రాహుల్‌ది కాంగ్రెస్, టీఆర్ఎస్ జోడో యాత్ర : బీజేపీ ఎంపీ లక్ష్మణ్

మునుగోడు ఉప ఎన్నిక అహంకారానికి, ఆత్మగౌరవానికి మధ్య జరుగుతోందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. నిన్న కేసీఆర్ చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలు, అసత్యాలు, వక్రీకరణలు తప్ప అందులో ఏమీ లేవని ఆరోపించారు. ప్రధాని మోడీ మీద అరిగిపోయిన టేపు రికార్డులా కేసీఆర్ మాట్లాడారన్నారు. ఎనిమిదేళ్ళుగా రాష్ట్రానికి ఏమీ చేయనిది ఏదో చేస్తానని చెప్తున్నారన్న ఆయన... కొత్తగా ఏదో చేస్తానన్నారంటే... ఈ ఎనిమిదేళ్లలో ఏమీ చేయలేదనే అర్థమని చెప్పారు. చేనేత మీద 5 శాతం జీఎస్టీకి తెలంగాణ ఆర్థిక మంత్రి ఒప్పుకొని సంతకం చేసింది నిజం కాదా? అని ప్రశ్నించారు. 20 లక్షల  టర్నోవర్ మీద పన్ను కోరుకుంది మీరు కాదా? అని నిలదీశారు. నిజంగా చేనేత కార్మికుల మీద ప్రేమ ఉంటే మీ 2.5% వదులుకోవచ్చు కదా? అని అన్నారు. గీతా కార్మికులకు10 లక్షల గీత బంధు ఎందుకు ఇవ్వవు? అని ప్రశ్నించారు.

మునుగోడులో ఎనిమిదేళ్లలో అదనంగా ఒక్క గుంట భూమికి కూడా అదనంగా నీళ్ళు ఇవ్వలేదని లక్ష్మణ్ ఆరోపించారు. దేశం మొత్తంలో 50 మందికి ఒకటి చొప్పున బెల్ట్ షాపు పెట్టించేందుకు జాతీయ రాజకీయాల్లోకి వస్తున్నారా? అని మండిపడ్డారు. మునుగోడు అభివృద్ధి కావాలన్న రాజగోపాల్ రెడ్డిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. రాహుల్ ది కాంగ్రెస్, టీఆర్ఎస్ జోడో యాత్ర అని విమర్శించారు. ఒక్కటిగా ఉండాల్సిన దేశం మూడు ముక్కలు అవ్వడానికి కారణం ఎవరో రాహుల్ చెప్పాలని డిమాండ్ చేశారు. పాకిస్తాన్ ను పక్కల్లో బల్లెంలా చేసింది కాంగ్రెస్ కాదా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంలో అనేక కుంభకోణాలు జరిగాయన్న ఆయన... కాంగ్రెస్ కు ఓటేస్తే టీఆర్ఎస్ కే వేసినట్టని చెప్పారు. మోడీని బీజేపీని ఎదుర్కోవడానికి గుంపులుగా వస్తున్నారని చెప్పారు.