
న్యూఢిల్లీ, వెలుగు: తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ముఖ్యమైన స్టేషన్లలో పలు రైళ్లు ఆపాలంటూ ఎన్నోరోజులుగా తెలంగాణ, ఏపీ ప్రజలు చేస్తున్న డిమాండ్ల పై రైల్వే శాఖ సానుకూలంగా స్పందించింది. తెలంగాణలోని బెల్లంపల్లి, సిర్పూర్–కాగజ్‌నగర్, మహబూబ్‌నగర్, షాద్‌నగర్, గద్వాల్ స్టేషన్లలో పలు రైళ్లను ఆపనున్నట్లు సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఏపీలోని పిడుగురాళ్ల, నడికుడి, సత్తెనపల్లి, డోర్నకల్, బొబ్బిలి, దువ్వాడ, పీలేరు స్టేషన్లలో వివిధ రైళ్లను ఆపనున్నట్లు వెల్లడించింది. తెలుగు ప్రజల డిమాండ్లను ఇటీవల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయా స్టేషన్లలో ముఖ్యమైన రైళ్లను ఆపడం ద్వారా ప్రజలకు కలిగే సౌకర్యం గురించి వివరించారు. ఇందుకు అనుగుణంగా రైల్వే అధికారులతో చర్చించిన మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఆయా రైల్వే స్టేషన్లలో వివిధ ప్రధాన రైళ్లను ఆపాలని ఆదేశాలిచ్చారు. త్వరలో రైళ్ల హాల్టింగ్స్, వాటి అనుగుణంగా మారే టైం టేబుల్ వెల్లడికానుంది. రైల్వే నిర్ణయంపై కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.
తెలంగాణలో ఆగనున్న ట్రైన్లు ఇవే..
బెల్లంపల్లి స్టేషన్లో.. సికింద్రాబా–గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్, తిరుపతి–హజ్రత్ నిజాముద్దీన్ ఎక్స్‌ప్రెస్, హైదరాబాద్–హజ్రత్ నిజాముద్దీన్ ఎక్స్ ప్రెస్, సికింద్రాబాద్–రాయ్‌పూర్ ఎక్స్‌ప్రెస్, ఎర్నాకులం–పట్నా ఎక్స్‌ప్రెస్ ఆగనున్నాయి. మహబూబ్ నగర్ స్టేషన్లో.. గోరఖ్‌పూర్–యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్, నాగర్సోల్–చెన్నై ఎక్స్‌ప్రెస్, డాక్టర్ అంబేద్కర్‌నగర్–యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్, యశ్వంత్‌పూర్– నిజాముద్దీన్ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ (12649, 12650) లు హాల్ట్ కానున్నాయి. అలాగే, సిర్పూర్ కాగజ్‌నగర్ స్టేషన్లో.. బెంగళూరు–పాటలీపుత్ర ఎక్స్‌ప్రెస్, షాద్‌నగర్ స్టేషన్లో కాచిగూడ– చెంగల్ పట్టు ఎక్స్‌ప్రెస్, గద్వాల్ స్టేషన్లో.. హైదరాబాద్– వాస్కోడిగామా ఎక్స్‌ప్రెస్, జైపూర్–మైసూర్ ఎక్స్‌ప్రెస్, డోర్నకల్ స్టేషన్లో.. లింగంపల్లి–కాకినాడ ఎక్స్‌ప్రెస్, మచిలీపట్నం–బీదర్ ఎక్స్‌ప్రెస్ ఆగనున్నాయి.