బోనకల్​లో రైల్వే మూడో లైన్ పనుల పరిశీలన : మాధవి

బోనకల్​లో రైల్వే మూడో లైన్ పనుల పరిశీలన : మాధవి

మధిర, వెలుగు : కాజీపేట నుంచి విజయవాడ వరకు ఏర్పాటు చేసిన రైల్వే మూడో లైన్ ను సెంట్రల్ రైల్వే సేఫ్టీ ఆఫీసర్ మాధవి, సికింద్రాబాద్ డివిజనల్ మేనేజర్ ​భరత్​కుమార్​జైన్ తో పాటు పలువురు అధికారులు బుధవారం బోనకల్​ రైల్వేస్టేషన్​లో పరిశీలించారు. రైల్వే అమృత్ పథకం కింద చేపట్టిన పనులను,  రైల్వే స్టేషన్ ను,  సిగ్నలింగ్ వ్యవస్థను పరిశీలించి పలు సూచనలు చేశారు. స్టేషన్ ముందు ఏర్పాటు చేసిన పార్కులో మొక్కలు నాటారు. 

కాగా పలు రైల్వే సమస్యలపై స్థానిక రాజకీయ పార్టీల నాయకులు అధికారులకు వినతి పత్రాలు అందజేశారు. బోనకల్లు రైల్వే స్టేషన్​లో  ఇంటర్​సిటీ,  శాతవాహన, పద్మావతి రైళ్లతో పాటు పలు రైళ్లను  ఆపేలా చూడాలని కోరారు.  రైల్వే రిజర్వేషన్ కౌంటర్ ను ఏర్పాటు చేయాలని,  రైల్వే పాత గేటు సమీపంలో ఓవర్ బ్రిడ్జి పక్కన అండర్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై డీఆర్ఎం స్పందిస్తూ ఇప్పటికే ఇక్కడ ఎక్స్​ ప్రెస్​ రైళ్లను ఆపాలనే డిమాండ్ ఉందని తన దృష్టికి వచ్చిందన్నారు.

 అండర్ బ్రిడ్జి నిర్మాణం కోసం నివేదికను  రైల్వే బోర్డుకు పంపిస్తామని చెప్పారు. అనంతరం మోటమర్రి రైల్వే స్టేషన్ నుంచి పందిళ్లపల్లి రైల్వే స్టేషన్ వరకు కొత్త లైన్​ పూర్తి కావడంతో బోనకల్లు రైల్వే వద్ద వారు పూజలు చేశారు. బోనకల్​ రైల్వే స్టేషన్ నుంచి మోటమర్రి రైల్వే స్టేషన్ వరకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మోటర్  ట్రాలీలపై వెళ్లి మార్గాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఆర్ఎస్  శ్రీనివాస్, సీఈఈ  సురజాన్ రెడ్డి, సీఎస్టీఈ  గుడేశార్, సీఈ  సునీల్ కుమార్ వర్మ, సీఏవో సత్య ప్రకాశ్, రైల్వే అధికారులు  పాల్గొన్నారు.