రూ.521 కోట్లతో 160 ఎకరాల్లో వ్యాగన్​ వర్క్​షాప్​

  • మొదటి ఏడాది 1,200 వ్యాగన్ల తయారీ
  • 2025 వరకు మ్యానుఫ్యాక్చరింగ్​ స్టార్ట్
  • భవిష్యత్తులో కోచ్​ లు కూడా తయారు చేయొచ్చు
  • రైల్వే జీఎం అరుణ్​ కుమార్​ జైన్​

కాజీపేట, వెలుగు: ప్రధాని మోదీ ఈ నెల 8న కాజీపేటలో శంకుస్థాపన చేయనున్న వ్యాగన్​ తయారీ వర్క్​ షాపును రూ.521 కోట్లతో 160 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్నామని సౌత్​ సెంట్రల్​ రైల్వే జీఎం అరుణ్​ కుమార్​ జైన్​ వెల్లడించారు. తెలంగాణలో ఇదే ఫస్ట్ వ్యాగన్​ మ్యానుఫ్యాక్చరింగ్​ యూనిట్​ అని  తెలిపారు. ఈ యూనిట్​ నుంచి నెలకు 200 చొప్పున మొదటి ఏడాది 1,200, తర్వాత ఏడాది నుంచి 2,400 వ్యాగన్లు తయారు చేస్తారని చెప్పారు. భవిష్యత్తులో ఇందులోనే కోచ్​లు కూడా తయారు చేసే అవకాశం ఉంటుందని తెలిపారు. గురువారం కాజీపేట మండలం అయోధ్యపురంలో ప్రధాని శంకుస్థాపన చేయనున్న పీరియాడికల్​ ఓవర్​ హాలింగ్​ వర్క్​షాప్, వ్యాగన్​ మ్యానుఫ్యాక్చరింగ్​ యూనిట్​ స్థలాన్ని  రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ (ఆర్వీఎన్ఎల్) చీఫ్ ప్రాజెక్ట్ మేనేజర్ మున్నా కుమార్, ఇతర ఆఫీసర్లతో కలిసి జీఎం పరిశీలించారు. యానిమేషన్​ వీడియో ద్వారా యూనిట్ వివరాలు వెల్లడించారు. 

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇది భారత రైల్వేకే కాకుండా తెలంగాణ ప్రజలకు కూడా ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ అన్నారు. ఈ ప్రాంత సమగ్రాభివృద్ధికి, హనుమకొండ ప్రాంతంలో కొత్త పారిశ్రామిక డెవలప్​మెంట్​కు దోహదపడుతుందన్నారు. మొదట కాజీపేటలో నెలకు 200 వ్యాగన్ల పీరియాడిక్ ఓవర్​ హాలింగ్​(పీవోహెచ్) చేపట్టేందుకు వ్యాగన్ రిపేర్ వర్క్ షాప్  మంజూరైందన్నారు.  ఆ తర్వాత రైల్వే వ్యాగన్ల అవసరాలు పెరగడం, స్థానికంగా పరిశ్రమను ప్రోత్సహించడం,  ఇతర విన్నపాలను పరిగణనలోకి తీసుకుని వ్యాగన్ తయారీ యూనిట్ గా అప్​గ్రేడ్ చేసినట్లు తెలిపారు. మోదీ ప్రారంభించిన ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ఈ యూనిట్ కీలకంగా పనిచేస్తుందన్నారు. అనంతరం కాజీపేట రైల్వే డివిజన్ డిమాండ్ పై స్పందిస్తూ.. అదంతా పాలసీ మ్యాటర్ అని, దీనిపై కేంద్రం నిర్ణయం తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో డివిజనల్ రైల్వే మేనేజర్  ఏకే గుప్తా, ఇతర ఆఫీసర్లు పాల్గొన్నారు. 

కోచ్​ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలి: ఎమ్మెల్యే ఆరూరి

కాజీపేటలో వ్యాగన్ మ్యాన్​ఫ్యాక్చరింగ్​ యూనిట్​తో పాటు కోచ్ ఫ్యాక్టరీని కూడా ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని వర్ధన్నపేట  ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ జీఎం అరుణ్ కుమార్​ జైన్ ను​ కోరారు.  ఇప్పుడు ఏర్పాటు చేస్తున్న పరిశ్రమ కోసం భూములు కోల్పోయిన రైతు కుటుంబాలు, స్థానిక యువతకు ఉద్యోగావకాశాలు కల్పించాలని  వినతి పత్రం అందించారు.