
తెలుగు రాష్ట్రాల్లో జులై 17,18,19 తేదీల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. తెలంగాణలో ఈరోజు (జులై 16) అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హెచ్చరించింది. ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్ మీద ఉన్న ఆవర్తనం బలహీనపడిందని పేర్కొంది. వాయువ్య బంగాళాఖాతంలో ఒడిశా- గ్యాంగ్‌టక్ పశ్చిమ బెంగాల్ తీరాల్లో సగటు సముద్రమట్టం నుంచి 5.8 కి.మీ ఎత్తు వరకు ఒక ఆవర్తనం ఏర్పడి ఎత్తుకు వెళ్లే కొద్దీ దక్షిణ దిశవైపుగా వంగి ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ఈ ఆవర్తనం రాగల 2..3 రోజుల్లో పశ్చిమ వాయవ్య దిశగా ఉన్న ఉత్తర ఒడిశా, దాని పరిసరాల్లోని గ్యాంగ్‌టక్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ మీదగా వెళ్లే అవకాశం ఉందన్నారు. మరొక ఆవర్తనం వాయువ్య బంగాళాఖాతంలో ఈనెల 18న ఏర్పడే అవకాశం ఉందని ప్రకటించారు. దీని ప్రభావంతో పశ్చిమ దిశ వైపు నుంచి తెలంగాణ రాష్ట్రం వైపునకు గాలులు వీస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఉత్తర కోస్తాలో అనేకచోట్ల, దక్షిణ కోస్తాలో కొన్నిచోట్ల, రాయలసీమలో ఒకటి, రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. సోమవారం( జులై 17) ఉత్తర, దక్షిణ కోస్తాల్లో కొన్నిచోట్ల, రాయలసీమలో అక్కడక్కడా వర్షాలకు ఆస్కారం ఉందని పేర్కొంది. ఈ నెల 18 నాటికి వాయవ్య బంగాళాఖాతంలోనే మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని, అదేరోజు నుంచి రాష్ట్రంలో వర్షాలు ఊపందుకునేందుకు అవకాశం ఉంది.