్యాయవాది తెలిపారు. అందువల్ల ఈ కేసులో కొత్త న్యాయవాదిని భాగస్వామ్యం చేసేందుకు కొంత టైం కావాలని కోరారు. దీంతో, ఈ అంశంలో కేంద్రం స్టాండ్ ఏమిటో చూస్తామని సుబ్రమణ్యస్వామికి కోర్టు సూచించింది.