ప్రాణాలకు తెగించి.. కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో రైతుల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. భూములు ఇవ్వమని చెబుతున్న రైతులకు కేసీఆర్ సర్కార్ బేడీలు వేస్తోంది. తాజాగా మరోసారి తెలంగాణ రైతులకు బేడీలు వేసి.. భువనగిరి కోర్టులో హాజరుపర్చింది. రాష్ట్ర సర్కారు తీరుపై సర్వత్రా విమర్శలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. తమది రైతు ప్రభుత్వమని గొప్పలు చెప్పుకుంటున్న సర్కార్ మరోసారి రైతులకు బేడీలు వేసి కోర్టులో హాజరుపర్చింది.
అసలేం జరిగింది..?
హైదరాబాద్, వరంగల్ హైవే, యాదాద్రి రోడ్డు విస్తరణకు భూములను సేకరించే పనిలో పడింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే.. సాగు చేసుకుంటున్న తమ భూములను ఇచ్చేది లేదని రైతులు తేగేసి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక ఎకరాకు ఇచ్చే రేటుతో తాము మరోచోట వంద గజాల భూమి కూడా కొనలేమని చెబుతున్నారు రాయగిరి రైతులు. తమ భూములను ఇచ్చేది లేదని గత కొంతకాలంగా రాయగిరి రైతులు పోరాటం చేస్తున్నారు. ఈ క్రమంలో మంత్రి జగదీశ్ రెడ్డిని అడ్డుకున్నందుకు రైతులపై నాన్ బెయిలబుల్ కేసులను నమోదు చేశారు పోలీసులు.
ఇప్పటికే రాయగిరి రైతులు మూడుసార్లు తమ భూములను కోల్పోయారు. మరోసారి తమ భూములను ఇచ్చేది లేదని స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే కాళేశ్వరం- బస్వాపురం ప్రాజెక్టు నిర్మాణం కోసం రైతులు భూములు కోల్పోయారు. అయితే.. భూమికి భూమి తిరిగి ఇవ్వాలని రాయగిరి రైతులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం రైతుల డిమాండ్లకు తలొగ్గడం లేదు. ప్రస్తుతం రైతులకు బేడీలు వేసి, భువనగిరి కోర్టులో హాజరుపర్చడంపై విపక్షాలతో పాటు రైతు సంఘాలు ప్రభుత్వ తీరును తీవ్రంగా తప్పుపడుతున్నాయి.
RRR రైతులను భువనగిరి పీడీఎం కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. 14 రోజులుగా నల్గొండ జిల్లా జైలులో ఉన్నారు. 14 రోజుల రిమాండ్ అనంతరం కోర్టు ముందు హాజరుపరిచారు పోలీసులు. రిమాండ్ లో ఉన్న ఆరుగురు రైతులకు సోమవారం (జూన్ 12న) రోజు కండిషనల్ బెయిల్ మంజూరు చేసింది కోర్టు. మంగళవారం (జూన్ 13న) నలుగురు రైతులను తిరిగి నల్గొండ జైలుకు తరలించనున్నారు పోలీసులు. బెయిల్ ఆర్డర్ కాపీలు నల్గొండకు చేరిన అనంతరం రైతులు విడుదల కానున్నారు.