సికింద్రాబాద్, వెలుగు: రైల్వే ప్రయాణికుల రక్షణతోపాటు నేరాల నియంత్రణకు జీఆర్పీ పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నదని రైల్వే ఎస్పీ చందనా దీప్తి పేర్కొన్నారు. సోమవారం లాలాగూడలోని రైల్వే ఎస్పీ కార్యాలయంలో జీఆర్పీ వార్షిక సమావేశాన్ని నిర్వహించారు. 2024లో జీఆర్పీ పరిధిలోని మూడు రైల్వే డివిజన్లలోని 11 పోలీసు స్టేషన్ల పరిధిలో జరిగిన నేరాలు, రికవరీలు, నేరస్థుల అరెస్టులకు సంబంధించిన వివరాలు ఆమె వెల్లడించారు.
ఈ సందర్భంగా రైల్వే ఎస్పీ చందనా దీప్తి మాట్లాడుతూ నేరాలను పూర్తి స్థాయిలో ఆరికట్టేందుకు జీఆర్పీ పోలీసులు ఆర్పీఎఫ్ పోలీసుల సహకారంతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. ప్రాపర్టీ నేరాలు, ఎన్డీపీఎస్ యాక్ట్, మొబైల్ ఫోన్ల చోరీ, కిడ్నాప్‌లు తదితర నేరాలు జరుగకుండా నిఘా పెంచినట్లు తెలిపారు. ఇటీవల నేషనల్ జీఆర్పీ సమావేశం జరిగిందని, అందులో అన్ని రాష్ట్రాల నుంచి జీఆర్పీ పోలీసులు పాల్గొన్నట్లు చెప్పారు. నేరాల నియంత్రణకు తీసుకోవాల్సిన మరిన్ని జాగ్రత్త చర్యలతో పాటు రైల్వే ప్రయాణికుల రక్షణపై సమీక్ష సమావేశం నిర్వహించినట్లు వివరించారు. ఈ సందర్భంగా 2024లో జరిగిన నేరాలు, రికవరీలకు సంబంధించిన వివరాలు తెలిపారు. సమావేశంలో డీఎస్పీలు జావేద్, కృపాకర్, శ్రీనివాస్ రావు, ఇన్స్పెక్టర్లు సాయి ఈశ్వర్ గౌడ్, ఆర్.ఎల్లప్ప, ప్రవీణ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ప్రాపర్టీ అఫెన్స్
ఆర్పీ డిస్ట్రిక్ట్ సికింద్రాబాద్ పరిధిలో 2024లో మొత్తం 901 ప్రాపర్టీ అఫెన్స్ కేసులు నమోదవగా 142 కేసులు ఛేదించారు. అందులో 121 మంది అఫెండర్లను అదుపులోకి తీసుకొని రూ.37 లక్షల విలువగల ప్రాపర్టీని రికవరీ చేశారు.
ఎన్డీపీఎస్ యాక్ట్ కేసులు
ఎన్డీపీఎస్ యాక్ట్ కింద ఈ ఏడా 50 కేసులు నమోదయ్యాయి. అందులో 38 కేసులు డిటెక్ట్ చేసి 53 మంది నిందితులను అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.2.98 కోట్ల విలువగల 1,134 కిలోల గంజాయి స్వాధీనం చేసుకొన్నారు.
మొబైల్ ఫోన్ల రికవరీ
రైల్వే పోలీస్ డిస్ట్రిక్ట్ సికింద్రాబాద్లో నవంబర్ 2023 నుంచి ఈ ఏడాది నవంబర్ వరకు సీఈఐఆర్ పోర్టల్ ద్వారా 870 సెల్ఫోన్లను గుర్తించి సంబంధిత యజమానులకు అందజేశారు.
చిల్డ్రన్ రెస్క్యూ
ఆపరేషన్ స్మైల్ అండ్ ముస్కాన్‌లో భాగంగా 2024లో 53 మంది బాలురు. 25 మంది బాలికలు, మొత్తం 84 మంది బాలలను రెస్క్యూ చేసి సీడబ్ల్యూసీలోని హ్యాబిలిటేషన్ సెంటర్‌కు తరలించారు.
ఆత్మహత్యలు, ప్రమాదాలు
సికింద్రాబాద్ జిల్లా ఆర్సీ పరిధిలో ఈ ఏడాది రైల్వే ట్రాకులపై ఆత్మహత్యకు పాల్పడిన, ట్రాకులపై ప్రమాదాల్లో మరణించిన వారి సంఖ్య 1,468. ఇందులో గుర్తు తెలిసినవాళ్లు 1,275 మంది. గుర్తుతెలియని వాళ్లు 193 మంది ఉన్నారు.