ఖమ్మం, వెలుగు : ఖమ్మంలోని సారథినగర్ రైల్వే అండర్ బ్రిడ్జికి ఎనిమిదేండ్లకు మోక్షం కలిగింది. మామిళ్లగూడెం ప్రజల కష్టాలను తీరుస్తూ, ఇన్నేళ్ల తర్వాత ఆర్ యూబీ ప్రారంభానికి సిద్ధమైంది. 2016లో అప్పటి రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేతుల మీదుగా రూ.56 లక్షలతో రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మామిళ్లగూడెంలోని ప్రజలు ఖమ్మం నగరానికి వచ్చేందుకు దూరం తగ్గించేలా దీన్ని నిర్మించారు. రెండేండ్లలోనే నిర్మాణం పూర్తి చేసుకున్నా, పలు కారణాలతో దాన్ని ప్రారంభించలేదు.
అప్రోచ్ రోడ్డు విషయంలో కొంత వివాదం నెలకొనడంతో కొన్నేళ్లుగా చెత్తా చెదారం మధ్య బ్రిడ్జి ఉండిపోయింది. మళ్లీ ఇటీవల రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చొరవ చూపడంతో బ్రిడ్జి ప్రారంభానికి మార్గం సుగమమైంది. అప్రోచ్ రోడ్డు విషయంలో సమస్యను పరిష్కరించి, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో అక్కడి పరిసరాలను క్లీన్ చేశారు. అందమైన వాల్ పెయింటింగ్స్, ఇతర బొమ్మలతో బ్రిడ్జిని అద్భుతంగా తీర్చిదిద్దారు. శనివారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేతుల మీదుగా రైల్వే అండర్ బ్రిడ్జిని ప్రారంభించనున్నారు.