ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

నిజామాబాద్‌‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌‌

నిజామాబాద్‌‌/మాక్లూర్‌‌‌‌, వెలుగు: నరేంద్ర మోడీ ప్రభుత్వ హయాంలో రైల్వే అభివృద్ధి జెట్​స్పీడ్‌‌లో దూసుకుపోతుందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ చెప్పారు. నిజామాబాద్‌‌ జిల్లా ఇందల్వాయి రైల్వేస్టేషన్‌‌లో రూ.1.25 కోట్లతో నిర్మించిన ఫుట్ ఓవర్ బ్రిడ్జిని శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం రైల్వే డిపార్ట్‌‌మెంట్‌‌లో  సంస్కరణలు తీసుకువచ్చిందన్నారు. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు రైళ్ల సంఖ్యను, వాటి వేగాన్ని కూడా పెంచిందన్నారు.

కాలుష్యాన్ని తగ్గించేందుకు రైల్వే లైన్లను ఎలక్ట్రిఫికేషన్ చేస్తుందన్నారు. ట్రైన్ యాక్సిడెంట్స్ నివారించేందుకు కవచ్ సిస్టమ్ తీసుకువచ్చిందని చెప్పారు. ఈ సిస్టమ్‌‌తో ఒక కిలోమీటర్​లోపు ఏదైనా ట్రైన్ ఉంటే అటోమేటిక్‌‌గా బ్రేక్‌‌లు పడతాయని వివరించారు. నిజామాబాద్ రైల్వే స్టేషన్‌‌లో ఎక్కువ రైళ్లను నిలిపేందుకు, లూప్ లైన్లను నిర్మించేందుకు స్థలం లేకపోవడంతో అక్కడి గూడ్స్ షెడ్‌‌ను డిచ్‌‌పల్లికి తరలించామని తెలిపారు. దీని వల్ల డిచ్‌‌పల్లి వ్యాపార కేంద్రంగా ఎదిగేందుకు ఛాన్స్ ఉందన్నారు.

ఆర్వోబీలకు స్టేట్ ఫండ్స్ ఇస్తలేరు..

మాధవనగర్​ఆర్వోబీకి రాష్ట్ర ప్రభుత్వం తన వాటా ఫండ్స్ ఇవ్వడంలేదని ఎంపీ అర్వింద్‌‌ ఆరోపించారు. ఆర్వోబీపై స్టేట్ పేపర్ వర్క్ మాత్రమే చేసిందని, నిర్మాణానికి అవసరమైన నిధులను కేటాయించడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజామాబాద్, ఆర్మూర్, జగిత్యాల రైల్వే లైన్ కొత్తది కావడంతో అక్కడ వంద శాతం కేంద్ర నిధులతో ఆర్వోబీ పనులు జరుగుతున్నాయన్నారు. ఆర్మూర్‌‌‌‌లోని మూడు 
ఆర్వోబీలు త్వరలో అందుబాటులోకి వస్తాయన్నారు. కార్యక్రమంలో  రైల్వే ఆఫీసర్లు డీఆర్ఎం శరత్​చంద్రయాన్, ఏడీఆర్ఎం రామకృష్ణ, డీఈఎన్ మోతీలాల్ నాయక్, అభిరామ్, బీజేపీ నిజామాబాద్ రూరల్ ఇన్‌‌చార్జి కులాచారి దినేశ్‌‌కుమార్, బీజేవైఎం జిల్లా ప్రెసిడెంట్ రాజశేఖర్, ఎంపీపీ గద్దె భూమన్న, పార్టీ మండల ప్రెసిడెంట్ నాయిడి రాజన్న పాల్గొన్నారు. అంతకుముందు ఎంపీ మాక్లూర్ మండలంలోని 
రాంచంద్రపల్లిని విజిట్ చేశారు. గ్రామస్తులు, యువకులతో మాట్లాడి సమస్యలను పరిష్కారిస్తామని హామీ ఇచ్చారు. ఆయన వెంట కంచెట్టి గంగాధర్, గంగోనె సంతోష్, నూతుల శ్రీనివాస్, వినోద్ ఉన్నారు.

