సూర్యాపేట/నల్గొండ/ యాదాద్రి వెలుగు: రెండు రోజులుగా ఉమ్మడి జిల్లాను వర్షం విడువడం లేదు. బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకూ సూర్యాపేట జిల్లాలో భారీ వర్షం కురవగా.. యాదాద్రిలో ఎడతెరపి లేని వాన కురిసింది. నల్గొండ జిల్లాలోని ఆయా గ్రామాల్లో ఓమోస్తారుగా వాన పడింది. దీంతో గ్రామాల్లో చెరువులు, వాగులు, కుంటలు నిండాయి. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలంలో 5.8సెంటిమీటర్లు, నాగారం మండలంలో 5.51సెంటిమీటర్లు, జాజిరెడ్డిగూడెం 5.5సెంటిమీటర్లు, తుంగతుర్తి 4.96 సెంటిమీటర్ల వర్షాపాతం నమోదైంది. పలుచోట్ల చెరువులు నిండి రహదారులపై వరద ప్రవాహం రావడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది . నల్గొండ జిల్లాలో నాగార్జునసాగర్, మూసీ పరివాహక ప్రాంతాల్లో ముంపునకు గురయ్యే గ్రామాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఇప్పటివరకు 17 ఇండ్లు దెబ్బతిన్నాయి. జిల్లా వ్యాప్తంగా 16.6 మిమీల వర్షం పడింది.
ALSO READ :వదలని వాన.. వరదల్లో జనం
70 వరకు చెరువులు నిండాయి. ఈ నెల 30 వరకు జిల్లా లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మరోవైపు కాజ్వేలు అధ్వాన్నంగా మారాయి. నాగార్జునసాగర్, మునుగోడు, నకిరేకల్ నియోజకవర్గాల పరిధిలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వర్షాలు తీవ్రం అయితే కాజ్వేలు మునిగిపోయే ప్రమాదం ఉందని అధికారులు చెబుతున్నారు. యాదాద్రిజిల్లా నుంచి 12 రూట్లలో రాకపోకలునిలిచాయి. వంగపల్లిలో ప్రభుత్వం నిర్మించిన 40 డబుల్ బెడ్రూం ఇండ్లు నీటమునిగాయి. యాదగిరిగుట్ట నరసింహస్వామి దర్శనం కోసం వచ్చిన భక్తులు ఇబ్బందులు పడ్డారు. ఆలయ పరిసరాలన్నీ చిత్తడిగా మారాయి. పార్కింగ్ ప్లేస్ లోకి వరద నీరు చేరింది.
మూసీకి వరద : మూసీ ప్రాజెక్టు వరద వస్తుండడంతో 8గేట్లను ఎత్తారు. 29,498 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా 25,315 క్యూసెక్కులనీటిని వదులుతున్నారు. నీటిని వదులుతున్నారు.