జీవితం అనేది రైలు ప్రయాణం లాంటిది. నిజమే జీవితానికే కాదు చాలా రకాలుగా... అంటే వ్యాపార, వాణిజ్యాలు, దేశ విదేశాల సంబంధాలు వంటివెన్నో రైలుతో ముడిపడి ఉంటాయి. స్టీమ్ ఇంజిన్ రైలు బండి నుండి సోలార్ ఎనర్జీతో నడిచే రైలు వరకు రైల్వే వ్యవస్థ ఎలాగైతే డెవలప్ అయిందో అలాగే దాని చుట్టూ ముడిపడి ఉన్న ఎన్నో అంశాల్లో కూడా అభివృద్ధి జరుగుతోంది...
ఒకప్పుడు రైలు బండిని పచ్చ జెండా నడిపేది. కానీ... ఇప్పుడు గ్రీన్ సిగ్నల్ నడుపుతోంది. ఒక్క సిగ్నలింగ్ విషయంలోనే కాదు... చాలా విషయాల్లో మార్పులు వచ్చాయి. సీటు దగ్గరికే భోజనం తీసుకొచ్చి ఇస్తున్నారు. ఇక లగ్జరీ ట్రైన్లలో అయితే.. విమానాల్లో ఎయిర్ హోస్టెస్ ఉన్నట్టు ట్రైన్ హోస్టెస్‌లు కూడా ఉంటున్నారు. ఒకప్పుడు విమానంలో వెళ్లడం లగ్జరీ. కానీ.. ఇప్పుడు కొన్ని రకాల రైళ్లలో వెళ్లడం కూడా లగ్జరీనే అయింది.
అదెందుకు అంటే... రైలు టికెట్ ధరలు కూడా ఫ్లైట్ ఛార్జీలకు తీసిపోకుండా ఉంటున్నాయి. ఒక్కోసారి ఫ్లయిట్ టికెట్ కంటే ఎక్కువే అవుతున్నాయి. ఒకప్పుడు ఓ చేతిలో పెన్ను, మరో చేతిలో ప్యాసింజర్స్ లిస్ట్ పట్టుకుని టికెట్ చూపించమని అడిగే టికెట్ కలెక్టర్.. ఇప్పుడు ట్యాబ్ పట్టుకొచ్చి బుకింగ్ నెంబర్ అడుగుతున్నారు . అంతేకాదు.. ట్రైన్ ఇంజిన్లు అప్‌గ్రేడ్ అయ్యాయి. పట్టాల మీద బుల్లెట్లలా దూసుకుపోతున్నాయి. అన్ని సౌకర్యాలు ఉండే అధునాతన కోచ్‌లు వచ్చాయి.
బయో టాయిలెట్లు డెవలప్ చేశారు. ఇ–టికెటింగ్ సౌకర్యం కల్పించారు. చివరకు ఫ్లాట్‌ఫాం టికెట్ కూడా ఫోన్ నుంచే బుక్ చేసుకోవచ్చు. ఇలా.. ఒక్కటేమిటి ఒకప్పటితో పోలిస్తే.. ఎన్నో మార్పులు వచ్చాయి. అందుకే కొన్నేండ్ల నుంచి ఇండియన్ రైల్వే రూపురేఖలు మారుతున్నాయి. హై-స్పీడ్ రైళ్లను ప్రవేశపెట్టడం నుండి రైల్వే ట్రాక్‌ల విస్తరణ, రైల్వే స్టేషన్లను అప్‌గ్రేడ్ చేయడం.. లాంటివెన్నో జరిగాయి.
రైల్వే ట్రాక్‌ల ఎలక్ట్రిఫికేషన్
పర్యావరణానికి అనుకూలమైన రవాణా విధానాన్ని తీసుకురావాలనే లక్ష్యంతో రైల్వేల ఎలక్ర్టిఫికేషన్ మొదలుపెట్టారు. అయితే.. దీనివల్ల ఫ్యుయెల్ వాడకం తగ్గడంతోపాటు కాలుష్యాన్ని కూడా అరికట్టవచ్చు. ఈ ప్రాజెక్ట్‌కు గడిచిన పదేండ్లలో చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. అందుకే ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ రైల్వే నెట్‌వర్క్ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. రైల్వే మంత్రిత్వ శాఖ ప్రకారం.. 2023 మార్చి 31 నాటికి 14 రాష్ట్రాలు, కొన్ని కేంద్ర పాలిత ప్రాంతాలు వంద శాతం ట్రైన్ నెట్‌వర్క్‌ల విద్యుదీకరణ సాధించాయి.
ఇప్పటికే ఢిల్లీ, చండీగఢ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ–కాశ్మీర్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, పుదుచ్చేరి, మధ్యప్రదేశ్, మేఘాలయ, తెలంగాణ, ఒడిశా, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ ఎలక్ట్రిఫికేషన్ దాదాపు పూర్తయింది. ఇలా అప్‌గ్రేడ్ చేయడం వల్ల దిగుమతి చేసుకుంటున్న పెట్రోలియం బేస్‌డ్ ఫ్యుయెల్ మీద ఆధారపడడం తగ్గుతుంది. దీని వల్ల దేశ ఎనర్జీ సెక్యురిటీ కూడా పెరుగుతుంది. అందుకే రైల్వే సంస్థ వచ్చే ఏడాదిలోగా అన్ని రాష్ట్రాల్లో వంద శాతం విద్యుదీకరణ సాధించడం లక్ష్యంగా పెట్టుకుంది.
నెట్‌వర్క్ విస్తరిస్తోంది
గడిచిన కొన్నేండ్లలో దేశంలోని వివిధ రాష్ట్రాల్లో కొత్త రైల్వే లైన్లు వేసి నెట్‌వర్క్‌ని పెంచుతున్నారు. దీని వల్ల దేశంలో కెనెక్టివిటీ పెరగడమే కాకుండా పేదలకు ప్రయాణ ఖర్చులు తగ్గుతాయి. ఈశాన్య భారతదేశంలోచాలా ప్రాంతాలకు రైలు కనెక్టివిటీ అందించారు. అరుణాచల్ ప్రదేశ్‌లోని బలిపరా–భాలుక్‌పాంగ్, అస్సాంలోని సిల్చార్ నుండి లుమ్‌డింగ్, రంగియా నుండి ముర్కోంగ్‌సెలెక్, త్రిపురలోని అగర్తల నుండి కుమార్‌ఘాట్, మిజోరంలోని కథకల్ నుండి
బైరాబి వరకు రైలు మార్గాలను బ్రాడ్ గేజ్‌గా మార్చారు.
రైల్వే ట్రాక్‌ల డబులింగ్
రైళ్ల ట్రాఫిక్ తగ్గించడం లేదా ట్రాక్‌లను డబుల్ చేయడంపై కూడా ఇండియన్ రైల్వే దృష్టి పెట్టింది. 2023–24 బడ్జెట్‌లో రైల్వే ట్రాక్‌ల డబ్లింగ్ కోసం ఇండియన్ రైల్వే రూ.30,749 కోట్లు కేటాయించింది. డబ్లింగ్ అంటే.. సింగిల్ ట్రాక్ ఉన్న చోట మరో ట్రాక్ వేసి డబుల్ ట్రాక్‌గా మార్చడం. దీనివల్ల ట్రైన్లను ఆపరేట్ చేయడం ఈజీ అవుతుంది.
మోడర్న్ రైల్వే స్టేషన్లు
ఇంతకుముందు రైల్వే స్టేషన్‌ల పరిస్థితి చాలా అధ్వాన్నంగా ఉండేది. మల మూత్ర విసర్జనతో మురికిగా రైలు పట్టాలు, స్టేషన్‌లోని వెయిటింగ్‌ప్లేస్‌లో చెత్తా, చెదారం, ఎప్పుడూ కిక్కిరిసిపోయే జనం... కనిపించేవి. అయితే, ఇదంతా గతం. గత కొన్నేండ్లుగా రైల్వే స్టేషన్లను అప్‌గ్రేడ్ చేస్తున్నారు. రద్దీగా ఉండే స్టేషన్లలో ఫ్లాట్‌ఫాంల సంఖ్య పెంచుతున్నారు. ఈ మధ్య కాలంలో 400కి పైగా రైల్వే స్టేషన్లను రీ–డెవలప్ చేశారు. దాంతో ఇప్పుడు చాలా రైల్వే స్టేషన్లలో ప్రశాంత వాతావరణం కనిపిస్తోంది.