ఐలమ్మ విగ్రహం జోలికొస్తే ఊరుకోం

బీజేపీ రాష్ట్ర కమిటీ సభ్యుడు ధన్‌‌పాల్‌‌ సూర్యనారాయణ

నిజామాబాద్, వెలుగు: ఇందూరు బైపాస్ రోడ్‌‌లో చాకలి ఐలమ్మ విగ్రహాన్ని తొలిగించేందుకు ప్రయత్నిస్తే ఊరుకోబోమని బీజేపీ రాష్ట్ర కమిటీ సభ్యుడు ధన్‌‌పాల్‌‌ సూర్యనారాయణ హెచ్చరించారు. టీఆర్ఎస్​ ప్రభుత్వం రియల్టర్లతో కుమ్మక్కైందని ఆరోపించారు. నిజామాబాద్ 8వ డివిజన్‌‌లోని బైపాస్ రోడ్‌‌లో ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఆదివారం ఆవిష్కరించనున్నారు. అయితే మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసర్లు శనివారం విగ్రహం తొలగించాలని నోటీసులు జారీ చేశారు.

ఈ నేపథ్యంలో ఐలమ్మ విగ్రహా ప్రాంతాన్ని ధన్‌పాల్‌ సందర్శించి రజక సంఘం సభ్యులకు సంఘీభావం తెలిపారు. చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంలో అడ్డంకులు సృష్టిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. విగ్రహ ఏర్పాటుకు ఎమ్మెల్యే బిగాల గణేశ్‌ గుప్తా భూమి పూజ చేశారని గుర్తుచేశారు. స్థానిక మాజీ కార్పొరేటర్ విగ్రహాన్ని ఇచ్చారని, ఇప్పుడు అన్ని ఏర్పాట్లు చేసిన తర్వాత ఎందుకు అనుమతులు లేవని అడ్డుకుంటున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారుల లబ్ధి కోసమే అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆరోపించారు. విగ్రహ ఆవిష్కరణను అడ్డుకోవాలని చూస్తే ఊరుకోబోమన్నారు.

టీబీ కేసులు తగ్గించాం..

బోధన్​,వెలుగు: నిజామాబాద్‌‌ను టీబీ రహిత జిల్లాగా మార్చడానికి చర్యలు తీసుకుంటున్నామని, ఇప్పటికే జిల్లాలో 60 శాతం టీబీ కేసులు తగ్గించామని సాలూర పీహెచ్‌‌సీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రేఖ, టీబీ సూపర్ వైజర్ మంజుల చెప్పారు. బోధన్ మండలం హున్సా  గ్రామంలో టీబీ నిర్ధారణ వైద్య  శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కలెక్టర్ ఆదేశాల మేరకు వైద్య సిబ్బంది నేరుగా గ్రామాల్లోకి వెళ్లి పరీక్షలు చేసి టీబీ రోగులను గుర్తిస్తున్నట్లు తెలిపారు. నిజామాబాద్ జిల్లాలో గతంలో టీబీ కేసులు యేడాదికి 3,427  ఉండగా అవి 60 శాతానికి తగ్గాయని చెప్పారు. కార్యక్రమంలో సర్పంచ్​చీల గంగామణి, ల్యాబ్​ టెక్నీషియన్ శ్రీకాంత్, హెచ్‌‌ఐవీ కోఆర్డినేటర్ స్రవంతి, సూపర్​వైజర్లు ఇందిరా, ఫాయిమున్నీసా బేగం,హెచ్ఈవో రత్నాకర్, చీల గంగారాం, శివారాజ్​పటేల్‌‌ పాల్గొన్నారు.

వృద్ధుల అనుభవాలు సమాజానికి అవసరం

నిజామాబాద్ టౌన్, వెలుగు: వయో వృద్ధుల అనుభవాలు సమాజానికి ఎంతో ఉపయుక్తంగా నిలుస్తాయని జడ్పీ చైర్మన్ దాదాన్నగారి విఠల్‌‌రావు అన్నారు. నగరంలోని న్యూ అంబేద్కర్‌‌‌‌ భవన్‌‌లో మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో శనివారం ప్రపంచ వయో వృద్ధులు దినోత్సవం ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు సూదాం లక్ష్మి, మేయర్ నీతు కిరణ్, అడిషనల్‌‌ కలెక్టర్ చంద్రశేఖర్, ఆర్డీవో రవి పాల్గొన్నారు.

