
తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరాన్ని మరోసారి వర్షం ముంచెత్తింది. ఏప్రిల్ 3న మధాహ్నం 2 గంటలకు వాతావరణం ఒక్కసారిగా చల్లబడి నగరంలోని పలు చోట్ల భారీ వర్షం కురిసింది. ఈ భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లపై వరద నీరు నిలిచిపోవడంతో.. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలు చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఉదయం నుంచి నగర వ్యాప్తంగా ఎండ దంచికొట్టిన సంగతి తెలిసిందే. ఉన్నట్టుం ఆకాశం మేఘావృతమైంది. మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఏప్రిల్ 3 న భారీ వర్షం కురిసింది.
పంజాగుట్ట, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్, మెహిదీపట్నం, లక్డీకాపూల్, బేగంపేట్, హుస్సేన్ సాగర్, సికింద్రాబాద్, తార్నాక, ఎల్‌బీనగర్, హబ్సిగూడతో పాటు పలు ప్రాంతాల్లో వాన దంచికొట్టింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Also Read : మరో 4 రోజులు భారీ వర్షాలు
గత కొన్ని రోజులుగా వేసవి ఎండల వేడితో ప్రజలు సతమతమవుతున్న వేళ.. మారిన వాతావరణం (weather) కాస్త ఉపశమనం కలిగించింది. తెలంగాణ, కోస్తా, మహారాష్ట్ర మీదుగా ఉపరితల ఆవర్తనం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. ఈ ఉపరితల ఆవర్తన ద్రోణి కారణంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా లో భారీ వర్షం కురిసింది. అలాగే దీని ప్రభావంతో పలు జిల్లాల్లో చల్లని వాతావరణం నెలకొంది. వాతావరణ శాఖ అంచనా మేరకు వచ్చేనాలుగు రోజుల పాటు నిర్మల్, నిజామాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల్లోను మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.రానున్న నాలుగు రోజులు కొన్నిచోట్ల ఎండలు, మరికొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.