- రూ.680 కోట్లతో వ్యాగన్, కోచ్ ఫ్యాక్టరీ మంజూరు
- నేడో రేపో కాజీపేట జంక్షన్‌కు డివిజన్ హోదా
- రూ.32 కోట్లతో దేశంలో రెండో భూగర్భ రైల్ ట్రాక్ రెడీ
- రూ.24.45 కోట్లతో ఎయిర్పోర్ట్ తరహాలో కాజీపేట స్టేషన్ వర్క్స్
- 45 ఏండ్ల తర్వాత కాజీపేట ప్రాంతానికి పూర్వవైభవం
వరంగల్, వెలుగు: గ్రేటర్ వరంగల్‌లో భాగమైన కాజీపేటకు కొత్త ప్రాజెక్టులతో నయా లుక్ వస్తోంది. నగరంలో వరంగల్, హనుమకొండ, కాజీపేట ట్రై సిటీలుగా ఉండగా మిగతా రెండింటితో పోలిస్తే కాజీపేట నగరం అభివృద్ధిలో చాలా వెనుకబడింది. ప్రస్తుత కాజీపేట రైల్వే స్టేషన్ 1904లో నైజాం రైల్వే ప్రారంభమవగా.. 1973లో జంక్షన్‌గా మారింది. నాలుగైదు దశాబ్దాల క్రితం రైల్వే ప్రాజెక్టులతో కళకళలాడి, ఆ తరువాత నిరాదరణకు గురైంది. కాగా, ఎన్నో ఏండ్ల తర్వాత కాజీపేట ప్రాంతానికి ఒక్కొక్కటిగా రైల్వే ప్రాజెక్టులు మంజూరు అవుతుండడంతో మళ్లీ పూర్వవైభవం దిశగా అడుగులు వేయనుంది.
వ్యాగన్, కోచ్ ఫ్యాక్టరీతో పూర్వ వైభవం
కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలనే 45 ఏండ్ల నాటి డిమాండ్ ఎట్టకేలకు నెరవేరింది. 1980 నుంచి రైల్వే కార్మిక, ఉద్యోగ సంఘాలు కోచ్ ఫ్యాక్టరీ కోసం నినదిస్తున్నారు. దీనిని అన్ని రాజకీయ పార్టీలు తమ ప్రచార అస్ర్తంగా వాడుకున్నాయి. కాజీపేట జంక్షన్‌కు గతంలో రెండు సార్లు కోచ్ ఫ్యాక్టరీ మంజూరైనప్పటికీ రాజకీయ కారణాలతో అవి ఇతర రాష్ట్రాలకు తరలివెళ్లాయి. ఎన్నో డిమాండ్ల మధ్య 2013లో కాజీపేటకు రూ.523 కోట్లతో పీవోహెచ్(పీరియాడికల్ ఓవరాలింగ్) మంజూరైంది. కాజీపేట స్టేషన్‌కు దగ్గరలో ఉండే అయోధ్యపురంలో దీనికోసం దాదాపు 160 ఎకరాల భూములు సేకరించారు. ఈ క్రమంలో కోచ్ ఫ్యాక్టరీ అంశం రాజకీయ రంగు పులుముకుంది. ఎట్టకేలకు 2023లో ప్రధాని మోడీ వరంగల్ పర్యటన సందర్భంగా వ్యాగన్ల తయారీ పరిశ్రమకు శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్ట్ ఇలా ఉండగానే కేంద్ర ప్రభుత్వం కోచ్ ఫ్యాక్టరీ సైతం మంజూరు చేస్తూ అప్‌గ్రేడ్ చేసింది. రూ.680 కోట్లతో చేపట్టే ప్రాజెక్ట్ కోసం ముందస్తుగా రూ.66 కోట్లు విడుదల చేస్తున్నట్లు చెప్పారు.
ఇందులో వ్యాగన్ల తయారీతో పాటు వందే భారత్, జర్మనీ టెక్నాలజీతో కూడిన లింక్ హాఫ్మన్ బుష్ (ఎల్‌హెచ్‌బీ), సబర్మన్ రైళ్లకు ఉపయోగించే ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్(ఈఎంయూ) కోచ్‌లు తయారు చేయనున్నారు. ఏటా 600 కోచ్‌లు ఇక్కడ నుంచి ఉత్పత్తి చేసేలా ప్లాన్ చేస్తున్నారు. 2025 ఆగస్ట్ నెల నాటికి దీనిని ప్రారంభించేలా పనులు చేపడుతున్నారు. దీని ద్వారా డైరెక్ట్‌గా 3 వేల మందికి మరో 5 నుంచి 6 వేల మందికి పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలగనున్నాయి.
అమృత్ భారత్‌లో ఎంపిక..
