రైలు ప్రమాదాలు .. సామాన్యులకు శాపం కావొద్దు

ఒక చిన్న ప్రమాదం ఒక కుటుంబాన్ని చిన్నాభిన్నం చేస్తుంది. ఆ కుటుంబం మరల మునుపటి స్థితికి చేరుకోవడం ముమ్మాటికి అసాధ్యం. అటువంటి సాధారణ కుటుంబాలను తమ గమ్యస్థానాలకు అనునిత్యం చేర్చడానికి 13,169 రైళ్లు కృషి చేస్తున్నాయి. జూన్ 2, 2023న కోరమండల్ ఎక్స్​ప్రెస్, బెంగళూరు హౌరా ఎక్స్​ ప్రెస్   రైలులో ప్రయాణిస్తున్న సుమారు 2000 మంది బాలాసోర్, ఒరిస్సాలో ప్రమాదానికి గురైనారు. ఈ ప్రమాదంలో 275 మంది ఇప్పటికే మరణించారని, 900 మంది గాయపడ్డారని రైల్వే వర్గాలు తెలియజేస్తున్నాయి. మృతుల సంఖ్య పెరగవచ్చని అంచనా.

గతంలో అనేక దుర్ఘటనలు

స్వతంత్ర భారతంలో ఇటువంటి రైల్వే ప్రమాదాలు కొత్త కాకపోవచ్చు. తాజా సంఘటన దేశవ్యాప్తంగా ఒక విషాదాన్ని నింపింది. 1981 జులైలో  బీహార్ లో జరిగిన దుర్ఘటన సుమారు 800 మందిని పొట్టన పెట్టుకున్నది. భాగమతి నదిలో శవాల కోసం 8 రోజుల రెస్క్యూ ఆపరేషన్ చేసినట్లుగా చెప్పబడింది. దీనిపైన సమగ్ర నివేదిక అందుబాటులో లేకపోవడం మన దురదృష్టకరం. 20 ఆగస్టు 1995 ఉత్తరప్రదేశ్​లోని ఫిరోజాబాద్ సమీపంలో కలిదండి ఎక్స్​ ప్రెస్ ను సుమారు 70 కిలోమీటర్ల వేగంతో పురుషోత్తం ఎక్స్​ప్రెస్ వెనక నుండి ఢీకొట్టి 358 మంది ప్రాణాలను గాలిలో కలిపివేసింది.

ఇవి కాక అనేక దుర్ఘటనలు వేల మందిని పొట్టన పెట్టుకొని, లక్షల మంది ప్రజలను నిర్భాగ్యులుగా మిగిల్చింది. వాటిలో కొన్ని గైసర్ రైలు దుర్ఘటన - 285 మంది, ఖన్నా రైలు దుర్ఘటన - 212 మంది, రఫీగంజ్ రైలు దుర్ఘటన - 200 మంది, రామేశ్వరం తుఫాను వల్ల జరిగిన రైలు దుర్ఘటన 150 మంది, జ్ఞానేశ్వరి రైలు దుర్ఘటన 148 మంది చనిపోయారు. రైల్వే వ్యవస్థ ముఖ్యంగా పేద, మధ్యతరగతి వర్గాల ప్రయాణ వనరు. జనరల్ బోగీలలో ప్రయాణించే వారి ప్రయాణ వివరాలు ఎక్కడా కూడా నమోదు చేయబడవు. వీరి కుటుంబాలు ప్రమాదానికి గురి అయినప్పుడు ప్రయాణిస్తున్న వ్యక్తుల వివరాలు తెలియక, అరకొరగా వచ్చే సహాయం అందక, వారిపై ఆధారపడిన కుటుంబాలు అగమ్యగోచరం అవుతున్నాయి. 

ప్రైవేటే పరిష్కారమా?

సుమారు 161 సంవత్సరాల అనుభవం కలిగి 19 జోన్లుగా 70 డివిజన్లుగా విభజించబడిన రైల్వే పాలన వ్యవస్థ పరిపాలనలో సమర్థవంతంగా ఉన్నప్పటికీ, పాలకులు రైల్వేల ప్రగతిని దెబ్బ కొడుతున్నారు అంటే అవునని సమాధానం మనకు వినిపిస్తుంది. నీతి ఆయోగ్ ‘భారత్ గౌరవ్’ పథకం కింద రైల్వే లను ప్రైవేటు పరం చేయాలని నిశ్చయించి, కేవలం రెండు సంవత్సరాలలోనే 151 ప్రైవేట్ రైళ్లను మన దేశంలో తీసుకొని వచ్చే విధంగా సదుపాయాలను కల్పించింది. అంటే ఈ ప్రజా ప్రయాణ వాహిక సామాన్యునికి అత్యంత తొందరలో దూరం కాబోతుందనే అనుమానాలు పెరిగే అవకాశం ఉంది. ప్రైవేటీకరణ వల్ల నూతన టెక్నాలజీ, నిర్వహణ ఖర్చులకు కళ్లెం, డిమాండ్ సప్లై లో ఉన్న అంతరాన్ని తగ్గించడం వంటి లక్ష్యాలను ఛేదించడం ముఖ్య ఉద్దేశం అని చెప్పినప్పటికీ అవి వాస్తవికతకు దగ్గరగా ఉండాలి.

