కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ

కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ
  • ఓవర్ హాలింగ్ వర్క్ షాప్ అప్ గ్రేడ్​కు కేంద్రం  అంగీకారం
  • సీఎం రేవంత్ చొరవతో కల సాకారం 
  • విభజన చట్టంలోని పెండింగ్ అంశాలపై ఢిల్లీలో మీటింగ్ 
  • హాజరైన తెలంగాణ అధికారులు

న్యూఢిల్లీ, వెలుగు: విభజన చట్టంలోని హామీల అమలుపై మరో ముందడుగు పడింది. సీఎం రేవంత్ రెడ్డి చొరవతో పెండింగ్ సమస్యలను పరిష్కరించేందుకు కేంద్రం ముందుకొచ్చింది. ప్రధానంగా షెడ్యూల్ 13లోని కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ట్రైబల్ యూనివర్సిటీ, హార్టికల్చర్ వర్సిటీ, ఇతర సంస్థల ఏర్పాటు విషయంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన విజ్ఞప్తులపై సానుకూలంగా స్పందించింది. 

కాజీపేటలో ఏర్పాటు చేసిన ఓవర్ హాలింగ్ వర్క్ షాప్ ను ఇంటిగ్రేటెడ్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీగా అప్ గ్రేడ్ చేస్తున్నట్టు ప్రకటించింది. విభజన చట్టంలోని హామీలపై గురువారం ఢిల్లీలోని నార్త్ బ్లాక్ లో కేంద్ర హోంశాఖ సెక్రటరీ గోవింద్ మోహన్ నేతృత్వంలో కీలక సమావేశం జరిగింది. ఇందులో తెలంగాణ సీఎస్ శాంతికుమారి, స్పెషల్ చీఫ్ సెక్రటరీలు కె.రామకృష్ణారావు, వికాస్ రాజ్, పంచాయతీ రాజ్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, అగ్రికల్చర్ సెక్రటరీ సురేందర్ మోహన్, గనుల శాఖ సెక్రటరీ శరత్, తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ తదితరులు పాల్గొన్నారు. మధ్యాహ్నం 12:15 నుంచి ఒంటి గంట వరకు జరిగిన ఈ సమావేశంలో షెడ్యూల్ 13లోని ట్రైబల్, హార్టికల్చర్ యూనివర్సిటీల ఏర్పాటు, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం స్టీల్ ప్లాంట్, ఎన్టీపీసీ సెకండ్ ఫేజ్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు వంటి అంశాలపై కీలకంగా చర్చించారు. 

బయ్యారం స్టీల్ ప్లాంట్ పై మరింత స్టడీ.. 

విభజన చట్టంలోని హామీల అమలుకు సంబంధించి కేంద్ర హోంశాఖ నోడల్ ఆఫీసుగా వ్యవహరిస్తున్నది. ఇప్పటికే పలుమార్లు మీటింగ్ జరిగినా షెడ్యూల్ 13లోని హామీలపై ముందడుగు పడలేదు. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరాక హామీలు అమలు చేయాలని కేంద్రానికి తరచూ వినతిపత్రాలు అందజేసింది. ఈ క్రమంలో కాజీపేటలోని ఓవర్ హాలింగ్ వర్క్ షాప్ ను కోచ్ ఫ్యాక్టరీగా అప్ గ్రేడ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నట్టు సమావేశంలో తెలంగాణ అధికారులకు కేంద్ర హోంశాఖ సెక్రటరీ తెలిపారు. 

Also Read:-మెట్రోతోనే ట్రాఫిక్ కష్టాలు తగ్గుతయ్..

అలాగే ఎన్టీపీసీ ఫస్ట్ ఫేజ్ లో 4వేల మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ పూర్తి కాగా, సెకండ్ ఫేజ్ ను త్వరలో ప్రారంభించేందుకు కేంద్రం అంగీకారం తెలిపింది. అయితే బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ఫీజిబులిటి లేని కారణంగా దానిపై మరింత స్టడీ చేస్తున్నట్టు పేర్కొంది. ఇక ములుగు ట్రైబల్ వర్సిటీలో వీసీ, సిబ్బంది నియామకానికి పర్మనెంట్ ఏర్పాట్లు చేయాలని కోరగా.. అందుకు చర్యలు తీసుకుంటామని కేంద్ర అధికారులు తెలిపారు. అలాగే మిగిలిన హామీలను కూడా త్వరగా నెరవేర్చాలని కోరగా సానుకూలంగా స్పందించారు.

సీఎం రేవంత్ కృషితో... 

రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పడిన తర్వాత ప్రధాని మోదీని సీఎం రేవంత్ రెడ్డి రెండుసార్లు కలిశారు. గతేడాది డిసెంబర్ 26, ఈ ఏడాది జులై 4న ప్రధానితో సమావేశమై విభజన చట్టంలోని పెండింగ్ అంశాలను పరిష్కరించాలని కోరారు. బ‌‌‌‌య్యారం స్టీల్ ప్లాంట్‌‌‌‌, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ట్రైబల్ వర్సిటీలో అడ్మిషన్లకు అనుమతి తదితర అంశాలను ప్రస్తావించారు. కాజీపేటలో ఓవర్ హాలింగ్ వర్క్ షాప్ ను 2023లో రైల్వే శాఖ ప్రకటించగా, ఇచ్చిన హామీ మేరకు కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని కోరారు. సీఎం రేవంత్ విజ్ఞప్తితో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు కేంద్రం అంగీకారం తెలిపింది.