రెండేండ్లలో 10 వేల కోచ్​ల తయారీ .. దక్షిణ మధ్య రైల్వే జీఎం వెల్లడి

రెండేండ్లలో 10 వేల కోచ్​ల తయారీ .. దక్షిణ మధ్య రైల్వే జీఎం వెల్లడి

సికింద్రాబాద్, వెలుగు: సాధారణ ప్రయాణికుల ప్రయాణాన్ని సులభతరం చేయడానికి  రాబోయే రెండేండ్లలో సుమారు 10 వేల నాన్ -ఎసీ కోచ్ ల తయారీకి రైల్వే శాఖ ప్రణాళిక సిద్ధం చేసింది.  2024-– -25 ,2025–--26 ఆర్థిక సంవత్సరాల్లో రికార్డు స్థాయిలో 5,300 జనరల్ కోచ్ లతో పాటు మొత్తం 10 వేల కోచ్ లు  తయారు చేయాలని టార్గెట్  పెట్టుకున్నామని దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్​కుమార్​జైన్​ ఒక ప్రకటనలో వెల్లడించారు. ‘‘2024–--25 ఆర్థిక సంవత్సరంలో అమృత్  భారత్  జనరల్  కోచ్ లతో పాటు 2,605 జనరల్  బోగీలు, 1,470 నాన్ ఏసీ స్లీపర్  బోగీలు కలుపుకొని మొత్తం 323 ఎస్ఎల్ఆర్  కోచ్ లు, 32 హై కెపాసిటీ పార్సిల్ వ్యాన్ లు, 55 పాంట్రీ  కార్లను తయారు చేయాలని రైల్వే శాఖ యోచిస్తోంది.

అలాగే 2025-–-26 ఆర్థిక సంవత్సరంలో అమృత్  భారత్  జనరల్  కోచ్ లతో పాటు 2710 జనరల్  బోగీలు, 1910 నాన్ ఏసీ  స్లీపర్లు, 514 అమృత్  భారత్  ఎస్ఎల్ఆర్  కోచ్ లు, 200 హై కెపాసిటీ పార్సిల్ వ్యాన్లు, 110 ప్యాంట్రీ  కార్లను తయారు చేయాలని రైల్వే భావిస్తోంది” అని జైన్  తెలిపారు. పెరుగుతున్న ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని కోచ్ ల సంఖ్యను పెంచాలని నిర్ణయించామని ఆయన చెప్పారు.