చకచక.. రైల్వే మూడో లైన్ పనులు..ఖమ్మం రైల్వే స్టేషన్​ లో కొనసాగుతున్న వర్క్స్​

చకచక.. రైల్వే మూడో లైన్ పనులు..ఖమ్మం రైల్వే స్టేషన్​ లో కొనసాగుతున్న వర్క్స్​
  • రెండో ప్లాట్ ఫామ్​కొంత కూల్చివేత
  • 30 రైళ్ల రాకపోకలు రద్దు, పలు రైళ్లు ఆలస్యం

ఖమ్మం, వెలుగు: దక్షిణ మధ్య రైల్వే పరిధిలో కాజీపేట –విజయవాడ​ మధ్య మూడో రైల్వే లైన్​ పనులు చకచక కొనసాగుతున్నాయి. రైల్వే అమృత్ పథకం కింద ఈ పనులు చేపట్టారు. ఖమ్మం మీదుగా హైదరాబాద్, వరంగల్, విజయవాడ పరిధిలో పలు రైళ్లను రద్దు చేసి మరీ వేగంగా పనులు చేస్తున్నారు. ప్రస్తుతం ఖమ్మం రైల్వే స్టేషన్​ సమీపంలో ఇంటర్​లాకింగ్ పనులు జరుగుతున్నాయి. దీని కోసం ఖమ్మం రైల్వే స్టేషన్​ లో రెండో ప్లాట్ ఫామ్​ ను కొంత మేర కూల్చివేశారు. 

కొండపల్లి నుంచి కాజీపేట వరకు పలు స్టేషన్లలో ఇప్పటికే లైన్​ నిర్మాణం పూర్తయింది. మిగిలిన చోట్ల పనులు స్పీడప్​ చేసి జూన్​ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కొండపల్లి - మధిర మధ్య మూడో లైన్​ నిర్మాణం పనులు పూర్తికాగా ఇటీవల ట్రయల్ రన్​ కూడా నిర్వహించారు. మధిర నుంచి మోటమర్రి వరకు మూడో లైన్​ ను మార్చి వరకు, మోటమర్రి నుంచి పందిళ్లపల్లి స్టేషన్​ వరకు ఏప్రిల్ లోపు పనులు పూర్తి చేయాలని ప్లాన్​చేస్తున్నారు. ఈ పనుల కారణంగా పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఇదంతా పూర్తయ్యాక ఖమ్మం నుంచి డోర్నకల్ వరకు, ఆ తర్వాత మహబూబాబాద్​ వరకు పనులు చేయనున్నారు. 

చిన్నచిన్న పనులు పెండింగ్..

మహబూబాబాద్​నుంచి నెక్కొండ వరకు జరిగే పనులు ఓ కొలిక్కి వచ్చినా ఇంకా కొన్ని చిన్న పనులు మిగిలిపోయాయి. ప్రతి రెండు స్టేషన్ల మధ్య ప్రస్తుతం ఉన్న రెండు లైన్లకు తోడు మూడో లైన్​ ఏర్పాటు చేస్తుండగా స్టేషన్​ లోకి వచ్చే వరకు నాలుగు లైన్లుంటాయి. దీంతో కొత్త లైన్​ నుంచి స్టేషన్​ లోని లైన్లకు అనుసంధానించే ఇంటర్​లాకింగ్ పనులు నెమ్మదిగా సాగుతున్నాయి. భారీ క్రేన్లతో పట్టాలను బిగిస్తున్నారు. 

10 రోజులపాటు పలు రైళ్లు దారి మళ్లింపు.. 

ఈ పనుల కారణంగా ఖమ్మం మీదుగా విజయవాడ, వరంగల్​ వైపు వెళ్లే పలు రైళ్లను ఈ నెల 10 నుంచి 20వ తేదీ వరకు రద్దు చేశారు. మరికొన్ని రైళ్లను దారిమళ్లించారు. అయితే రద్దయిన రైళ్లలో కొన్నింటిని నిర్ణీత తేదీల్లో నడిపించేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. భద్రాచలం -విజయవాడ, డోర్నకల్​ విజయవాడ ప్యాసింజర్లు, గోల్కొండ, శాతవాహన, ఇంటర్​ సిటీ ఎక్స్​ ప్రెస్​ రైళ్లను ఈనెల 10 నుంచి పది రోజుల వరకు రద్దు చేశారు. ఖమ్మం మీదుగా నడిచే 107 రైళ్లలో 30 రైళ్లను పూర్తిగా రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని అధికారులు సూచించారు. 

టౌన్​లో కొంత ఇబ్బంది.. 

ఈ నిర్మాణ పనులతో గాంధీ చౌక్​దగ్గర ఉన్న రైల్వే గేటును అధికారులు ఈనెల 15 నుంచి 22 వరకు మూసివేస్తున్నట్టు ప్రకటించారు. దీని కారణంగా త్రీటౌన్​ లోని గాంధీ చౌక్​ నుంచి కమాన్​ బజార్, కస్బాబజార్​ మధ్య రాకపోకలకు ఇబ్బంది ఏర్పడుతోంది. ఆయా ప్రాంతాలకు వెళ్లేందుకు మయూరి సెంటర్, వెంకటగిరి మీదుగా తిరిగి వెళ్లాల్సి వస్తోంది.