వీడీసీ అధ్యక్షుడిగా శ్రీనివాస్​రెడ్డి

లింగంపేట,వెలుగు: లింగంపేట మండలం ఐలాపూర్ గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడిగా తుమ్మలపల్లి శ్రీనివాస్‌‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శనివారం గ్రామస్తుల సమక్షంలో అభివృద్ధి కమిటీని ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షుడిగా నీరడి పరంధాములు, కోశాధికారిగా నడిమింటి దుర్గారెడ్డి, కార్యదర్శిగా డాకాయల మల్లయ్య, సలహాదారులుగా పెద్దోల్ల పోచయ్య, జంగంపల్లి సాయాగౌడ్, కమ్మరి సుభాష్, దుడ్డె పోచయ్య, డాక్టర్​నర్సయ్య ఎన్నియ్యారు. కార్యక్రమంలో గ్రామానికి చెందిన గుడ్ల సాయిలు, ఉప సర్పంచ్‌‌ సాయిలు, నీరడి రవి, కాశీరాం,  వెంకట్‌‌గౌడ్, కిష్టాగౌడ్‌‌, సాయిలు పాలిపారు.

శతాధిక వృద్ధురాలికి సన్మానం

పిట్లం, వెలుగు: మండలం సీతారాంపల్లికి చెందిన శతాధిక వృద్ధురాలుని మద్దూరి రత్నమ్మ (102)ను బిచ్కుంద తహసీల్దార్ రవికాంత్, సీతారాంపల్లి సర్పంచ్ గంగారెడ్డి శనివారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా తహసీల్దార్​ మాట్లాడుతూ రత్నమ్మ వంద ఏళ్లు పూర్తి అయినందున ఎన్నికల కమిషన్​సూచన మేరకు ఆమెను సీనియర్ సిటీజన్‌‌గా గుర్తించి సన్మానించినట్లు తెలిపారు. రత్నమ్మ కుమారులు విఠల్‌‌రెడ్డికి 84 ఏళ్లు కాగా రెండో కుమారుడు కిష్టారెడ్డికి 80 ఏళ్లు ఉన్నాయని తెలిపారు. సీనియర్ సిటీజన్ అయిన రత్నమ్మను సన్మానించుకోవడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమలో రత్నమ్మ మనవడు వెంకటరెడ్డి, మనమరాలు విజయలక్ష్మి, గ్రామస్థులు పాల్గొన్నారు.

టీబీ రోగులకు పౌష్టికాహారం పంపిణీ

కామారెడ్డి, వెలుగు: ప్రధాన మంత్రి టీబీ ముక్త్ భారత్ అభియాన్​లో భాగంగా  కామారెడ్డి నియోజక వర్గంలోని టీబీ రోగులకు బీజేపీ కామారెడ్డి నియోజకవర్గ ఇన్‌‌చార్జి కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఆరు నెలల పాటు పౌష్టికాహారాన్ని ఉచితంగా అందించారు. జిల్లా హాస్పిటల్‌‌లో శనివారం రోగులకు ఉచితంగా ఆహార  పదార్థాలు పంపిణీ చేశారు. పార్టీ జిల్లా వైస్​ప్రెసిడెంట్ ఆకుల భరత్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మోటూరి శ్రీకాంత్, పార్టీ లీడర్​ డాక్టర్ విరేశం, ప్రోగ్రాం ఆఫీసర్ ప్రవీణ్‌‌, డీపీసీ నిలీమ పాల్గొన్నారు. 

ప్రైవేట్‌‌ హాస్పిటళ్లపై కొరడా!

రూల్స్ పాటించని 48 హాస్పిటళ్లకు షోకాజ్ నోటీసులు

పర్మిషన్​ లేని ఒక ప్రైవేట్ హాస్పిటల్‌‌ను సీజ్​ చేసిన ఆఫీసర్లు

నిజామాబాద్,  వెలుగు: జిల్లాలోని ప్రైవేట్‌‌ హాస్పిటళ్లపై వైద్య ఆరోగ్య శాఖ కొరడా ఝుళిపించింది. ‘నోటీసులు సరే.. చర్యలేవి?’ అనే శీర్షకతో ‘వెలుగు’లో వచ్చిన కథనానికి ఆ శాఖ ఆఫీసర్లు స్పందించారు. పర్మిషన్‌‌ లేకుండా నడుస్తున్న ఒక దవాఖానాను సీజ్‌‌ చేయడంతో పాటు నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న 48  ప్రైవేట్ హాస్పిటళ్లకు నోటీజులు జారీ చేశారు. రూల్స్‌‌ ప్రకారం తక్షణమే ఏర్పాట్లు చేయాలని లేకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఎనిమిది టీంలుగా...

