Railways: రైలు ప్రయాణికులకు అదొక్కటే శుభవార్త.. బడ్జెట్పై రైల్వే మంత్రి ఏమన్నారంటే..

Railways: రైలు ప్రయాణికులకు అదొక్కటే శుభవార్త.. బడ్జెట్పై రైల్వే మంత్రి ఏమన్నారంటే..

న్యూఢిల్లీ: 2024-25 ఆర్థిక సంవత్సరానికి గానూ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో భారతీయ రైల్వేకు రూ.2,62,200 కోట్లు కేటాయించినట్లు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. ఇందులో.. రూ.1,08,795 కోట్లు రైలు ప్రయాణ భద్రతా వ్యవస్థను మెరుగుపరడానికి వినియోగించనున్నట్లు పేర్కొన్నారు. ఇటీవల రైలు ప్రమాదాలు పెరిగిపోతుండటంతో పాత ట్రాక్స్ స్థానంలో కొత్త ట్రాక్స్, సిగ్నలింగ్ వ్యవస్థను మెరుగుపరచడం,ఫ్లై ఓవర్స్, అండర్ పాసెస్ నిర్మాణం, కవచ్ ఇన్స్టాలేషన్ కోసం ఖర్చు చేయనున్నట్లు తెలిపారు.

రైలు ప్రయాణ భద్రతా వ్యవస్థకు సంబంధించి కవచ్కు పెద్దపీట వేయనున్నట్లు చెప్పారు. ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్ కవచ్ 4.0కు రీసెర్చ్ డిజైన్స్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ (RDSO) నుంచి ఆమోదం లభించిందని అశ్వినీ వైష్ణవ్ వివరించారు. కవచ్ 4.0 ఇన్స్టాలేషన్ వీలైనంత త్వరగా మొదలుపెడతామని తెలిపారు. కవచ్ 4.0లో ఎంతో ముఖ్యమైన 4,275 కిలోమీటర్ల ఆప్టికల్ ఫైబర్ కేబుల్ , టెలికాం టవర్స్, RFID ట్రాక్ డివైస్, స్టేషన్ కవచ్, లోకో కవచ్ కూడా త్వరితగతిన ఇన్స్టాల్ చేస్తామని రైల్వే మంత్రి వెల్లడించారు.

ఇక.. రైల్వేలకు కేంద్ర ప్రభుత్వం కేటాయింపులపై అశ్వినీ వైష్ణవ్ హర్షం వ్యక్తం చేశారు. 2014లో రైల్వేకు కేవలం రూ.35,000 కోట్లు మాత్రమే కేటాయించారని, ఇప్పుడు రూ.2.62లక్షల కోట్ల కేటాయింపు జరిగిందని చెప్పుకొచ్చారు. 2014కు ముందు 60 ఏళ్లలో కేవలం 20 వేల కిలోమీటర్ల రైల్వే రూట్ విద్యుదీకరణ జరిగితే.. గత పదేళ్లలో 40,000 కిలోమీటర్ల రైల్వే రూట్ను విద్యుదీకరణ విధానంలో నడిపిస్తున్న ఘనత మోదీ ప్రభుత్వానిదని చెప్పారు.

ఇక.. రైల్వేల్లో జనరల్ కోచ్ల కొరత ఉండటంతో ఈ ఆర్థిక సంవత్సరంలో 2,500 అదనపు జనరల్ కోచ్లు మ్యాన్యుఫ్యాక్చర్ చేసి అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఉన్న డిమాండ్కు 10 వేల జనరల్ కోచ్లు అవసరమని, బడ్జెట్ లో ఈ రెండు నిర్ణయాలకు నిధుల కేటాయింపు జరిగిందని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పారు. రైల్వే మంత్రి బడ్జెట్లో కేటాయింపులను కొనియాడుతుంటే సామాన్య ప్రజానీకం మాత్రం పెదవి విరుస్తున్నారు. కొత్త రైళ్లు గానీ, రైలు ప్రయాణ భద్రతకు తీసుకోబోతున్న చర్యలపై గానీ బడ్జెట్లో ప్రస్తావనే లేకపోవడం గమనార్హం.