ఇండియన్ రైల్వేస్‍కు చెందిన రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (ఆర్‍ఆర్‍బీ) భారతీయ రైల్వే వివిధ విభాగాల్లో డిప్లొమా, ఇంజినీరింగ్ డిగ్రీ, బీఎస్సీ పూర్తిచేసిన యువతకు దేశ వ్యాప్తంగా అన్ని రీజియన్లలో ఉద్యోగాల భర్తీకి రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు నోటిఫికేషన్ (సీఈఎల్ నంబర్ 03/2024) విడుదల చేసింది. ఈ ప్రకటన ద్వారా 7,951 జూనియర్ ఇంజినీర్, కెమికల్ సూపర్‌వైజర్ ఖాళీలు భర్తీ కానున్నాయి. ప్రారంభంలోనే దాదాపు 40 వేల రూపాయల వేతనం లభిస్తుంది. కాబట్టి పక్కాగా ప్రిపరేషన్ సాగిస్తే అద్భుత అవకాశం మీ సొంతం అవుతుంది. ఈ నేపథ్యంలో ఎగ్జామ్ ప్యాటర్న్, సిలబస్, ప్రిపరేషన్ ప్లాన్ గురించి తెలుసుకుందాం..
జూనియర్ ఇంజినీర్ పోస్ట్‌లకు పోటీ పడే అభ్యర్థులు ప్రధానంగా ఇంజనీరింగ్ సబ్జెక్ట్‌లపై పట్టు సాధించాల్సి ఉంటుంది. డిప్లొమా, బీటెక్ స్థాయిలో అకడమిక్ పుస్తకాలను అధ్యయనం చేయాలి.
ఎగ్జామ్ ప్యాటర్న్: మ్యాథ్స్ (30 ప్రశ్నలు- 30 మార్కులు), జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ (25 ప్రశ్నలు- 25 మార్కులు), జనరల్ అవేర్‌నెస్ (15 ప్రశ్నలు- 15 మార్కులు), జనరల్ సైన్స్ (30 ప్రశ్నలు- 30 మార్కులు). మొత్తం 100 ప్రశ్నలకు 90 నిమిషాల సమయం ఉంటుంది.
స్టేజ్-2: జనరల్ అవేర్‌నెస్ (15 ప్రశ్నలు- 15 మార్కులు), ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ (15 ప్రశ్నలు- 15 మార్కులు), బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అప్లికేషన్స్ (10 ప్రశ్నలు- 10 మార్కులు), బేసిక్స్ ఆఫ్ ఎన్విరాన్‌మెంట్ అండ్ పొల్యూషన్ కంట్రోల్ (10 ప్రశ్నలు - 10 మార్కులు) ఉంటాయి. టెక్నికల్ ఎబిలిటీస్ (100 ప్రశ్నలు- 100 మార్కులు). మొత్తం 150 ప్రశ్నలకు 120 నిమిషాల సమయం కేటాయించారు.
ప్రిపరేషన్ టిప్స్
జనరల్ ఎబిలిటీ: ఈ సెక్షన్‍లో జనరల్ ఎబిలిటీ, లాజికల్ రీజనింగ్ నుంచి ప్రశ్నలు వస్తాయి. టైం & డిస్టెన్స్, కోడింగ్–డీకోడింగ్, నెంబర్ సిరీస్, అనాలజీ (వర్డ్, నెంబర్), ర్యాంకింగ్ టెస్ట్, బ్లడ్ రిలేషన్స్, డైరెక్షన్స్, లాజికల్ సీక్వెన్స్ వంటి టాపిక్స్ నుంచి ప్రశ్నలు అడుగుతారు. ప్రీవియస్ పేపర్లలో వచ్చిన ప్రశ్నలను గమనించడం ద్వారా ప్రశ్నల సరళి అర్థం చేసుకోవచ్చు.
