జనం ప్రాణాలతో చెలగాటం : రామేశ్వరం కేఫ్, బాహుబలి కిచెన్ లో ఫుడ్ సేఫ్టీ తనిఖీలు

తెలంగాణ ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులతో హైదరాబాద్ సిటీలోని ప్రముఖ రెస్టారెంట్లలోని బాగోతం బట్టబయలు అవుతుంది. పెద్ద రెస్టారెంట్ అంటే క్వాలిటీ ఫుడ్ ఉంటుందనే భ్రమలను తొలగిస్తున్నారు అధికారులు. హైదరాబాద్ సిటీ సమీపంలోని మాదాపూర్ లో ఉన్న రామేశ్వరం కేఫ్, అదే మాదాపూర్ లో ఉన్న మరో ప్రముఖ రెస్టారెంట్ అయిన బాహుబలి కిచెన్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేశారు. ఈ సోదాల్లో తేదీ ముగిసిన తర్వాత కూడా నిల్వ ఉంచిన నిత్యావసర సరుకులు వెలుగు చూడటం సంచలనంగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

రామేశ్వరం కేఫ్‌లో మార్చి 24న ఎక్స్ ఫైరీ డేట్ అయిపోయిన 100 కిలోల ఉరద్ పప్పు స్టాక్‌ను, 10 కిలోల నందిని పెరుగు, 8 లీటర్ల పాలు ఉన్నట్లుగా ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో బయటపడింది.  అంతేగాక సరిగా లేబుల్ లేని ముడి బియ్యం, తెల్ల లోబియాను స్వాధీనం చేసుకున్నారు. ఆవరణలోని డస్ట్‌బిన్‌లకు మూతలు సరిగా లేకపోవడం, ఫుడ్ హ్యాండ్‌లర్లకు మెడికల్ ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు లేవు. 

బాహుబలి కిచెన్‌లోని వంటగదిలో భారీగా బొద్దింక బెడద కనిపించింది. స్టోర్‌రూమ్‌లోని ఆహార పదార్థాలపై కూడా బొద్దింకలు కనిపించాయి. వంటగది ఆవరణ చాలా అపరిశుభ్రంగా ఉందని, శుభ్రపరిచే ప్రాంతంలో నీరు నిలిచిపోయిందని అధికారుల తనిఖీల్లో గుర్తించారు. 

హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లోని ప్రముఖ బేకరీ లాబొనెల్ ఫైన్ బేకింగ్‌లో టాస్క్‌ఫోర్స్ బృందం తనిఖీలు నిర్వహించింది. తనిఖీలో వారు మోనాలిసా డార్క్/వైట్ చాక్లెట్ క్రిస్పియర్ల్స్ (ఒక్కొక్క ప్యాకెట్) ఎక్స్ ఫైరీ డేట్ ముగిసినట్లు గుర్తించారు. దాదాపుగా రూ.4 వేల 170 విలువైన వస్తువులను పారేశారు. వీరిపై టాస్క్‌ఫోర్స్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.