మహబూబాబాద్ జిల్లాలోని కేసముద్రం మండలం ఇంటికన్నె రైల్వే స్టేషన్ సమీపంలో వరదకు రైల్వే ట్రాక్ కొట్టుకుపోయిన సంగతి తెలిసిందే. ఈ పరిణామంతో తెలంగాణ, ఏపీ మధ్య రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో రంగంలోకి దక్షిణ మధ్య రైల్వే అధికారులు యుద్ధ ప్రాతి పదికన ట్రాక్ మరమ్మత్తు పనులు చేపట్టారు. మూడు రోజుల పాటు పగలు రాత్రి శ్రమించి ట్రాక్‌ను పునరుద్ధరించారు. మరమ్మత్తు పనులు పూర్తి కావడంతో కొబ్బరికాయ కొట్టి ఇవాళ (సెప్టెంబర్ 4) అధికారులు ట్రయల్ రన్ నిర్వహించారు.
వరద ప్రభావంతో మొన్న కేసముద్రం వద్ద నిలిచిపోయిన సంఘమిత్ర ఎక్స్ ప్రెస్‌తో ట్రయల్ రన్ నిర్వహించారు. ట్రయల్ రన్ సక్సెస్ కావడంతో ఇవాళ (బుధవారం) సాయంత్రం నుండి పూర్తిస్థాయిలో యధావిధిగా రైళ్ల రాకపోకలు కొనసాగించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. కాకపోతే, ప్రమాదం జరిగిన చోట రైళ్ల వేగం తగ్గించనున్నట్లు సమాచారం. దీంతో ఏపీ, తెలంగాణ మధ్య రైళ్లు పరుగులు పెట్టనున్నాయి.