కొన్ని రైల్వే స్టేషన్లలో అయితే.. గోడలకు అందమైన పెయింటింగ్స్ కూడా వేస్తున్నారు. ప్రయాణికుల వెయిటింగ్ ప్లేస్‌ల్లో ఫోన్లు ఛార్జింగ్ పెట్టుకునేందుకు ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేశారు. చాలా స్టేషన్లలో స్పెషల్లీ ఏబుల్డ్ పర్సన్స్ వెయిట్ చేసేందుకు ప్రత్యేకంగా స్థలాన్ని కేటాయిస్తున్నారు. చాలా వరకు రైల్వే స్టేషన్లలో వీల్‌చైర్లు కూడా అందుబాటులో ఉంటున్నాయి. ప్రతిరోజూ లక్ష కంటే ఎక్కువ మంది ప్రయాణించే భారతీయ రైల్వే స్టేషన్లలో ఎస్కలేటర్లు, లిఫ్టులు ఏర్పాటుచేశారు.
వీటివల్ల పిల్లలు, వృద్ధులకు సౌకర్యంగా ఉంటోంది. రైల్వే స్టేషన్లలో వెయిటింగ్ రూమ్, కెఫెటేరియా, బుక్ స్టాల్స్ లాంటివి ఉంటాయి. పీపీపీ మోడల్‌లో ప్రపంచస్థాయి రైల్వే స్టేషన్‌లను కట్టే ట్రయల్స్ జరుగుతున్నాయి. భారతదేశంలోని మొదటి ఫస్ట్‌క్లాస్– వరల్డ్ క్లాస్ రైల్వే స్టేషన్ భోపాల్‌లో ఉంది. దానిపేరు రాణి కమలపాటి(హబీబ్‌గంజ్) రైల్వే స్టేషన్.
ఆటోమేటిక్ సిగ్నలింగ్
భారతీయ రైల్వే ప్రయాణంలో మరో ప్రధాన మైలురాయి రైల్వే స్టేషన్లలో ఆటోమేటిక్ ఎలక్ట్రానిక్ బ్లాక్ సిగ్నలింగ్ సిస్టమ్ అభివృద్ధి చేయడం. లైన్ కెపాసిటీ, ట్రాక్‌లపై సెక్యురిటీ పెంచే ఉద్దేశంతో ఆటోమెటిక్ సిగ్నలింగ్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. ఇది చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అయినా.. వెనక్కి తగ్గకుండా ఈ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. ఇండియన్ రైల్వే 2021–22లో 218 కిలోమీటర్ల మేర ఈ వ్యవస్థను తెచ్చింది.
ఇక 2022–23లో దాదాపు 530 కిలోమీటర్ల మేర ఆటోమెటిక్ సిగ్నలింగ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేసింది. ముందుముందు మరింత పెంచే ప్రయత్నాలు జరుగుతున్నాయి. బ్లాక్ సిగ్నలింగ్ సిస్టమ్‌లో రైల్వే లైన్‌ను విభాగాలు లేదా బ్లాక్‌లుగా డివైడ్ చేస్తారు. ప్రతి విభాగం చివరిలో ఆటోమెటిక్ బ్లాక్ సిగ్నలింగ్ యాక్సిల్ కౌంటర్లు ఉంటాయి. ఇవి రైలుని గుర్తించి, ట్రైన్‌ని తదుపరి విభాగంలోకి సేఫ్‌గా వెళ్లేందుకు సిగ్నల్ ఇస్తాయి. దీని వల్ల రైళ్లు ఒకే ట్రాక్ మీద ఎదురెదురుగా వచ్చి ఢీ కొట్టుకునే ప్రమాదాలు తగ్గుతాయి.
పొడవైన రైల్వే టన్నెల్
గడిచిన కొన్నేండ్లలో ఇండియన్ రైల్వే చాలా ప్రాజెక్ట్‌లు చేపట్టింది. అందులో భాగంగానే ఇండియాలోనే అతి పొడవైన రైల్వే టన్నెల్‌ని నిర్మించింది. దీని పొడవు 11 కిలోమీటర్లు. దీన్ని బనిహాల్–ఖాజిగుండ్ రైల్వే టన్నెల్ లేదా పీర్ పంజాల్ రైల్వే టన్నెల్ అని పిలుస్తారు. ఇది జమ్మూ అండ్ కాశ్మీర్‌లోని పీర్ పంజాల్ గుండా వెళ్తుంది. కాశ్మీర్ లోయకు కనెక్టివిటీ పెంచడానికి 2013లో ఈ ప్రాజెక్ట్ మొదలుపెట్టారు.
సెమీ హై-స్పీడ్ రైళ్ల పరిచయం
జపాన్, చైనా లాంటి దేశాలతో పోలిస్తే.. మన దేశంలో ట్రైన్ల స్పీడ్ చాలా తక్కువ. అయినా.. కొన్నేండ్ల నుంచి స్పీడ్ విషయంలో చాలా డెవలప్ అయింది.ఇండియన్ రైల్వే అనేక కొత్త టెక్నాలజీలతో తయారైన రైళ్లను ఎప్పటికప్పుడు తెస్తుంటుంది. తేజస్ ఎక్స్‌ప్రెస్ లాంటి సెమీ–హై-స్పీడ్ రైలు సర్వీసులతో పాటు ఇంజిన్–లెస్, సెల్ఫ్ ప్రొపెల్డ్ ‘వందే భారత్’ ఎక్స్‌ప్రెస్‌లను తెచ్చింది. ఇవి ప్రయాణికుల టైంని ఎంతగానో ఆదా చేస్తున్నాయి.
ఈ మధ్య తెచ్చిన ‘ర్యాపిడ్ ఎక్స్’ రైలు గంటకు160 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుంది. వీటితోపాటు హైస్పీడ్ బుల్లెట్ ట్రైన్స్ ప్రాజెక్టు మీద కూడా ఇండియన్ రైల్వే పని చేస్తోంది. అంతేకాకుండా రైలు ప్రయాణాలను మరింత పర్యావరణానికి అనుకూలంగా మార్చడానికి సీఎన్‌జీ, సోలార్ ఎనర్జీ రైళ్లను పట్టాలెక్కిచ్చింది.
సెమీ హైస్పీడ్ రైళ్లలో వై-ఫై, జీపీఎస్, బయో-వాక్యూమ్ టాయిలెట్లు, హీట్ వెంటిలేషన్, ఎయిర్ కండిషనింగ్, ఎల్‌ఈడీ లైటింగ్, సీసీటీవీ నిఘా లాంటి ఎన్నో ఆధునిక సౌకర్యాలు కల్పించారు.
ర్యాపిడ్ ఎక్స్
ఇండియన్ రైల్వే కొన్నాళ్ల నుంచి హైస్పీడ్ రైళ్లను ట్రాక్ ఎక్కించేందుకు ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే హైస్పీడ్ ట్రైన్ ర్యాపిడ్ ఎక్స్‌ని ప్రారంభించారు. ఢిల్లీ ఎన్‌సిఆర్‌లో ఈ ర్యాపిడ్ ఎక్స్ ట్రైన్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఘజియాబాద్‌లోని17 కిలోమీటర్ల కారిడార్‌లో ర్యాపిడ్ ఎక్స్ నడుస్తోంది. దీన్ని మహిళా పైలట్లు నడుపుతున్నారు. ఇందులో ఆరు కోచ్‌లు ఉన్నాయి. అవన్నీ లేటెస్ట్ టెక్నాలజీతో తయారయ్యాయి.