ప్రైవేట్‌‌ హాస్పిటళ్లలో మౌలిక సదుపాయాలపై జిల్లా వైద్యఆరోగ్య శాఖ ఎనిమిది బృందాలతో తనిఖీలు చేపట్టింది. గత నెల 23 నుంచి 30వ తేదీ వరకు నిర్వహించిన ఈ తనిఖీల్లో కనీస వసతులు, డాక్టర్లు, పర్మిషన్‌‌ తదితర వివరాలు క్షుణ్ణంగా పరిశీలించారు.  వారం రోజుల్లో 145 ప్రైవేటు ఆస్పత్రుల్లో ఈ తనిఖీ జరిగాయి. ఇందులో రూల్స్‌‌ పాటించని 48 హాస్పిటళ్లకు నోటీసుల జారీ చేశారు. 15 రోజుల్లో మౌలిక సదుపాయాలు సమకూర్చాలని ఉన్న వాటిలో సౌకర్యాలు మెరుగుపర్చాలని అందులో పేర్కొన్నారు. నిర్లక్ష్యం వహిస్తే చట్టపరమైన చర్యలు చేపడుతామని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు హెచ్చరించారు. ఇక రిజిస్ట్రేషన్ లేకుండా కొనసాగుతున్న శ్రీఓం హాస్పిటల్‌‌ను డీఎంహెచ్‌‌వో సుదర్శనం ఆదేశాలతో సీజ్‌‌ చేశారు. ఎవరు రూల్స్‌‌ పాటించకున్నా కఠిన చర్యలు తప్పవని ఆయన  హెచ్చరించారు.  

దేవీ ఉత్సవాలకు ఎమ్మెల్యే విరాళం

బోధన్, వెలుగు: పట్టణంలో నిర్వహించే సార్వజనిక్ దుర్గామాత శరన్నవరాత్రి  ఉత్సవాల నిర్వహణకు ఎమ్మెల్యే షకీల్‌‌ రూ.50 వేలు విరాళం అందించినట్లు ఉత్సవ కమిటీ ప్రెసిడెంట్​ రాజులదేవి పవన్‌‌కుమార్‌‌‌‌ చెప్పారు. శనివారం ఉత్సవ కమిటీ సభ్యులు ప్రెస్​మీట్ నిర్వహించి ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో శివాలయం చైర్మన్‌‌ భరత్‌‌యాదవ్, హనుమాన్​ మందిరం చైర్మన్‌‌ గుమ్ముల అశోక్‌‌రెడ్డి, సార్వజనిక్​ప్రధాన కార్యదర్శి చింతాకుల లోకేశ్‌‌గౌడ్, కమిటీ సభ్యులు సాధుల ప్రవీణ్‌‌కుమార్‌‌‌‌, గౌతమ్‌‌గౌడ్, రవి, పూజారి లింగం  తదితరులు పాల్గొన్నారు. ​

గిరిజన రిజర్వేషన్‌‌ పెంపుపై హర్షం

కోటగిరి, వెలుగు: తెలంగాణ రాష్ట్రంలో గిరిజనుల రిజర్వేషన్‌‌ను 6 నుంచి 10 శాతానికి పెంచడం హర్షణీయమని జడ్పీటీసీ శంకర్ పటేల్ అన్నారు. రిజర్వేషన్‌‌ పెంపు జీవో విడులపై సంతోషం వ్యక్తం చేస్తూ కోటగిరిలో గిరిజనులు, ఎస్టీ నాయకులు సీఎం కేసీఆర్, స్పీకర్ పోచారం శ్రీనివాస్‌‌రెడ్డి ఫొటోలకు శనివారం క్షీరాభిషేకం చేశారు. కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం జనాభా ప్రాతిపాదికన ఎస్టీలకు రిజర్వేషన్ పెంచటం హర్షించదగ్గ విషయమన్నారు. కార్యక్రమంలో మండల టీఆర్‌‌‌‌ఎస్ అధ్యక్షుడు ఎజాస్ ఖాన్, వ్లేలపల్లి శ్రీనివాస్, ఎస్టీ నాయకులు రాములు, వివేక్, తుకారం, ఫకీరా, జుబేర్, జాకీర్, బాబుఖాన్‌‌ పాల్గొన్నారు.