జనరల్ సైన్స్: ఇండియన్ ఎకానమీ, ఇండియన్ జియోగ్రఫీ, ప్రపంచ జియోగ్రఫీ, ఫిజికల్ సైన్స్, కెమిస్ర్టీ, మధ్యయుగ భారతదేశ చరిత్ర, ప్రపంచ చరిత్ర, సైన్స్ అండ్ టెక్నాలజీ, బోటనీ, జువాలజీ, భారత రాజకీయ వ్యవస్థ, భారత రాజ్యాంగం, కేంద్ర ప్రభుత్వ పథకాలు, జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ వంటి జనరల్ స్టడీస్ సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు అడుగుతారు. అంటే దాదాపు గ్రూప్స్ పరీక్షల్లో ఉండే జనరల్ స్టడీస్‍లో ఉన్న అన్ని సబ్జెక్టులను చదవాలి. ప్రశ్నలు బేసిక్స్ నుంచే వచ్చినా తికమక పెట్టేలా ఉంటాయి.
కాబట్టి పరీక్షలో క్షుణ్నంగా చదివి అర్థం చేసుకొని సమాధానాలు రాయాల్సి ఉంటుంది. ప్రీవియస్ పేపర్లను విశ్లేషించడం ద్వారా ప్రిపరేషన్ సులభతరం అవుతుంది.
టెక్నికల్ ఎబిలిటీ: ఈ సెక్షన్‍లో ఇంజినీరింగ్, డిప్లొమాలో సివిల్, మెకానికల్, ఎలక్ర్టికల్, ఎలక్ర్టానిక్స్, ఇన్ఫర్నేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్‍ల్లోని సబ్జెక్టుల నుంచి బేసిక్ నుంచి యావరేజ్ ప్రశ్నలు వస్తాయి. ముఖ్యంగా నిర్వచనాలు, ఫార్ములాలు, మెథడ్స్ వంటి వాటిని బాగా చదవాలి. ప్రీవియస్ పరీక్షల్లో వచ్చిన ప్రశ్నలను క్షుణ్నంగా గమనించడం ద్వారా ఈ సెక్షన్‍లో మంచి మార్కులు పొందవచ్చు.
సబ్జెక్టుపై పట్టుతో సక్సెస్
సివిల్: సివిల్ ఇంజనీరింగ్ అభ్యర్థులు బిల్డింగ్ మెటీరియల్స్, ఎస్టిమేటింగ్, కాస్టింగ్ అండ్ ఎవాల్యుయేన్, సర్వేయింగ్, సాయిల్ మెకానిక్స్, హైడ్రాలిక్స్, ఇరిగేషన్ ఇంజనీరింగ్, ట్రాన్స్‌పోర్టేషన్ ఇంజనీరింగ్, ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్‌లపై పట్టు సాధించాలి. అదే విధంగా.. స్ట్రక్చరల్ ఇంజనీరింగ్‌కు సంబంధించి స్ట్రక్చర్స్ థియరీ, కాంక్రీట్ టెక్నాలజీ, ఆర్‌సీసీ డిజైన్, స్టీల్ డిజైన్ అంశాలపై అవగాహన పెంచుకోవాలి.
ఎలక్ట్రికల్: ఈ విభాగం అభ్యర్థులు బేసిక్ కాన్సెప్ట్స్‌తోపాటు సర్క్యూట్ లా, మ్యాగ్నటిక్ సర్క్యూట్, ఏసీ ఫండమెంటల్స్, మెజర్‌మెంట్ అండ్ మెజరింగ్ ఇన్‌స్ట్రుమెంట్స్, ఎలక్ట్రికల్ మెషీన్స్, ఫంక్షనల్ కిలోవాట్ మోటార్స్ అండ్ సింగిల్ ఫేజ్ మోటార్స్, సింక్రనస్ మెషీన్స్, జనరేషన్, ట్రాన్స్‌మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్, ఎస్టిమేషన్ అండ్ కాస్టింగ్, యుటిలైజేషన్ అండ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ, బేసిక్ ఎలక్ట్రానిక్స్‌పై అవగాహన పెంచుకోవాలి.