విమాన ప్రయాణ ఖర్చులు ఇంచుమించు ఈ ప్రైవేట్ రైళ్ల ప్రయాణ ఖర్చు సమానంగా ఉండటమే ఇది వాస్తవిక లక్ష్యాలకు దూరంగా ఉన్నదని మనకు తెలియజేస్తుంది. ఉద్యోగ కల్పతరువుగా ఉన్న నేటి రైల్వే సుమారు 13 లక్షల 30 వేల మందికి ఉపాధి కల్పిస్తూ ప్రపంచంలో అత్యధిక ఉద్యోగాలను కల్పిస్తున్న సంస్థలలో రెండవ స్థానంలో ఉన్నది. నీతి ఆయోగ్ ద్వారా చేపడుతున్న భారత్ గౌరవ్ పథకం ద్వారా వచ్చే ప్రైవేట్ రైలు ఉద్యోగ కల్పన, ఉద్యోగ భద్రత అనే అంశాలను ప్రశ్నార్ధకంగా మారుస్తున్నాయి అనే వాదన కూడా వినిపిస్తున్నది.

మన మూల విషయమైనా ప్రమాదాలపై దృష్టిని మరలిస్తే అత్యాధునిక టెక్నాలజీ కలిగి ఉన్నప్పటికీ, సమర్థవంతమైన సిగ్నలింగ్ వ్యవస్థ ఉన్నప్పటికీ, వేల మంది నిష్ణాతులైన ఇంజనీర్లు, నిఘా వ్యవస్థ ఉన్నప్పటికీ ప్రమాదాలు జరుగుతున్నాయి అంటే ప్రభుత్వం, వ్యవస్థలు తమ ప్రాథమిక అంశాల పైన చర్చ జరపవలసిన అవసరాన్ని బాలాసోర్​ దుస్సంఘటన గుర్తుచేస్తున్నది.ఒక సగటు రైల్వే ఉద్యోగిని కదిపితే సుమారు 12 గంటల పని భారం, నియమాల ఉల్లంఘన, నిఘా లోపం, కరోనా తదనంతరం ఖాళీలను పూరించడంలో నిర్లిప్తత ఇవన్నీ తమకు శరాఘాతంగా ఉన్నాయనేది ఉద్యోగి కోణం! ఏది ఏమైనా ఓ రైలూ.. గమ్యానికి క్షేమంగా చేర్చు అని ప్రాధేయపడుతున్నది సగటు ప్రయాణికుడే!  బాలాసోర్ దుర్ఘటనలో మరణించిన వారందరికీ శ్రద్ధాంజలి. రైల్వే ప్రయాణ భద్రత పట్ల పాలకులు పూర్తి శ్రద్ధ తీసుకుంటారని ఆశిద్దాం!

భారతీయ రైల్వేది  గొప్ప చరిత్ర

దేశం ఒక దేహం అయితే దానిలోని రైలు పట్టాలు రక్తనాళాలుగా అభివర్ణించి, దానిలో ప్రయాణించే ప్రయాణికులు, వస్తు సేవలు దేశ సామాజిక, ఆర్థిక ముఖచిత్రాన్ని రంగవల్లులుగా మార్చే వ్యవస్థనే భారత రైల్వే అని భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు నంద్యాలలో జరిగిన ఒక సభలో ప్రసంగించినట్టు గుర్తు. అది వాస్తవికతకు చాలా దగ్గరగా ఉన్నది. ప్రపంచంలో నాలుగవ అతిపెద్ద రైల్వే వ్యవస్థను కలిగి ఉన్నాం.  1,28,035 కిలోమీటర్ల రైలు మార్గం, 68,043 కిలోమీటర్ల రైలు రోడ్డు సామర్థ్యం, 7235 రైల్వే స్టేషన్ లను కలిగి ఉన్నాము. సుమారు మూడు కోట్ల మందిని 13,169 రైళ్ల ద్వారా, అదే విధంగా 28 లక్షల మెట్రిక్ టన్నుల సరుకులను 8,479 గూడ్స్ రైళ్ల ద్వారా ప్రతిరోజు గమ్యస్థానాలకు చేరుస్తున్నది మన భారత రైల్వే!

- ఏలె వెంకట నారాయణ,  సోషల్​​యాక్టివిస్ట్