
యాదాద్రి, వెలుగు: దేశంలోని పలు ప్రాంతాలకు సమ్మర్ టూర్ ప్యాకేజీలను రైల్వే శాఖ ప్రకటించింది. హైదరాబాద్ నుంచి బయలుదేరే సమ్మర్ స్పెషల్ భారత్ గౌరవ్ రైలుకు సంబంధించి నాలుగు ప్యాకేజీల వివరాలను వెల్లడించింది. ప్యాకేజీ 1 కింద హరిద్వార్, రిషికేశ్, వైష్ణోదేవిని సందర్శించవచ్చు. దీని విలువ రూ.18,510గా నిర్ణయించింది. ఏప్రిల్ 23 నుంచి మే 2 వరకు 10 రోజులు పాటు ఈ టూర్ సాగనుంది.
ఇందులో హరిద్వార్, రిషికేశ్, ఆనందపూర్, నైనా దేవి, అమృతసర్, మాతా వైష్ణోదేవి దేవాలయాలు కవర్ కానున్నాయి. ప్యాకేజీ 2 కింద కాశీ, గయా, - ప్రయాగ, అయోధ్య వెళ్లొచ్చు. మే 8 నుంచి 17 వరకు సాగే ఈ టూర్ ప్యాకేజీ విలువ రూ.16,800గా నిర్ణయించింది. ప్యాకేజీ 3 కింద అరుణాచలం, మధురై, రామేశ్వరం, కన్యాకుమారి, త్రివేండ్రం, తిరుచ్చి, తంజావూరు ప్రదేశాలు కవర్ కానున్నాయి.
మే 22 నుంచి 30 వరకు సాగే ఈ యాత్రకు రూ.14,700లు వసూలు చేయనుంది. ప్యాకేజీ 4 కింద పంచ జ్యోతిర్లింగ యాత్రలో భాగంగా మహాకాళేశ్వర్, ఓంకారేశ్వర్, త్రయంబకేశ్వర్, భీంశంకర్, గృష్ణేశ్వర్, ఎల్లోరా, మోవ్, నాగ్‌పూర్ ప్రదేశాలు కవర్ అవుతాయి. జూన్ 4 నుంచి 12 వరకు సాగే ఈ యాత్ర ప్యాకేజీని రైల్వే శాఖ రూ.14,700గా నిర్ణయించింది.
మరిన్ని వివరాలకు 040-- 27702407, 97013 60701, 92814 95845, 92814 95843, 92810 30750, 92810 30740 నంబర్లలో సంప్రదించాలని సూచించింది. ఆన్‌లైన్ బుకింగ్ కోసం www.irctctourism.comను సంప్రదించాలని కోరింది.