- హనుమకొండలో బాలుడు కిడ్నాప్
- ఫిర్యాదు అందిన 20 నిమిషాల్లో మిస్టరీ ఛేదించిన పోలీసులు
హనుమకొండ, వెలుగు: హనుమకొండలో ఓ బాలుడి కిడ్నాప్ ఘటన కలకలం రేపింది. బిస్కెట్లు కొనిస్తానంటూ బాలుడిని ఓ రైల్వే ఉద్యోగి ఎత్తుకెళ్లగా.. ఫిర్యాదు అందుకున్న సీఐ, తన టీమ్‌తో కేవలం 20 నిమిషాల్లోనే కేసును ఛేదించారు. పోలీసుల కథనం ప్రకారం..మహబూబాబాద్ జిల్లా ఉత్తరతండాకు చెందిన బోడ సురేశ్, -ప్రియాంక దంపతుల ఐదేండ్ల కొడుకు బిట్టు హనుమకొండలోని సప్తగిరి కాలనీలోని తన అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటున్నాడు.
మంగళవారం ఉదయం ఇంటి ముందు ఆడుకుంటుండగా, కాజీపేటలో రైల్వే ఉద్యోగిగా పని చేస్తున్న తమిళనాడు ప్రాంతానికి చెందిన కర్నిలియస్అక్కడికి వచ్చాడు. బాలుడితో మాటలు కలిపి, తన బైక్‌పై ఎక్కించుకున్నాడు. బిస్కెట్లు కొనిస్తానంటూ తాను ఉంటున్న పోలీస్ కాలనీ వైపు తీసుకువెళ్లాడు. బిట్టు కనపడకపోవడంతో కుటుంబసభ్యులు కంగారుపడ్డారు. ఉదయం 9.30 గంటల ప్రాంతంలో కిడ్నాప్జరగ్గా.. చుట్టుపక్కల వెతికారు.
ఫలితం లేకపోవడంతో 11 గంటలకు డయల్100కు కాల్ చేశారు. దీంతో కాకతీయ యూనివర్సిటీ సీఐ సంజీవ్ మూడు టీమ్స్‌ను ఏర్పాటు చేసి గాలింపు మొదలుపెట్టారు. సమీపంలో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించి, నిందితుడిని గుర్తించారు. కర్నియలిస్ బిట్టుని మరో చోటుకు తీసుకెళ్తుండగా..11.20 గంటలకు అదుపులోకి తీసుకున్నారు. తర్వాత బిట్టును వారి కుటుంబసభ్యులకు అప్పగించారు.
నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. కిడ్నాప్ ఎందుకు చేశాడన్నది తెలియరాలేదు. ఫిర్యాదు అందిన 20 నిమిషాల్లోనే కేసును ఛేదించి, కిడ్నాప్కథను సుఖాంతం చేసిన సీఐ సంజీవ్, సిబ్బందిని పోలీసు ఉన్నతాధికారులు అభినందించారు.