గుండె నొప్పి అంటూ పోసాని డ్రామా.. : పోలీసుల సంచలన ప్రకటన

గుండె నొప్పి అంటూ పోసాని డ్రామా.. : పోలీసుల సంచలన ప్రకటన

వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా అరెస్టయ్యి జైలులో ఉన్న నటుడు పోసాని అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే.. శనివారం ( మార్చి 1, 2025 ) ఛాతి నొప్పితో బాధపడుతున్న పోసానిని రాజంపేటలో  వైద్య పరీక్షల అనంతరం కడప రిమ్స్ కు తరలించారు పోలీసులు. అయితే.. పోసానికి ఎలాంటి ఛాతి నొప్పి లేదని.. ఉదయం నుంచి పోసాని డ్రామా ఆడారని స్పష్టం చేశారు రైల్వే కోడూరు సీఐ వెంకటేశ్వర్లు.

పోసానికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని.. ఆయన డ్రామా ఆడుతున్నారని అన్నారు సీఐ వెంకటేశ్వర్లు. పోసాని ఛాతిలో నొప్పి అనగానే రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని.. అక్కడ పరీక్షలు చేయించిన తర్వాత మెరుగైన చికిత్స కోసం కడప రిమ్స్ కు తరలించామని అన్నారు. వైద్యులు పోసానికి ఈసీజీతో పాటు రక్త పరీక్షలు కూడా నిర్వహించారని.. ఎలాంటి అనారోగ్యం లేదని నిర్దారించినట్లు తెలిపారు సీఐ. రిమ్స్ లో వైద్య పరీక్షల అనంతరం రాజంపేట సబ్ జైలుకు తరలిస్తామని అన్నారు సీఐ.

బుధవారం ( ఫిబ్రవరి 26) పోసానిని అరెస్ట్ చేసిన పోలీసులు గురువారం ( ఫిబ్రవరి 27 ) రైల్వేకోడూరు కోర్టులో హాజరుపరిచగా... పోసానికి 14 రోజుల రిమాండ్‌ విధించింది కోర్టు. అనంతరం పోసానిని రాజంపేట సబ్ జైలుకు తరలించారు పోలీసులు. మార్చి 12 వరకు రాజంపేట సబ్ జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉండనున్నారు పోసాని కృష్ణ మురళి.