కామారెడ్డి జిల్లా కేంద్రంలో లక్షకు పైగా జనాభా ఉంది. వ్యక్తిగత పనులు, వ్యాపారాలు, చదువు కోసం వేలాది మంది జిల్లా కేంద్రానికి రాకపోకలు సాగిస్తారు. రోజు రోజుకు విస్తరిస్తున్న టౌన్‌ను రైల్వే లైన్ రెండు గా విభజిస్తోంది. ఈ రైల్వే లైన్‌కు ఇరువైపుల కాలనీలు, వ్యాపార సముదాయాలు, ప్రభుత్వ ఆఫీసులు, విద్యా సంస్థలు ఉన్నాయి. అప్పటి అవసరాల నిమిత్తం రైల్వే లైన్‌పై బ్రిడ్జి, మరో చోట మాన్యువల్ గేట్ ఏర్పాటు చేశారు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా బ్రిడ్జి సరిపోకపోగా, తరచూ రైళ్ల రాకపోకలతో గేట్ క్లోజ్ చేస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.
కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి మీదుగా సికింద్రాబాద్ నుంచి నాందేడ్, ముంబై వైపు రైల్వేలైన్ ఉంది. టౌన్మధ్యలో నుంచి రైల్వే లైన్ వెళ్తుంది. ఈ రైల్వే లైన్‌కు ఇరువైపులా కాలనీలు ఉన్నాయి. హైస్కూల్ సమీపంలో బ్రిడ్జి నిర్మించారు. ఇది చిన్నదిగా ఉండటంతో దానిస్థానంలో ఫ్లై ఓవర్ నిర్మించారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా నిర్మించకపోవడంతో ఇప్పుడు రాకపోకలకు ఇబ్బంది అవుతోంది. తరచుగా బ్రిడ్జిపై ట్రాఫిక్ సమస్య తలెత్తోతోంది. అకస్మాత్తుగా ఏదైనా వెహికల్లో టెక్నికల్ ప్రాబ్లమ్ తో ఆగిపోతే ట్రాఫిక్ క్లియర్ కావటానికి గంటల సమయం పడుతోంది. దీంతో హాస్పిటల్స్, ఇతర అత్యవసర పనులపై వెళ్లే వారు అవస్థలు పడుతున్నారు.
తరచూగా గేట్ క్లోజ్
అశోక్ కాలనీ దగ్గర రైల్వే గేటు ఉంది. రైళ్లు వచ్చినప్పుడల్లా దీనిని క్లోజ్ చేస్తారు. దీంతో రెండు వైపులా వాహనాలు బారులు తీరుతున్నాయి. రోజుకు 30 నుంచి 40 సార్లు గేట్ క్లోజ్చేస్తారు. మళ్లీ ఓపెన్ చేసేందుకు తక్కువలో తక్కువ పది నిమిషాలు పడుతుంది. రైళ్ల క్రాసింగ్ఉంటే 15 నిమిషాలకు పైగా తీసుకుంటుంది. గేట్ తెరిచిన తర్వాత ట్రాఫిక్ క్లియర్ కావటానికి మరో 20 నిమిషాలు పడుతుంది. ఎక్స్‌ప్రెస్‌లు, ఆర్డనరీ రైళ్లతో పాటు, గూడ్స్ ట్రెన్లు వెళ్తుంటాయి. అశోక్‌నగర్, ఎన్జీవోస్కాలనీ, కాకతీయనగర్, స్నేహపూరి కాలనీ, జయశంకర్‌కాలనీ, పంచముఖి హనుమాన్ కాలనీ తదితర కాలనీ వాసులతో పాటు కలెక్టరేట్‌కు, స్కూళ్లకు, గ్రామాలకు వెళ్లే వాళ్లు ఈ గేట్ మీదుగా వెళ్తుంటారు. రోడ్డు మధ్యలో డివైడర్లను కూడా ఏర్పాటు చేయకపోవడంతో ప్రజలు ట్రాఫిక్ వలయంలో చిక్కుకుపోతుంటారు.
ఫ్లై ఓవర్ లే శరణ్యం
రైల్వే లైన్ మీదుగా రాకపోకలు సాగించేందుకు అనువుగా ఫ్లై ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం చేపట్టాల్సి ఉంది. ఆ దిశగా ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు ఆలోచనలు చేయాల్సి ఉన్నా పట్టించుకోవడంలేదని స్థానికులు మండిపడుతున్నారు. హైవే నుంచి టౌన్లోకి వచ్చే మార్గంలో పాతరాజంపేట వద్ద ఉన్న రైల్వే గేట్ వద్ద ప్లై ఓవర్ నిర్మాణానికి రైల్వే, ఆర్అండ్బీ ఆఫీసర్లు సర్వే నిర్వహించారు. ఇదే మాదిరిగా కామారెడ్డి టౌన్లో కూడా ప్లై ఓవర్ బ్రిడ్జిల నిర్మాణానికి చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.