మెకానికల్: ఈ విభాగంలో పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు..థియరీ ఆఫ్ మెషీన్స్, మెషీన్ డిజైన్, ఇంజనీరింగ్ మెకానిక్స్, స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరి యల్స్, ప్రాపర్టీస్ ఆఫ్ ప్యూర్ సబ్‌స్టాన్సెస్, ఫస్ట్ అండ్ సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమి క్స్, ఎయిర్ స్టాండర్డ్ సైకిల్స్ ఫర్ ఐసీ ఇంజన్స్, ఐసీ ఇంజన్ పెర్‌ఫార్మెన్స్, ఐసీ ఇంజన్స్ కంబస్టన్, ఐసీ ఇంజన్ కూలింగ్ అండ్ లూబ్రికేషన్, ఫ్లూయిడ్ స్టాటిక్స్, ఫ్లూయిడ్ ప్రెజర్, ఫ్లూయిడ్ కైనమాటిక్స్, డైనమిక్స్ ఆఫ్ ఫ్లూయిడ్స్, మెజర్‌మెంట్
ఆఫ్ ఫ్లో రేట్, బేసిక్ ప్రిన్సిపుల్స్, హైడ్రాలిక్ టర్బైన్స్, సెంట్రిఫ్యుగల్ పంప్స్, క్లాసిఫికేషన్ ఆఫ్ స్టీల్ తదితర కోర్ మెకానికల్ అంశాలపై పట్టు సాధించాలి. ఇంజినీరింగ్ పేపర్లలో మెరుగైన మార్కుల కోసం అభ్యర్థులు ఆయా సబ్జెక్ట్‌లలోని అంశాలు, వాటికి సంబంధించిన ప్రాథమిక భావనలు, సిద్ధాంతాలు, నియమాలు, ధర్మాలు (ప్రాపర్టీస్) వంటి అంశాలను చదవాలి. దీంతోపాటు అన్వయ నైపుణ్యం కూడా అలవర్చుకోవాలి. అప్పుడే పరీక్షలో ఎలాంటి ప్రశ్న అడిగినా సమాధానం ఇచ్చే
సంసిద్ధత లభిస్తుంది.
నోటిఫికేషన్
ఆర్‌ఆర్‌బీ రీజియన్లు: అహ్మదాబాద్, అజ్‌మేర్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, బిలాస్‌పూర్, చండీగఢ్, చెన్నై, గువాహటి, గోరఖ్‌పూర్, జమ్ము & శ్రీనగర్, కోల్‌కతా, మాల్దా, ముంబయి, ముజఫర్‌పూర్, పట్నా, ప్రయాగ్‌రాజ్, రాంచీ, సికింద్రాబాద్, సిలిగురి, తిరువనంతపురం.
ఖాళీలు: మొత్తం 7,951 పోస్టుల్లో కెమికల్ సూపర్‌వైజర్/ రీసెర్చ్ అండ్ మెటలర్జికల్ సూపర్‌వైజర్/ రీసెర్చ్: 17(ఆర్‌ఆర్‌బీ గోరఖ్‌పూర్ మాత్రమే), జూనియర్ ఇంజినీర్, డిపో మెటీరియల్ సూపరింటెండెంట్, కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్: 7,934 పోస్టులు అందుబాటులో ఉన్నాయి.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా (ఇంజినీరింగ్), బ్యాచిలర్ డిగ్రీ (ఇంజినీరింగ్/ టెక్నాలజీ), బీఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి. వయసు 1 జనవరి 2025 నాటికి 18 నుంచి -36 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు 10- నుంచి 15 ఏళ్ల వయో సడలింపు ఇచ్చారు.
సెలెక్షన్ ప్రాసెస్ : స్టేజ్-1, స్టేజ్-2 కంప్యూటర్ బేస్డ్ టెస్టులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
అప్లికేషన్స్: అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో జులై 30 నుంచి ఆగస్టు 29 వరకు దరఖాస్తు చేసుకోవాలి. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.500. ఎస్సీ/ ఎస్టీ/ ఈఎస్‌ఎం/ మహిళలు/ ట్రాన్స్‌జెండర్లకు రూ.250 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. పూర్తి వివరాలకు www.rrbsecunderabad.gov.in వెబ్సైట్లో సంప్రదించాలి.