
హైదరాబాద్ లో వాతావరణం ఉన్నట్టుండి ఒక్కసారిగా మారిపోయింది. అకస్మాత్తుగా ఆకాశంలో మేఘాలు కమ్ముకోవడంతో నగరవాసులను చల్లటి గాలులు పలుకరించాయి. మూడు రోజులుగా ఎండలతో సతమతం అయిన జనానికి ఊరట కలిగించాయి. దట్టంగా కమ్ముకున్న మేఘాలతో గాలిదుమారం చెలరేగింది. రాగల (మార్చి 19 నుంచి) మూడు రోజులు తెలంగాణలోని పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. ఉత్తరతెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరికొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ఉత్తర తెలంగాణకు వాతావరణ శాఖ రైన్ అలెర్ట్ ప్రకటించింది. ఉత్తర తెలంగాణలో ఉపరితల ఆవర్తనం ఏర్పడటంతో ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వాన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు పంట తీవ్రంగా దెబ్బతింది. చేతికొచ్చిన పంట అందకుండా పోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.