ఇందులోని ప్రీమియం కోచ్‌లో రిక్లైనింగ్ సీట్లు, ఎక్స్‌ట్రా లెగ్‌రూమ్ వంటి సౌకర్యాలు ఉన్నాయి. మెట్రో రైళ్లలో ఉన్నట్టు మహిళా ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా ఒక కోచ్ రిజర్వ్ చేస్తారు. రైలుకు రెండు చివర్లలో పైలట్ క్యాబిన్‌లు ఉంటాయి. అన్నింటిలో కలిపి 407 సీట్లు, 1,061 మంది ప్రయాణికులు నిలబడేందుకు వీలుగా కోచ్‌లు డిజైన్ చేశారు. ప్రతి సీటు దగ్గర ఛార్జింగ్ పాయింట్, కాంప్లిమెంటరీ ఆన్‌బోర్డ్ వైఫై ఉంటాయి. పబ్లిక్ అనౌన్స్‌మెంట్, డిస్‌ప్లే సిస్టమ్, డైనమిక్ రూట్ మ్యాప్ డిస్‌ప్లే, వీల్‌చైర్‌ల కోసం ప్రత్యేక ఏర్పాట్లు ఉన్నాయి. ఇది గంటకు160 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది.
వందే భారత్
పూర్తి దేశీ టెక్నాలజీతో తయారుచేసిన తొలి సెమీ హైస్పీడ్ రైలు. తొలి వందేభారత్ రైలును -2019లో ప్రధాని మోదీ ప్రారంభించారు. ఇది ఢిల్లీ – వారణాసి మధ్య నడుస్తోంది. ఇప్పుడు సికింద్రాబాద్ నుంచి కూడా పలు డెస్టినేషన్లకు వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లు నడుస్తున్నాయి. ఈ రైలు గంటకు గరిష్టంగా180 కిలోమీటర్ల వేగంతో వెళ్లగలదు. కానీ.. 160 కిలోమీటర్లకు మించకుండా నడుపుతున్నారు. ఈ రైలులో అత్యాధునిక సేఫ్టీ సిస్టమ్స్ఉన్నాయి. ఎదురెదురుగా వచ్చే రైళ్లు ఢీకొట్టుకోకుండా ‘కవచ్’ అనే దేశీ టెక్నాలజీ వాడుతున్నారు. ఒకవేళ వందే భారత్ వెళ్తున్న ట్రాక్‌లో మరేదైనా రైలు ఉంటే కిలోమీటరు ముందు నుంచే ట్రైన్ స్పీడ్ ఆటోమెటిక్‌గా తగ్గిపోతుంది. ఇది140 సెకన్లలోనే160 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఎక్కువగా రాష్ట్రాల మధ్య ప్రయాణించే వాళ్లకు బెస్ట్ ఛాయిస్. అందుకే ఈ ప్రాజెక్ట్‌ని ప్రజలతోపాటు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రశంసించాయి.
గతిమాన్
భారతదేశపు మొట్టమొదటి సెమీ హై-స్పీడ్ లగ్జరీ రైలు ‘గతిమాన్ ఎక్స్‌ప్రెస్’. దేశంలో అత్యంత వేగవంతమైన రైళ్లలో ఒకటి. గంటకు160 కిలోమీటర్ల వేగంతో, ప్రయాణించగలదు. కేవలం100 నిమిషాల్లో న్యూఢిల్లీ నుంచి ఆగ్రాకు188 కిలోమీటర్ల దూరం వెళ్తుంది. ప్రతి కోచ్‌లో స్లైడింగ్ డోర్లు, బయో–టాయిలెట్లు, ప్రతి సీటు వెనుక ఎనిమిది అంగుళాల ఎల్.సి.డి. స్క్రీన్ ఉంటాయి. ప్రయాణికులు సాఫీగా ప్రయాణించేందుకు కోచ్‌లలో బ్యాలెన్స్‌డ్ గేర్ కప్లర్‌లు అమర్చారు.
తేజస్ ఎక్స్‌ప్రెస్
తేజస్ ఎక్స్‌ప్రెస్ పూర్తిగా ఎయిర్ కండిషన్డ్ రైలు. గరిష్టంగా గంటకు 200 కిలోమీటర్లు వెళ్లగలదు. కానీ.. మన దగ్గర ఉన్న రైల్వే ట్రాక్‌లు ఆ స్పీడ్‌ని తట్టుకోలేవు. అందుకే దీని వేగాన్ని చాలావరకు తగ్గించారు. ముంబై నుండి మడ్గావ్, చెన్నై నుండి మధురై, లక్నో నుండి న్యూఢిల్లీ, అహ్మదాబాద్ నుండి ముంబై సెంట్రల్‌కు ఈ ట్రైన్లు నడుస్తున్నాయి. పర్సనల్ రీడింగ్ లైట్లు, మొబైల్ ఛార్జింగ్ పాయింట్లు, టీ, కాఫీ వెండింగ్ మెషిన్లు ఈ ట్రైన్లలో ఉంటాయి.
టెక్నాలజీ: ఇండియన్ రైల్వే మొదలైనప్పటినుంచి ఇప్పటివరకు అనేక విధాలుగా టెక్నాలజీని అప్‌గ్రేడ్ చేస్తూనే ఉంది. ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ సిస్టమ్ నుంచి బయో టాయిలెట్ల వరకు అనేక మార్పులను తెచ్చింది.
బయో–టాయిలెట్లు : రైలు కోచ్‌లలో బయో-టాయిలెట్లు ఏర్పాటు చేసింది. గొప్ప సాంకేతిక విప్లవాల్లో ఇది కూడా ఒకటి. రైల్వే సంప్రదాయ టాయిలెట్ వ్యవస్థ.... ట్రాక్‌ల వెంట బహిరంగ మలవిసర్జన చేసినట్టే ఉండేది. బయో టాయిలెట్లలో మానవ వ్యర్థాలను నీరు, గాలిగా మార్చడానికి ఎనెరోబిక్ బ్యాక్టీరియా వాడతారు. దీనివల్ల రైల్వే ట్రాక్‌లపై మానవ వ్యర్థాలు పడవు. దాంతో పర్యావరణానికి మేలు జరగడమే కాకుండా పరిశుభ్రత కూడా పెరుగుతుంది.
దీనివల్ల రైల్వే స్టేషన్ల నిర్వహణ ఖర్చు కూడా తగ్గింది. వైఫై కనెక్టివిటీ : ఇండియన్ రైల్వేలు ప్రయాణికులకు అల్ట్రామోడర్న్ సౌకర్యాలను కూడా ఇస్తోంది. ఇప్పటికే దేశంలోని ఆరు వేల రైల్వే స్టేషన్లలో ఫ్రీ వైఫై ఫెసిలిటీ ఉంది. ట్రైన్ ట్రాకింగ్ సిస్టమ్ : జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్ కూడా అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా ప్రయాణికులు ట్రైన్ లైవ్ లొకేషన్ తెలుసుకోవచ్చు. ఏ స్టేషన్‌కి ఎప్పుడు చేరుకుంటుంది. ఎంత ఆలస్యంగా వస్తుంది... లాంటివన్నీ ట్రాక్ చేయొచ్చు.
అంతేకాదు.. రైలు బోర్డింగ్, డీబోర్డింగ్ టైంతో పాటు ట్రైన్ ఎంత స్పీడ్‌తో వెళ్తోంది అనేది కూడా తెలుస్తుంది. పొగమంచు లేదా ఏదైనా అసాధారణ వాతావరణ పరిస్థితుల వల్ల ఒక్కోసారి రైళ్లు దారి మళ్లిస్తారు. అలాంటి పరిస్థితుల్లో ఈ ట్రాకింగ్ సిస్టమ్ ద్వారా రైలు దారి ఎటు మళ్లుతుందో ముందుగానే తెలుస్తుంది.
