రాఖీ పండగ ముందే 72 రైళ్లు క్యాన్సిల్.. 22 ట్రైన్స్ రూట్ మార్చిన ఇండియన్ రైల్వేస్

ఇండియన్ రైల్వేస్ డిపార్ట్ మెంట్ మహారాష్ట్రలోని రాజ్‌నంద్‌గావ్, నాగ్‌పూర్ రైల్వే స్టేషన్‌ల మధ్య మూడవ ట్రాక్‌ను ఏర్పాటు చేస్తున్నందున ఆయా మార్గంలో ప్రయాణించే 72 రైళ్లను రద్దు చేసింది. ఆగస్టు 4 నుంచి 20 మధ్యన రైల్వే యంత్రాంగం ఈ రైళ్లను రద్దు చేసింది. అలాగే మరో 22 రైళ్ల రూట్ కూడా మార్చింది. ఈ లైన్ నిర్మాణం కోసం రాజ్‌నంద్‌గావ్-కలమ్ స్టేషన్ మధ్య పెద్ద ఎత్తున ప్రీ-ఇంటర్‌లాకింగ్, ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్ పనులు జరుగుతున్నాయి. 

రాజ్‌నంద్‌గావ్, నాగ్‌పూర్ స్టేషన్‌ల మధ్య 228 కి.మీ మూడో లైన్ కనెక్టివిటీ కోసం రైల్వే సుమారు రూ.3,540 కోట్లు ఖర్చు చేస్తోంది. మరో వారం రోజుల్లో రాఖీ పండుగ ఉన్నా ప్రయాణీకులకు ఇబ్బందులు తప్పవు.  దీంతో 100 రైళ్లు రాకపోకలపై భారం పడుతుందని రైల్వే శాఖ అధికారులు తెలిపారు. వీటిలో దాదాపు 72 రైళ్లు రద్దు చేయబడ్డాయి. 22 రూట్ మార్చారు. 6 రైళ్ల మార్గాన్ని కుదించినట్లు ఇండియన్ రైల్వేస్ ప్రకటించింది. రక్షా బంధన్ సందర్భంగా రైలు ప్రయాణాలు చేసేవారు వారి ట్రైన్ టైమింగ్స్ చెక్ చేసుకోవాలని ఇండియన్ రైల్వేస్ కోరింది.