కాజీపేట రైల్వే జంక్షన్ కేంద్ర రైల్వే శాఖ తీసుకొచ్చిన అమృత్ భారత్ స్కీంలో ఎంపికైంది. దీని కింద స్టేషన్‌ను ఎయిర్పోర్ట్ తరహాలో హైఫైగా మార్చేందుకు రూ.24.45 కోట్లు మంజూరు చేశారు. దీంతో ప్రస్తుతం ఉన్న రైల్వే స్టేషన్ రూపురేఖలు మారనున్నాయి. ఇప్పటికే స్టేషన్ బ్యూటిఫికేషన్ వర్క్స్ మొదలయ్యాయి. ప్రస్తుత రైల్వే స్టేషన్ మెయిన్ బిల్డింగ్, ఎంట్రన్స్ , అత్యాధునిక ఫ్లాట్‌ఫారాలు, కంబైండ్ ఏసీ వెయిటింగ్ హాల్స్, టాయిలెట్లు, ఎఫ్‌వోబీలు, మరో 2 ఎక్సలేటర్లు, రెండు లిఫ్ట్‌లు రానున్నాయి. జంక్షన్ ముందు భాగంలో గార్డెన్, పార్కింగ్, రైల్వే జంక్షన్ ఆవరణలో రైలు బోగీని పోలిన తరహాలో రెస్టారెంట్ రానుంది.
కాజీపేటలో 350 మీటర్ల భూగర్భ ట్రైన్ రూట్..
కాజీపేట స్టేషన్‌కు కిలోమీటర్ దూరంలోని కోమటిపల్లి వద్ద రూ.32 కోట్లతో చేపట్టిన భూగర్భ రైల్ మార్గం దేశంలోనే రెండోదిగా చెబుతున్నారు. బల్లార్షా నుంచి కాజీపేట స్టేషన్ చేరుకునే క్రమంలో వడ్డేపల్లి చెరువు, ఫాతిమానగర్ బ్రిడ్జి మధ్యలో రైల్వే ట్రాక్ ‘వై’ ఆకారంలో ఉంది. కుడివైపు వెళితే కాజీపేట మీదుగా సికింద్రాబాద్ వైపు.. ఎడమవైపు వెళితే వరంగల్ స్టేషన్ మీదుగా విజయవాడ వైపు రైళ్లు ప్రయాణిస్తున్నాయి. అయితే.. బల్లార్షా వైపు నుంచి సికింద్రాబాద్ వైపు ఒకటి, విజయవాడ వైపు మరో రైల్ ఒకే సమయంలో వెళ్లాల్సివస్తే.. ఏదో ఒక ట్రైన్ గంటల తరబడి ఆగాల్సి వస్తోంది. ఈ సమస్యకు చెక్ పెట్టేలా ‘వై’ ఆకారం ఉండేచోట భూమిలో 350 మీటర్ల దూరం టన్నెల్ ఏర్పాటు చేశారు. దీంతో ఎలాంటి క్రాసింగ్ సమస్య లేకుండా పైనో రైలు, కిందో రైలు వెళ్లేలా ఈ ప్రాజెక్ట్ నిర్మించారు. ఇటీవలే దీనికి సంబంధించి ట్రయల్ రన్ నిర్వహించారు.
కాజీపేటకు రైల్వే డివిజన్!
కాజీపేట జంక్షన్ రైల్వే డివిజన్ కల సైతం నెరవేరే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఈ అంశంపై రాజకీయ పార్టీలు ఎప్పటి నుంచో హామీలు ఇస్తున్నా.. ఇప్పుడు అడుగులు పడుతున్నాయి. ఏటా కాజీపేట రైల్వే జంక్షన్ నుంచి దక్షిణ మధ్య రైల్వేకు దాదాపు రూ. 41.36 కోట్ల ఆదాయం అందిస్తోంది. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని రైల్వే డివిజన్ మంజూరుపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇక ఓరుగల్లు నుంచి సికింద్రాబాద్ వైపు నడిపించి ఆపేసిన పుష్పుల్ రైలుసేవలను మళ్లీ ప్రారంభించారు.
దీనికితోడు నష్కల్ నుంచి చింతలపల్లికి, నష్కల్ నుంచి హసన్‌పర్తి మధ్య బైపాస్ నిర్మాణం, ఎలక్ట్రిక్ పీవోహెచ్, హసన్ పర్తి, వరంగల్ మధ్య మూడో లైన్ నిర్మాణం జరుగుతోంది. మొత్తంగా కాజీపేట జంక్షన్ పరిధిలోకి కోట్లాది విలువ చేసే ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా చేరుతుండడంతో కలర్ఫుల్గా మారుతోంది.