ఎల్‌హెచ్‌బీ కోచ్‌లు
ఈ మధ్య మొదలుపెట్టిన వందే భారత్ రైళ్ల కోసం ఈ ఎల్‌హెచ్‌బీ(లింక్ హాఫ్‌మన్ బుష్ ) కోచ్‌లు తయారు చేశారు. ఐసీఎఫ్ కోచ్‌ల కంటే ఎల్‌హెచ్‌బీ కోచ్‌లు చాలా తేలికగా, బలంగా, సౌకర్యవంతంగా ఉంటాయి. అన్నిటికంటే ముఖ్యం వీటి సేఫ్టీ కూడా ఎక్కువే. ఎక్కువ స్పీడ్‌ని తట్టుకోగలవు. పాత ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్)ని క్రమంగా లింక్ హాఫ్‌మన్ బుష్ (ఎల్‌హెచ్‌బీ) కోచ్‌ల ఫ్యాక్టరీగా 2025–30 మధ్య మార్చాలనే ఆలోచనలో ఉంది ఇండియన్ రైల్వే.
డిజిటలైజేషన్
టికెట్ బుకింగ్ నుంచి గూడ్స్ ట్రాన్స్‌పోర్టేషన్ వరకు అన్నీ ఆన్‌లైన్‌లోనే చేసుకునేందుకు ఐఆర్‌సీటీసీని డెవలప్ చేశారు. ఏ అవసరం ఉన్నా రైల్వే స్టేషన్‌కు వెళ్లాల్సిన పని లేదు. అన్ని ఆన్‌లైన్‌లోనే చేసుకోవచ్చు. కంప్లైంట్స్ కూడా ఆన్‌లైన్‌లో ఇవ్వొచ్చు. ఇవన్నీ యాప్‌ల ద్వారా కూడా చేసుకోవచ్చు. ఐఆర్‌సీటీసీ క్యాటరింగ్ ద్వారా ప్రయాణికులు ట్రైన్‌లోనే ఉండి ఇష్టమైన ఫుడ్‌ను ఏ స్టేషన్‌లో తీసుకుంటారో ముందుగానే సెలక్ట్ చేసుకుని ఆర్డర్ చేసుకోవచ్చు. బుక్ చేసుకున్న స్టేషన్‌లో కోచ్‌లోకి ఫుడ్ తెచ్చిస్తారు.
లగ్జరీ రైళ్లు
ఇండియన్ రైల్వే ఐదు రాయల్ రైళ్లను కూడా నడుపుతోంది. ‘రాయల్ రాజస్తాన్ ఆన్ వీల్స్, ప్యాలెస్ ఆన్ వీల్స్, ది గోల్డెన్ చారియట్, ది మహారాజాస్ ఎక్స్‌ప్రెస్, దక్కన్ ఒడిస్సీ’... ఈ రైళ్లలో ప్రయాణం ఖర్చుతో కూడింది. వీటిలో చాలా రకాల సౌకర్యాలు ఉంటాయి. ఇవన్నీ టూరిజం కోసం ఏర్పాటు చేసిన రైళ్లు. విలాసవంతమైన రైలు ప్రయాణం ఎక్స్‌పీరియెన్స్ చేసేందుకు ఇవి బెస్ట్ ఛాయిస్. వీటిలో ఎయిర్ కండిషన్డ్ డీలక్స్ క్యాబిన్లు, అటాచ్డ్ బాత్‌లు, థీమాటిక్ డెకోర్, రెస్టారెంట్, కేఫ్, లైబ్రరీ, స్పా, బార్ లాంటివి కూడా ఉంటాయి.
ఎక్కువ దూరం ప్రయాణించే వివేక్
భారత్‌లో ఎక్కువ దూరం ప్రయాణించే రైలు వివేక్ ఎక్స్‌ప్రెస్. ఇది మొత్తం 4,273 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. అస్సాంలోని దిబ్రూగఢ్ నుంచి తమిళనాడులోని కన్యాకుమారి వరకు వెళ్తుంది. ఇది తొమ్మిది రాష్ట్రాల మీదుగా ప్రయాణిస్తుంది. 56 స్టేషన్లలో ఆగుతుంది. దీన్ని స్వామి వివేకానంద 150వ జయంతి సందర్భంగా 2013లో ప్రారంభించారు. ఆయన పేరు మీదే ఈ రైలుకు ‘వివేక్ ఎక్స్‌ప్రెస్’ అని పేరు పెట్టారు. మొదటి స్టేషన్ నుంచి చివరి స్టేషన్ చేరుకోవడానికి ఐదు రోజులు పడుతుంది. ఇదిలా ఉంటే మన దేశంలో అత్యంత తక్కువ దూరం జర్నీ చేసే రైలు మహారాష్ట్రలోని నాగ్‌పూర్ నుండి అజ్ని వరకు నడుస్తోంది. ఈ జర్నీ టైం మూడు కిలోమీటర్లు మాత్రమే.
రిజర్వేషన్ సిస్టమ్
ఇండియన్ రైల్వే టెక్నాలజీ వాడుకుని1985లోనే ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ మొదలుపెట్టింది. ఢిల్లీ, మద్రాస్, బాంబే, కలకత్తాల్లో ఈ సిస్టమ్‌ని తీసుకొచ్చారు. ప్రయాణికులు ఏ టెర్మినల్ నుంచైనా ఏ రైలులో బెర్త్ అయినా రిజర్వ్ చేసుకోవడానికి, రద్దు చేయడానికి ఇది ఉపయోగపడింది. ఆ తర్వాత1995లో దేశవ్యాప్తంగా కంప్యూటరైజ్డ్ రిజర్వేషన్, టికెటింగ్ (కాన్సర్ట్) నెట్‌వర్క్‌ను ప్రవేశపెట్టడంతో జనాలకు టికెట్ రిజర్వ్ చేసుకోవడం ఈజీ అయింది.
ఇంటర్నెట్ వాడకం 2000 సంవత్సరం నుండి బాగా పెరిగింది. దాంతో ఇండియన్ రైల్వేల్లో కూడా మార్పులు వచ్చాయి. ముఖ్యంగా ప్రధాన నగరాల్లో ఏర్పాటు చేసిన మెట్రో ట్రైన్లకు ఇది బాగా ఉపయోగపడింది. మెట్రో ట్రైన్స్ ఢిల్లీ (2002), బెంగళూరు (2011), గుర్గావ్ (2013), ముంబయి (2014) హైదరాబాద్ (2017)ల్లో ఏర్పాటయ్యాయి. 2002లోనే ఈస్ట్ కోస్ట్, సౌత్ వెస్టర్న్, సౌత్ ఈస్ట్ సెంట్రల్, నార్త్ సెంట్రల్, వెస్ట్ సెంట్రల్ రైల్వే జోన్లను ఏర్పాటు చేశారు.
అదే టైంలో ఇండియన్ రైల్వే ఒక ముందడుగు వేసింది. అదేంటంటే.. ఇంటర్నెట్ ద్వారా ట్రైన్ టికెట్ రిజర్వేషన్ చేసుకునే అవకాశం కల్పించింది. ఇప్పటికీ ఐఆర్‌సీటీసీ టికెటింగ్ సౌకర్యాన్ని చాలామంది వాడుకుంటున్నారు. ఐఆర్‌సిటీసీ వెబ్‌సైట్‌లో లేదా దేశవ్యాప్తంగా ఉన్న వేలాది మంది టికెట్ ఏజెంట్ల ద్వారా టికెట్ బుక్ చేసుకోవచ్చు.
యునెస్కో గుర్తింపు
ఇండియన్ రైల్వే మన అవసరాలు తీర్చడమే కాకుండా... వారసత్వ సంపదగా నిలుస్తుంది కూడా. వంద ఏండ్లకు పైగా భారత దేశ చరిత్ర మోసిన పట్టాలు. అప్పటి అర్కిటెక్ట్‌ని కళ్లకు కట్టినట్టు చూపించే రైల్వే స్టేషన్లు ఇప్పటికీ ఉన్నాయి. వాటిని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల లిస్ట్‌లో చేర్చింది. అవి...
