23 రాష్ట్రాలకు 4 రోజులు రెయిన్ అలర్ట్

నైరుతి రుతుపవనాల ప్రభావంతో దేశవ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఈశాన్య రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు.. నదులు ప్రమాదకరస్థాయి దాటి ప్రవహిస్తున్నాయి. అసోంలో బ్రహ్మపుత్ర నది ఉగ్రరూపం దాల్చింది. మోరిగావ్ జిల్లాలో భారీ వరదలతో.. గ్రామాలన్నీ నీట మునిగాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందలు పడుతున్నారు. అసోంలో వరదలతో ఇప్పటివరకు 93 మంది మరణించారని ASDMA తెలిపింది. 21 జిల్లాల్లోని 8 లక్షల 40వేల మంది వరదలతో నిరాశ్రయులయ్యారని తెలిపారు అధికారులు. 

 నైరుతి రుతుపవనాల ప్రభావంతో వివిధ రాష్ట్రాల్లో జోరుగా వానలు పడుతున్నాయి. ఉత్తరాఖండ్, యూపీ, బీహార్, మహారాష్ట్ర, గుజరాత్ లను వర్షాలు ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాలతో గుజరాత్ లోని లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. ఉత్తరాఖండ్ లో భారీ వర్షాలకు రహాదారులపై కొండచరియలు విరిగి పడుతున్నాయి. చమోలి దగ్గర నేషనల్ హైవే-7పై కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో కిలోమీటర్లమేర వాహనాలు నిలిచిపోయాయి. బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ సహాయక చర్యలు చేపట్టింది. 

ఇక మరోవైపు దేశంలోని 23రాష్ట్రాలకు నాలుగు రోజుల పాటు రెయిన్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. దక్షిణాది రాష్ట్రాలైన కర్ణాటక, కేరళ, కొంకణ్, గోవా ప్రాంతాల్లో భారీ వర్షాలకు ఛాన్సుందని తెలిపింది. ఈ రాష్ట్రాల్లో 20సెంటీమీటర్ల కన్నా ఎక్కువగా వర్షాలు పడుతాయంది.