సెంట్రల్ లైటింగ్‌‌ను ప్రారంభించిన విప్

భిక్కనూరు, వెలుగు: మండల కేంద్రంలో రూ.5.50 కోట్లతో ఏర్పాటు చేసిన రోడ్డు డివైడర్లు, సెంట్రల్ లైటింగ్‌‌ను ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ తునికి వేణు అధ్యక్షుతన జరిగిన సమావేశంలో విప్ మాట్లాడుతూ కొత్తగా ఏర్పాడిన కామారెడ్డి జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని సీఎం కేసీఆర్‌‌‌‌ కృత నిశ్చయంతో ఉన్నారన్నారు. ఈ సంవత్సరం ఇప్పటికే దాదాపు రూ.8 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు చేసినట్లు చెప్పారు.

బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కేవలం వారి లబ్ధి కోసమే పని చేసుకుంటాయన్నారు. రెండు సార్లు మంత్రిగా ఉన్న షబ్బీర్ అప్పుడు ఎలాంటి అభివృద్ధి చేయకుండా ఇప్పుడు మాట్లాడుతున్నారని విమర్శించారు. కార్యక్రమంలో కలెక్టర్ జితిష్ వి పాటిల్‌‌, ఎంపీపీ గాల్‌‌రెడ్డి, జడ్పీటీసీ పద్మనాగభూషణంగౌడ్, మార్కెట్ చైర్మన్ భగవంత్‌‌రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నరసింహరెడ్డి, అందె మహేందర్‌‌‌‌రెడ్డి, రైతు కమిటీ మండల కన్వీనర్ బొండ్ల రాంచంద్రం, అడ్వకేట్ నంద రమేశ్, గజ్జేలా భిక్షపతి పాల్గొన్నారు. 

అంబరాన్నంటిన సంబురం

వెలుగు, నెట్‌‌వర్క్‌‌: ఉమ్మడి నిజామాబాద్‌‌ జిల్లాలో బతుకమ్మ సంబురాలు జరిగాయి. ఏడో రోజైన శనివారం కూడా మహిళలు ఉదయం నుంచే ఉత్సాహంగా బతుకమ్మలను పేర్చి.. సాయంత్రం ప్రధాన కూడళ్లు, దేవాలయాల్లో ఉయ్యాల పాటలు పాడుతూ బతుకమ్మ ఆడారు. అనంతరం సమీప చెరువుల్లో నిమజ్జనం చేశారు. కామారెడ్డి కలెక్టరేట్‌‌లో నిర్వహించిన వేడుకల్లో కలెక్టర్ జితేష్ వి పాటిల్, అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్ దొత్రే, మున్సిపల్ చైర్‌‌‌‌పర్సన్​ నిట్టు జాహ్నవి, మద్నూర్‌‌‌‌లో ఉత్సవాల్లో బీజేపీ కామారెడ్డి జిల్లా ప్రెసిడెంట్ అరుణతార పాల్గొన్నారు. నిజామాబాద్‌‌ ప్రభుత్వ మెడికల్‌‌ కాలేజీ, కలెక్టరేట్‌‌తో పాటు నిజామాబాద్ మహిళా మోర్చా ఆధ్వర్యంలో మహేశ్వరి భవన్‌‌లో కూడా వేడుకలు జరిగాయి. 

టీబీ రోగులకు సరుకుల పంపిణీ

పిట్లం, వెలుగు: టీబీ ముక్త్ భారత్‌‌లో భాగంగా టీబీ వ్యాధిగ్రస్తులకు పిట్లం యాదగిరి మెడికల్ యజమాని శనివారం నిత్యావసర సరుకులు, మందులు అందజేశారు. ఈ సందర్భంగా టీబీ ముక్త్​భారత్​కోఆర్డినేటర్ రేఖ మాట్లాడుతూ2024 వరకు దేశంలో టీబీ ముక్త్​లక్ష్యంగా పని చేస్తున్నట్లు తెలిపారు. మండలంలో 22 మంది రోగులు ఉన్నట్లు వారికి మందులు అందిస్తున్నామని చెప్పారు. వీరికి బలమైన ఆహరం అందించేందుకు దాతల సహకారం తీసుకుంటున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్​దేవేందర్‌‌‌‌రెడ్డి, నాయకులు విజయ్ బియ్యం, నర్సాగౌడ్, బాబాగౌడ్ పాల్గొన్నారు.