నీలగిరి మౌంటైన్ రైల్వే
నీలగిరి మౌంటైన్ రైల్వే... కెల్లార్, కూనూర్, వెల్లింగ్టన్, లవ్‌డేల్ మీదుగా తమిళనాడులోని మెట్టుపాళయం, ఊటీలను కలిపే న్యారోగేజ్ సింగిల్-ట్రాక్ రైల్వే సిస్టమ్. అందమైన అడవుల మధ్య ప్రయాణం సాగుతుంది. ఈ రూట్‌లో ట్రైన్ వేయాలని1854లో నిర్ణయించారు. కానీ.. పర్వత ప్రాంతం కావడం వల్ల 1891లో పని మొదలుపెట్టారు. చివరకు 1908లో పూర్తయింది. అప్పుడే ఈ రూట్‌లో ట్రైన్ మొదలైంది. దీన్ని 2005లో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది. 45.88 కిలోమీటర్ల పొడవున్న ఈ రూట్‌లో 16 టన్నెల్స్ ఎన్నో మలుపులు ఉంటాయి. ఈ రూట్‌లో అందమైన వంతెనలు కూడా ఉన్నాయి.
డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే
ఇది పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మొట్టమొదటి హిల్ ప్యాసింజర్ రైల్వే సిస్టమ్. దీన్ని 1879–1881 మధ్య కట్టారు. ఇక్కడ నడిచే ట్రైన్ చిన్నదిగా ఉండడంతో దీన్ని ‘టాయ్ ట్రైన్’ అని కూడా పిలుస్తుంటారు. దేశ విదేశాల నుంచి ఇక్కడికి విజిటర్స్ వస్తుంటారు. ఇది1881లో మొదలైంది. దీన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా 1999లో ప్రకటించింది. 88.48 కిలోమీటర్ల ఈ రూట్‌లో వర్షాకాలంలో చేసే జర్నీ చాలా బాగుంటుంది.
ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్
గతంలో విక్టోరియా టెర్మినస్ స్టేషన్‌గా పిలువబడే ఈ చారిత్రాత్మక రైల్వే స్టేషన్ విక్టోరియన్ గోతిక్ రివైవల్ ఆర్కిటెక్చర్‌లో ఉంటుంది. బ్రిటిష్ ఆర్కిటెక్చరల్ ఇంజనీర్ ఎఫ్‌డబ్ల్యూ స్టీవెన్స్ దీన్ని కట్టారు. ఇందులో ఇటాలియన్ గోతిక్ శైలి కూడా కనిపిస్తుంది. రికార్డుల ప్రకారం.. దీని నిర్మాణం1878లో మొదలైంది. ఇది పూర్తయ్యేందుకు సుమారు పదేండ్లు పట్టింది. గతంలో క్వీన్ విక్టోరియా స్వర్ణోత్సవాన్ని పురస్కరించుకుని దీనికి ‘విక్టోరియా టెర్మినస్’ అని పేరు పెట్టారు. తర్వాత1996లో ‘ఛత్రపతి శివాజీ టెర్మినస్’గా పేరు మార్చారు. ఇది ముంబైలో ఉంది.
కల్కా సిమ్లా రైల్వే
ఈ రైల్వే రూట్ 96.54 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేస్తుంది. సోలన్, బరోగ్, సలోగ్రా, కందఘాట్, షోఘి, తారాదేవి, జుటోగ్.. లాంటి ఎన్నో అందమైన ప్రదేశాల గుండా వెళ్తుంది. దీన్ని బ్రిటిష్ వాళ్లు 1898– 1903 మధ్య కట్టారు. 2008లో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ హోదా పొందింది. ఇది ఇండియాలోని అత్యంత అందమైన రైల్వేల్లో ఒకటి. హిమాచల్ ప్రదేశ్‌లోని పర్వతాలు, లోయల గుండా ఈ రైలు ప్రయాణిస్తుంది.
రైల్ ఇలా మొదలైంది
భారతీయ రైలు ప్రయాణం1853లో మొదలైంది. రైళ్లు నడిస్తే.. బ్రిటిష్‌వాళ్లకు సరకుల రవాణ ఈజీ అవుతుంది. రైల్వే లైన్లు వేయడానికి బ్రిటిష్ గవర్నమెంట్ ముందుకొచ్చింది. అయితే1853లో రైల్వే వ్యవస్థ హడావిడిగా ఏర్పాటు చేయడానికి కారణం మాత్రం అమెరికాలో పత్తి పంటల్లో నష్టాలు రావడమే అంటారు ఎక్స్‌పర్ట్స్.1846లో అమెరికాలో పత్తి పంటలు బాగా దెబ్బతిన్నాయి. అక్కడి నుంచే బ్రిటన్‌కు పత్తి ఎగుమతి అయ్యేది.
కానీ.. 1846లో అనుకున్న దానికంటే చాలా తక్కువ మొత్తంలో పత్తి ఎగుమతి జరిగింది. దాంతో.. బ్రిటన్‌లోని మాంచెస్టర్, గ్లాస్గో ప్రాంతాల్లోని బట్టల వ్యాపారులు వేరే మార్కెట్లను వెతుక్కోవలసి వచ్చింది. అప్పుడే వ్యాపారుల కన్ను పత్తి పంట ఎక్కువగా పండే బ్రిటిష్ కాలనీల్లో ఒకటైన భారతదేశం మీద పడింది. భారత ఉపఖండంలోని అనేక ప్రాంతాల్లో పత్తి ఉత్పత్తి జరుగుతుంది. అన్ని ప్రాంతాల నుంచి రోడ్ల ద్వారా ఓడ రేవులకు పత్తి తరలించి, అక్కడినుంచి బ్రిటన్ తీసుకెళ్లడానికి చాలా టైం పట్టింది.
పత్తిని ట్రాన్స్‌పోర్ట్ చేయడానికి సులభమైన మార్గాలు వెతికారు. చివరకు పత్తితోపాటు ఇతర వస్తువులను వేగంగా రవాణా చేయడానికి మారుమూల ప్రాంతాల నుంచి భారతదేశంలోని ప్రధాన ఓడరేవులకు లింక్‌లు నిర్మించాలి అనుకున్నారు. అందుకే... బ్రిటిష్ వాళ్లు రైల్వే వ్యవస్థ ఏర్పాటును వేగవంతం చేశారు. పైగా అల్లర్లు జరిగినప్పుడు అక్కడి జనాభాను కంట్రోల్ చేయడానికి, దళాలను వేగంగా మోహరించడానికి రైళ్లు ఉపయోగపడతాయి అనుకున్నారు.
మొదటి రైల్వే సర్వీస్
రైల్వే లైన్‌ని నిర్మించడానికి ప్రత్యేకంగా గ్రేట్ ఇండియన్ పెనిన్సులర్ రైల్వే (జీఐపీఆర్) సంస్థను1849లో ఏర్పాటు చేశారు. చివరకు1853 ఏప్రిల్16న ఇండియాలో రైలు కూత పెట్టింది. ఆ కూతే ఇండియాలో రైలు విప్లవానికి కిక్ స్టార్టర్ అని చెప్తారు చరిత్రకారులు. దేశంలోని మొట్టమొదటి ప్యాసింజర్ రైలు బొంబాయిలోని బోరిబందర్, థానే స్టేషన్ల మధ్య 34 కిలోమీటర్లు ప్రయాణించింది. ఇది మూడు స్టీమ్ లోకోమోటివ్‌ల ద్వారా14 క్యారేజీలను తీసుకెళ్లింది.
ఇందులో 400 మంది ప్రయాణించారు. ఈ లైన్ సక్సెస్‌తో ఇండియాలో మరికొన్ని పెద్ద సిటీలను రైల్వే లైన్‌తో లింక్ చేసే ప్లాన్స్ రెడీ అయ్యాయి. ఇండియాలో తూర్పున ఉన్న నగరాలకు1854లో, దక్షిణాన ఉన్న నగరాలకు1856లో రైల్వే లైన్లు వేసేందుకు పనులు మొదలయ్యాయి. కలకత్తా–ఢిల్లీ రూట్‌ని1864లో, అలహాబాద్–జబల్‌పూర్ లైన్‌ను1867లో ప్రారంభించారు. వీటితో 4,000- మైళ్ల నెట్‌వర్క్ ఏర్పడింది.
