తెలంగాణలో రైల్వేకు రూ.5,336 కోట్లు : అశ్వినీ వైష్ణవ్

తెలంగాణలో రైల్వేకు రూ.5,336 కోట్లు : అశ్వినీ వైష్ణవ్
  • బడ్జెట్ వివరాలు వెల్లడించిన రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్

న్యూఢిల్లీ/సికింద్రాబాద్, వెలుగు: కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్​లో తెలంగాణలోని రైల్వే ప్రాజెక్ట్​ల అభివృద్ధికి రూ.5,336 కోట్లు కేటాయించినట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో రూ.32,946 కోట్లు విలువైన 20 ప్రాజెక్టుల కింద 2,298 కిలో మీటర్ల కొత్త ట్రాక్​ల పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. బుధవారం ఢిల్లీలోని రైల్వే భవన్​లో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘2009 నుంచి 2014 వరకు అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం.. ఉమ్మడి రాష్ట్రానికి కేవలం రూ.886 కోట్లు మాత్రమే కేటాయించింది. తాజా బడ్జెట్​లో కేవలం తెలంగాణకే మోదీ సర్కార్ రూ.5,336 కోట్లు కేటాయించింది.

కాంగ్రెస్ హయాంలో ఏడాదికి 17 కిలో మీటర్ల రైల్వే ట్రాక్ నిర్మాణం జరిగేది. ఇప్పుడు 65 కిలో మీటర్లు జరుగుతున్నది. ట్రాక్​ల నిర్మాణంలో నాలుగు శాతం వృద్ధి కనిపిస్తున్నది. తెలంగాణలో రైల్వే ట్రాక్ ఎలక్ట్రిఫికేషన్ వంద శాతం పూర్తయింది. అమృత్ స్టేషన్స్ స్కీమ్ కింద రాష్ట్రంలోని 40 రైల్వే స్టేషన్లను ఆధునికీకరించాం. పదేండ్లలో రాష్ట్రవ్యాప్తంగా 437 ఫ్లై ఓవర్ బ్రిడ్జీలు, అండర్​పాస్​లు నిర్మించాం’’అని తెలిపారు. కాగా, ఈ ఏడాది ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్​లో తెలంగాణకు రూ.5,071 కోట్లు కేటాయించినట్లు మంత్రి అశ్వినీ వైష్ణవ్ గతంలో తెలిపారు. ఈ లెక్కన.. పూర్తి స్థాయి బడ్జెట్​లో అదనంగా రూ.265 కోట్లు మాత్రమే కేటాయించినట్లు స్పష్టమవుతున్నది. 

ఏపీలో కొనసాగుతున్న రూ.73వేల కోట్ల విలువైన పనులు

ఏపీలో రైల్వే అభివృద్ధికి రూ.9,151 కోట్లు కేటాయించినట్లు మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో రూ.73,743 కోట్లు విలువైన 41 ప్రాజెక్టులు కొనసాగుతున్నాయన్నారు. 5,329 కిలో మీటర్ల కొత్త ట్రాక్ పనులు చేపడ్తున్నట్లు వివరించారు. ఏపీలో ఏడాదికి 151 కిలో మీటర్ల కొత్త ట్రాక్​ల నిర్మాణం, 195 కిలో మీటర్ల ఎలక్ట్రిఫికేషన్ పనులు జరుగుతున్నాయని తెలిపారు.

‘‘రాష్ట్రంలో ఎలక్ట్రిఫికేషన్ పనులు వంద శాతం పూర్తయ్యాయి. అమృత్ స్కీమ్ కింద 73 స్టేషన్లను ఆధునికీకరించాం. పదేండ్లలో 743 ఫ్లై ఓవర్లు, అండర్​పాస్ ల నిర్మాణం చేపట్టాం. విజయవాడ – ఎరుపాలెం నుంచి అమరావతికి కృష్ణా నది మీదుగా రూ.2,047 కోట్లతో 56 కిలో మీటర్ల మేర రైల్వే లైన్ నిర్మాణానికి డీపీఆర్ పూర్తి చేశాం’’అని తెలిపారు.