నలుగురు దొంగలు అరెస్ట్

నిజామాబాద్ క్రైమ్, వెలుగు: పలు దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు దొంగలను శనివారం పోలీసులు అరెస్టు చేశారు. నగర ఏసీపీ వెంకటేశ్వర్ కథనం ప్రకారం వివరాలను ఇలా ఉన్నాయి. నగరంలోని న్యూ గంజ్ ప్రాంతానికి చెందిన బోయీమ్‌‌ వాడ్ గత నెల 22న తన టాటాఏస్ వాహనం పోయిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా దొంగతనానికి పాల్పడిన ఆరుగురులో నలుగురిని పట్టుకున్నారు.

నాందేడ్ కు చెందిన షేక్ షాదుల్లా, షేక్ ఎజాజ్, స్థానిక ఖోజా కాలనీకి చెందిన షేక్ అజ్మత్, ఆటోనగర్ కు చెందిన  షేక్ అల్తాఫ్‌‌లను అరెస్టు చేశారు. మహారాష్ట్రకు చెందిన రఫీక్, సమీ చౌసే పరారీలో ఉన్నట్లు ఏసీపీ తెలిపారు. వారి వద్ద నుంచి ఒక వాహనాన్ని స్వాధీనం చేసుకుని శనివారం నిందితులను రిమాండ్‌‌కు తరలించారు. మూడో టౌన్ ఎస్సై నరేశ్‌‌, సిబ్బందిని ఏసీపీ వెంకటేశ్వర్, సీఐ శ్రీశైలం ఈ సందర్భంగా అభినందించారు.

సమ్మెకు మద్దతు ఇవ్వాలని వినతి

మాక్లూర్, వెలుగు: సీఎం కేసిఆర్ తమకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్‌‌ చేస్తూ వీఆర్ఏలు చేస్తున్న సమ్మె 69వ రోజుకు చేరుకుంది. తమ సమ్మెకు మద్దతు ఇవ్వాలని కోరుతూ మండల వీఆర్ఏల సంఘం అధ్యక్షుడు గున్నం సంతోష్ రెవెన్యూ సిబ్బంది కోరారు. ఈ మేరకు శనివారం స్థానిక తహసీల్దార్‌‌‌‌ శంకర్‌‌‌‌కు రెండు పెన్‌‌ డౌన్‌‌ పాటించాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో మండల వీఆర్ఏల నాయకులు జనార్దన్‌‌గౌడ్, శిలారి, రాజేశ్వర్, శ్రవంతి, వాణి, ముత్తెన్న, సుమన్ పాల్గొన్నారు.

పట్టపగలే దొంగతనం తాళం పగులగొట్టి 

రూ.12 లక్షల సొత్తు చోరీ

ఆర్మూర్, వెలుగు: ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని కోటార్మూర్‌‌‌‌లో శనివారం పట్టపగలు దొంగతనం జరిగింది. బాధితుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.. పట్టణానికి చెందిన గంగాధర్‌‌‌‌గౌడ్‌‌ ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో కలిసి హాస్పిటల్‌‌ చెక్​అప్ కోసం వెళ్లారు. అదే సమయంలో దొంగలు తాళం పగులగొట్టి చోరీకి పాల్పడ్డారు. సాయంత్రం వచ్చిన గంగాధర్ గౌడ్ తాళం పగులగొట్టి ఉండడంతో చోరీ జరిగిందని గుర్తించాడు. ఇంట్లో వెళ్లి చూడగా బీరువా తెరిచి ఉండడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీఐ సురేశ్‌‌బాబు అక్కడకు చేరుకుని క్లూస్ టీంతో ఆధారాలు సేకరించారు. మూడు రోజుల కింద బర్రెలు అమ్మగా వచ్చిన డబ్బులతో పాటు, చిట్టిలకు సంబంధించిన డబ్బులు రూ.7 లక్షలు,10 తులాల బంగారు ఆభరణాలు చోరీ అయ్యాయని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇదే ఇంట్లో గతంలో ఓసారి దొంగలు చోరీకి పాల్పడ్డారని, రద్దీగా ఉన్న గల్లీలో పట్టపగలే చోరీ జరగడంతో కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.