అభివృద్ధి... అడ్డంకులు
ఈస్ట్ ఇండియా కంపెనీని1857నాటి తిరుగుబాటు తర్వాత రద్దు చేయడంతో బ్రిటిష్ రాజ్య పరిపాలన మొదలైంది. దాంతో1869–1881 మధ్య రైల్వేల్లో బయటి కాంట్రాక్టర్ల పాత్ర తగ్గింది. అప్పుడే దేశంలో కరువు వచ్చింది. కరువుతో అల్లాడుతున్న ప్రాంతాలకు సాయం చేయడానికి బ్రిటిష్ ప్రభుత్వం రైల్వే ట్రాక్‌లను విస్తరించింది. కలకత్తా, చెన్నై, ఢిల్లీ లాంటి ప్రధాన నగరాలను కలుపుతూ దాదాపు14,500 కిలోమీటర్ల నెట్‌వర్క్1880 నాటికి ఏర్పాటైంది.
ముఖ్యంగా మూడు ప్రధాన ఓడరేవు నగరాలైన బొంబాయి, మద్రాస్, కలకత్తా నుంచి అనేక ప్రాంతాలకు లైన్లు వేశారు. ఆ తర్వాత మొదటి ప్రపంచ యుద్ధం ప్రభావం కూడా ఇండియన్ రైల్వే మీద పడింది. యుద్ధం వల్ల కొన్ని సర్వీసులు పరిమితం చేయాల్సి వచ్చింది. మరికొన్ని డౌన్‌గ్రేడ్ చేశారు. దాంతో యుద్ధం ముగిశాక రైల్వేల అభివృద్ధి కోసం1924లో సాధారణ బడ్జెట్ నుండి రైల్వే ఫైనాన్స్‌ని వేరు చేశారు. రైల్వేస్ మొదటి వ్యక్తిగత డివిడెండ్‌ను1925లో పొందింది.
సౌకర్యాలు ఇలా...
లైన్ల విస్తరణ జరుగుతున్నా.. ప్రయాణికులకు ఫెసిలిటీస్ అంతగా ఉండేవి కావు. చాలా ఇబ్బందులు పడేవాళ్లు. దాంతో1890ల్లో మరుగుదొడ్లు, గ్యాస్ ల్యాంప్‌లు, విద్యుత్ దీపాల్లాంటి అనేక సౌకర్యాలు కల్పించారు. దాంతో ప్రజాదరణ విపరీతంగా పెరిగింది. రైళ్లలో రద్దీ పెరగడంతో ఫోర్త్ క్లాస్ ఆన్‌బోర్డ్ రూపొందించారు.
రైల్వే బోర్డ్
రైల్వేల విస్తరణ పెరగడంతో నిర్వహణ భారమైంది. దాంతో1901లో రైల్వే బోర్డు ఏర్పాటుచేశారు. ఇందులో ఒక ప్రభుత్వ అధికారి, ఆంగ్లేయ రైల్వే మేనేజర్, కంపెనీ రైల్వేల నుంచి ఒక ఏజెంట్ ఉంటారు. అప్పటి వైస్రాయ్ లార్డ్ కర్జన్ 1905లో బోర్డ్‌కు చాలా అధికారాలు ఇచ్చారు. అప్పటి నుండి బోర్డు పరిమాణం, ప్రాముఖ్యత పెరిగింది. జీఐపీఆర్, ఈస్ట్ ఇండియన్ రైల్వే రెండింటినీ1923లో జాతీయం చేశారు. దాంతో నిర్వహణ వ్యవస్థ మెరుగుపడింది.
ఎలక్ట్రిక్ రైలు
ప్రపంచవ్యాప్తంగా రైల్వేల్లో అనేక మార్పులు వచ్చాయి. కొత్త టెక్నాలజీ డెవలప్ అయ్యింది. ఆవిరి యంత్రాల నుంచి ఎలక్ట్రిక్, డీజిల్, సీఎన్జీతో నడిచే రైళ్ల వరకు అనేక మార్పులు జరిగాయి. వాటికి అనుగుణంగా ఇండియాలో కూడా మార్పులు జరిగాయి. ఇండియాలో మొదటి ఎలక్ట్రిక్ రైలు1925 ఫిబ్రవరి 3న బొంబాయి, కుర్లా మధ్య నడిచింది. దీనివల్లే తర్వాతి సంవత్సరాల్లో ఎలక్ట్రిక్ ట్రైన్ల అభివృద్ధి మొదలైంది. బ్రిటిషర్ల పాలనలో ఉన్న ఇండియాలో రైల్వే నెట్‌వర్క్ మొత్తం పొడవు1929 నాటికి 66,000 కిలోమీటర్లకు చేరింది. ఏడాదికి సుమారు 6.20 కోట్ల మంది ప్రయాణికులను, తొమ్మిది కోట్ల టన్నుల వస్తువులను ట్రాన్స్‌పోర్ట్ చేసే స్థాయికి ఎదిగింది.
దేశ విభజన
బ్రిటిష్ వాళ్లు ఇండియాకు స్వాతంత్ర్యం ప్రకటించి, దేశ విభజన చేసి వెళ్లారు. దాంతో1947లో ఇండియన్ రైల్వే వ్యవస్థ రెండుగా చీలిపోయింది. దీని వల్ల రైల్వేల్లో కొంత నెట్‌వర్క్ కొత్తగా ఏర్పడిన పాకిస్తాన్‌కు పోయింది. నార్త్ వెస్టర్న్ రైల్వే, బెంగాల్ అస్సాం రైల్వే లైన్లను విభజించారు. విభజన తర్వాత రెండు దేశాల్లో హింసాత్మక సంఘటనలు జరిగాయి. వాటి వల్ల రైల్వేలకు చాలా నష్టం జరిగింది. హింసాత్మక గుంపులు రైల్వే మౌలిక సదుపాయాలను దెబ్బతీశాయి. శరణార్థులను తీసుకెళుతున్న రైళ్లపై దాడులు జరిగాయి.
మళ్లీ పుంజుకుంది
కొన్నాళ్లకు ఇండియన్ రైల్వే మళ్లీ పుంజుకుంది. రైల్వే ఫ్రాంచైజీలపై కంట్రోలింగ్1949–1950లో పెరిగింది. రైల్వే నెట్‌వర్క్‌ను జోన్‌లుగా పునర్వ్యవస్థీకరణ1951–1952లో చేశారు. ఆ తర్వాత అత్యాధునిక రైళ్లు ఇండియన్ ట్రాక్‌ల మీద పరుగులు తీశాయి.1950ల్లోనే 25kv AC లైన్స్ వేశారు.
సాంకేతికత
1980వ దశకంలో దశల వారీగా స్టీమ్ లోకోమోటివ్‌లు పూర్తిగా తీసేశారు. దాదాపు 4,500 కిలోమీటర్ల ట్రాక్‌కి ఎలక్ట్రిసిటీ సౌకర్యాన్ని1980– 1990 మధ్యకాలంలో కల్పించారు. ఆ తర్వాత 1984లో భారతదేశపు మొట్టమొదటి మెట్రో వ్యవస్థ కలకత్తాలో మొదలైంది. 80వ దశకంలో నెట్‌వర్క్ పెద్దగా పెరగకపోయినా..90వ దశకంలో కొంకణ్ రైల్వే మొదలైంది. దీని ద్వారా పశ్చిమ ప్రాంతాన్ని దేశంలోని మిగిలిన ప్రాంతాలతో కలిపారు. 738 కి.మీ. కొత్త ట్రాక్‌లు వేశారు. ఇలా ఎన్నో ఒడిదుడుకుల నడుమ ఇండియన్ రైల్ జర్నీ సాగుతోంది. ఎన్ని అడ్డంకులు వచ్చినా అధిగమించి కొన్ని అభివృద్ధి చెందిన దేశాలతో సమానంగా సర్వీసులు అందిస్తోంది ఇండియన్ రైల్వే.
దేశాలను కలుపుతుంది
ఈ మధ్య ఢిల్లీలో జరిగిన జీ 20 సమ్మిట్‌లో ఓ ఒప్పందం జరిగింది. దాంతో ఇండియన్ రైల్వే ఒక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ మొదలుపెట్టబోతోంది. ఈ ఒప్పందం గురించి ప్రకటించిన వెంటనే ఇండియన్ రైల్వే ఫినాన్స్ కార్పొరేషన్ షేర్లు అమాంతం పెరిగాయి. సౌదీ అరేబియా, యూరోపియన్ యూనియన్, ఇండియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యుఎఇ), ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, యు.ఎస్. కలిసి ‘ఇండియా– మిడిల్ ఈస్ట్– యూరోప్’ ఎకనామిక్ కారిడార్ (ఐఎంఈసీ) ఏర్పాటుచేయాలన్న ఒప్పందం మీద సంతకాలు చేశాయి. దీనివల్ల కలిగే లాభం గురించి సింపుల్‌గా చెప్పాలంటే ఆయా దేశాల గుండా రైల్వే లైన్లను డెవలప్ చేస్తారు. ఈ రైల్వే లైన్ల వల్ల పెట్రోలియం లాంటి వనరులు దిగుమతి చేసుకోవడం ఈజీ అవుతుంది. షిప్పింగ్ టైం ఆదా అవుతుంది. ఖర్చులు, ఫ్యుయల్ వాడకం తగ్గుతాయి.
ఈ కారిడార్... యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, జోర్డాన్, ఇజ్రాయెల్ సహా మిడిల్ ఈస్ట్ అంతటా రైల్వే, పోర్ట్ సౌకర్యాలను కలుపుతుందనేది విశ్లేషకుల అభిప్రాయం. భారతదేశం, ఐరోపా మధ్య వాణిజ్యాన్ని 40 శాతం వరకు వేగవంతం చేసే అవకాశం ఉంది. ఉదాహరణకు ముంబై నుంచి సూయజ్ కెనాల్ ద్వారా యూరప్‌కు ప్రయాణించే షిప్పింగ్ కంటైనర్... ఈ కారిడార్ ఏర్పడ్డ తరువాత రైలు మార్గంలో దుబాయి నుంచి ఇజ్రాయెల్‌లోని హైఫాకు, ఆపై యూరప్‌కు వెళ్లొచ్చు. అంటే... డబ్బు, సమయం రెండూ ఆదా అయినట్టే కదా! రాబోయే కాలంలో భారత్, పశ్చిమాసియా, యూరప్ మధ్య ఆర్థిక ఏకీకరణలో ఇది ఎఫెక్టివ్ టూల్‌గా పనిచేస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదంటున్నారు ఆర్థిక నిపుణులు.
రైలు మార్గంతో పాటు ఎలక్ట్రిసిటీ, డిజిటల్ కనెక్టివిటీ కోసం కేబుల్ వేయడంతో పాటు శుభ్రమైన హైడ్రోజన్ ఎక్స్పోర్ట్ చేసేందుకు పైప్‌లు కూడా వేయొచ్చు. రైలు మార్గం ద్వారా ఇండియాలో ఉన్న పోర్ట్స్‌ను కూడా లింక్ చేయొచ్చు. ఈ కారిడార్ వల్ల పలు రకాల కారణాలతో పెరిగిన ఉష్ణోగ్రతలు తగ్గి పర్యావరణానికి కూడా మేలు జరుగుతుంది. అలాగే దేశాల మధ్య ఉన్న కొన్ని వైరుధ్యాలు కూడా పరిష్కారం అయ్యే అవకాశం ఉంది అంటున్నారు విశ్లేషకులు. మొత్తంమీద వాణిజ్యం, ఇంధన వనరుల రవాణా, డిజిటల్ కనెక్టివిటీని మెరుగుపరచడంలో ఈ కారిడార్ కీలకంగా ఉండనుంది. వీటన్నింటికంటే కూడా... చైనా తేవాలనుకున్న ‘ వన్ బెల్ట్ వన్ రోడ్ ప్లాన్’కు ఇది కౌంటర్ ఎటాక్‌గా కనిపిస్తోంది!
‘ఇండియా– మిడిల్ ఈస్ట్– యూరోప్’ ఎకనామిక్ కారిడార్‌లో రెండు వేరువేరు కారిడార్లు ఉంటాయి. వాటిలో ఒకటి భారతదేశాన్ని అరేబియా గల్ఫ్‌కు అనుసంధానించే తూర్పు కారిడార్. మరోటి అరేబియా గల్ఫ్‌ను యూరప్‌తో అనుసంధానించే ఉత్తర కారిడార్.
14 లక్షలకు పైగా ఉద్యోగులు
దేశ వ్యాప్తంగా మొత్తం మార్గం పొడవు 68,525 కిలోమీటర్లు. 1,15,000 కిలోమీటర్లకు పైగా రన్నింగ్ ట్రాక్స్ ఉన్నాయి. దాదాపు 8,500 స్టేషన్ల గుండా రైళ్లు నడుస్తున్నాయి.14 లక్షలకు పైగా ఉద్యోగులు రైల్వేల్లో పనిచేస్తున్నారు. దేశవ్యాప్తంగా13,160కి పైగా ప్యాసింజర్ రైళ్లు, 22,593కు పైగా గూడ్స్ రైళ్లు నడుస్తున్నాయి. ఇండియన్ రైల్వేల్లో 19 జోన్లు, 70 డివిజన్లు ఉన్నాయి. ఇంత పెద్ద నెట్‌వర్క్ విస్తరించడంలో ఇండియన్ రైల్వే ఎన్నో సవాళ్లను ఎదుర్కొంది. మన రైల్వే సిస్టమ్ బ్రిటిష్ కాలం నుంచే అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతూ వచ్చింది. బ్రాడ్ గేజ్, మీటర్ గేజ్, న్యారో గేజ్ లాంటి మల్టీ గేజ్ నెట్‌వర్క్‌తో రైళ్లను నడుపుతోంది
యూటీఎస్ మొబైల్ టికెటింగ్
ఐఆర్‌సీటీసీ ద్వారా టికెట్స్ రిజర్వ్ చేసుకునే అవకాశం ఉన్నా... జనరల్ టికెట్లు, ఫ్లాట్‌ఫాం టికెట్లను కొనుక్కునే అవకాశం లేదు. దాంతో జనరల్ ప్యాసింజర్ టికెట్ కొనేవాళ్లు బారుగా ఉండే ‘క్యూ’లో నిల్చొని చాలా ఇబ్బంది పడేవాళ్లు. అందుకే ఇండియన్ రైల్వే యూటీఎస్(అన్‌రిజర్వ్‌డ్ టికెటింగ్ సిస్టమ్) పేరుతో ఒక యాప్ డెవలప్ చేసింది. దీన్ని 2018లో తీసుకొచ్చారు. దీని ద్వారా ఆన్‌లైన్‌లో అన్‌రిజర్వ్‌డ్ టిక్కెట్స్ బుక్ చేసుకోవచ్చు. ఫిజికల్ టికెట్స్ కొనాల్సిన అవసరం లేదు. రెగ్యులర్‌గా రైళ్లలో ప్రయాణించే వాళ్లకు ఇది చాలా ఉపయోగకరం. ఇందులో ప్లాట్‌ఫామ్ టికెట్ కూడా కొనుక్కోవచ్చు. అంతేకాదు.. సిటీల్లో నడిచే ఎంఎంటీఎస్ టికెట్లు కూడా బుక్ చేసుకోవచ్చు. ఈ యాప్ ఆండ్రాయిడ్, ఐవోస్‌కు సపోర్ట్ చేస్తుంది.
ఎప్పుడూ ఆలస్యమే!
ఇండియన్ రైల్వే.. ప్రపంచంలోని నాల్గవ అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్. కానీ.. రైలు బండి అంటేనే ఆలస్యంగా వస్తుందని ఒక ముద్ర పడిపోయింది. అందుకే కొందరు రైలు ప్రయాణాన్ని లెక్కేసినప్పుడు ట్రావెల్ టైం కంటే ఒకటిరెండు గంటలు ఎక్కువ లెక్కేసుకుంటారు. మన రైళ్ల టైమింగ్స్ మీద అంత నమ్మకం! దాదాపు17 శాతం ప్యాసింజర్ రైళ్లు 2022–23లో ఆలస్యంగా నడిచాయి. ఈ విషయాన్ని ఒక సిటిజన్ సమాచార హక్కు కింద అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఇండియన్ రైల్వే స్వయంగా చెప్పింది. 2022–23లో 1,42,897 ప్యాసింజర్ రైళ్లు ఆలస్యం కావడం వల్ల 1,10,88,191(1.10 కోట్ల) నిమిషాల నష్టానికి దారితీసింది. పాత పట్టాలు, రైళ్ల రద్దీ, కొందరు ఆకతాయిలు చేసే పనులు.. ఇలా కారణాలేవైనా రైళ్లు మాత్రం ఆలస్యమే.
కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) నివేదిక ప్రకారం.. 2008 –2019 మధ్య ఇండియన్ రైల్వే మౌలిక సదుపాయాలపై 2.5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారు. ఇంతలా పెట్టుబడి పెట్టినప్పటికీ రైళ్ల టైమింగ్‌లో ఆశించిన మార్పులు రాలేదు. ఆడిట్ ప్రకారం.. టైమింగ్ అనేది 0.18 శాతం మాత్రమే మెరుగుపడింది. వందేభారత్ లాంటి రైళ్లను తెస్తున్నా.. అన్ని రకాల రైళ్ల సగటు వేగం గంటకు 36 కిలోమీటర్ల నుండి గరిష్టంగా 71 కిలోమీటర్లు మాత్రమే ఉందని రైల్వే శాఖ తెలిపింది. అందులోనూ ప్యాసింజర్ రైళ్లు గంటకు 35 కి.మీ వేగంతో అత్యంత నెమ్మదిగా నడిచాయి. అయితే మెయిల్/ఎక్స్‌ప్రెస్ రైళ్ల సగటు వేగం (రాజధాని, శతాబ్ది, దురంతో, గరీబ్‌రథ్, వందే భారత్, సువిధ, తేజస్) 51 కిలోమీటర్లుగా ఉంది.
స్పీడ్ పెరిగింది
రైల్వే వ్యవస్థ అభివృద్ధి జరుగుతున్న కొద్దీ ట్రైన్ల ఇంజిన్లు, వేగంలో కూడా మార్పులు వచ్చాయి. తరాలు మారుతున్న కొద్దీ కొత్త తరం రైళ్లు పట్టాలెక్కాయి. ఇండియాలో మొదట్లో ఆవిరితో నడిచే రైళ్లు మాత్రమే నడిచేవి. వాటి వేగం గంటకు 90 కిలోమీటర్లుగా ఉండేది. ఆ తర్వాత వచ్చిన ఎలక్ట్రిక్ లోకోమోటివ్‌లు కోచ్‌లను గంటకు 100 కిలోమీటర్ల వేగంతో లాగేవి. కానీ.. మొదట్లో ఇవి బొంబాయి డివిజన్‌లో మాత్రమే నడిచేవి. ఎందుకంటే.. అక్కడ మాత్రమే కరెంట్ లైన్ ఉండేది. మిగిలిన మార్గాల్లో ఆవిరి లోకోమోటివ్‌లు నడిపేవాళ్లు. అయితే.. 1960ల్లోకి వచ్చేసరికి అమెరికన్ కంపెనీ ఆల్‌కో నుండి డీజిల్‌తో నడిచే డబ్ల్యూడీఎం–-1, డబ్ల్యూడీఎం–-2 లోకోమోటివ్‌లను దిగుమతి చేసుకున్నారు. డబ్ల్యూడీఎం–-1 మాత్రం100 కెఎంపీహెచ్ స్పీడ్ మార్కును దాటడానికి చాలా కష్టపడేవి. డబ్ల్యూడీఎం–2, 4 వచ్చిన తర్వాత వేగం కాస్త పెరిగింది. ఇండియాలో మొట్టమొదటిసారి 1969లో హౌరా రాజధాని ఎక్స్‌ప్రెస్ పేరుతో ఎలక్ట్రిక్ హై–స్పీడ్ ట్రైన్ తీసుకొచ్చారు. ఆ తర్వాత1980లలో డబ్ల్యూఏపీ – 1 అనే ఎలక్ట్రిక్ లోకోమోటివ్ ట్రైన్ తీసుకొచ్చారు. ఇదే దేశంలో అత్యంత వేగవంతమైన లోకోమోటివ్‌గా రికార్డు క్రియేట్ చేసింది. ట్రయల్ రన్‌లో గరిష్టంగా గంటకు160 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంది. తర్వాత వచ్చిన డబ్ల్యూఏపీ – 5 రైళ్లు భారతదేశంలోనే మొట్టమొదటి ఏసీ లోకోమోటివ్‌లు. శతాబ్ది ఎక్స్‌ప్రెస్ లాంటి వాటికోసం ఈ ఇంజిన్లను వాడేవాళ్లు. ఈ లోకోమోటివ్‌లలో మొదటి బ్యాచ్ 1995లో ఇండియాకు చేరుకుంది. ఇది ట్రయల్ రన్‌లో రికార్డు స్థాయిలో184 కెఎంపీహెచ్ వేగాన్ని అందుకుంది. ఇదే ఇండియాలో అత్యంత వేగవంతమైన లోకోమోటివ్‌గా నిలిచింది. ఈ ఇంజిన్లు 130 కెఎంపీహెచ్‌తో పనిచేశాయి. 2016 ఏప్రిల్‌లో తీసుకొచ్చిన గతిమాన్ ఎక్స్‌ప్రెస్‌ని కూడా ఈ ఇంజినే లాగింది.
బుల్లెట్ ట్రైన్
భారతదేశపు మొట్టమొదటి బుల్లెట్ ట్రైన్ 2026 ఆగస్ట్‌లో పట్టాలెక్కనుంది. వాస్తవానికి ఈ ప్రాజెక్ట్ 2023లో పూర్తి కావాల్సి ఉంది. కానీ.. భూసేకరణలో జాప్యం వల్ల ఆలస్యమైంది. ఈ హై-స్పీడ్ రైల్ కారిడార్ ప్రాజెక్ట్ ముంబై–అహ్మదాబాద్ నగరాల మధ్య నిర్మిస్తున్నారు. 2015లో జాయింట్ ఫీజిబిలిటీ స్టడీ రిపోర్టు ప్రకారం ప్రాజెక్ట్ ప్రాథమిక అంచనా వ్యయం రూ. 1,08,000 కోట్లు. ఎనిమిదేండ్లలో పూర్తి అవుతుందని అంచనా. కొన్ని కారణాల వల్ల పనులు ఇంకా చాలా వరకు పెండింగ్‌లో ఉన్నాయి. మొత్తం 508 కిలోమీటర్ల పొడవు ఈ ట్రాక్ నిర్మిస్తున్నారు. దీనిపై ట్రైన్ గంటకు 350 కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది. మూడు గంటల్లో ముంబై నుంచి అహ్మదాబాద్‌కు చేరుకుంటుంది.
పొడవైన ఫ్లాట్‌ఫాం
కర్నాటకలోని హుబ్బళ్లి రైల్వే స్టేషన్ ప్రపంచంలోనే అత్యంత పొడవైన రైల్వే ప్లాట్‌ఫామ్‌గా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చేరింది. అంతకుముందు కూడా ఈ రికార్డు ఇండియాకే ఉండేది. ఉత్తర ప్రదేశ్‌లోని గోరఖ్ పూర్ రైల్వే స్టేషన్ పేరుపై ఉండేది. దాని ఫ్లాట్‌ఫాం పొడవు 1,366 మీటర్లు. అయితే ఆ రికార్డును హుబ్బళ్లి రైల్వేస్టేషన్ అధిగమించింది. ఇక్కడ కొన్నాళ్ల క్రితం 1,507 మీటర్ల పొడవైన ప్లాట్‌ఫామ్ కట్టారు. ఇప్పుడు ఇదే ప్రపంచంలో అతి పొడవైన రైల్వే ప్లాట్ ఫామ్.
::: కరుణాకర్ మానెగాళ్ల