ఉమ్మడి కరీంనగర్‌‌‌‌ జిల్లాలో దెబ్బతిన్న కల్వర్టులు.. తెగిన రోడ్లు 

ఉమ్మడి కరీంనగర్‌‌‌‌ జిల్లాలో దెబ్బతిన్న కల్వర్టులు.. తెగిన రోడ్లు 
  • ఉమ్మడి జిల్లాలో వర్షం తెరిపిచ్చినా తగ్గని వరద ఉధృతి 
  • పలుచోట్ల కూలిన ఇండ్లు, మునిగిన పొలాలు
  • నగునూరులో కొట్టుకుపోయిన ట్రాన్స్ ఫార్మర్

కరీంనగర్, వెలుగు: రెండు రోజులుగా కుండపోతగా కురుస్తున్న వర్షం సోమవారం కాస్త తెరిపిచ్చింది. ఉమ్మడి కరీంనగర్‌‌‌‌ జిల్లావ్యాప్తంగా చిరుజల్లులు, మోస్తారు వర్షం కురిసింది. ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు చిగురుమామిడి, గంగాధర మండలాల్లో అత్యధికంగా 8 సెంటిమీటర్ల వర్షం కురిసింది. దీంతో మరికొన్ని చెరువులు, కుంటలు మత్తళ్లుపడ్డాయి. వాగుల్లో వరద ప్రవాహం కొనసాగింది. కరీంనగర్ రూరల్ మండలం నగునూరు చెక్ డ్యామ్ వద్ద వాగువరద తాకిడికి ట్రాన్స్ ఫార్మర్ కూలి వరదలో కొట్టుకపోయింది.

చిగురుమామిడి మండలంలో ఇందుర్తి –కోహెడ రహదారిపై వాగు ఉధృతితో కల్వర్టు ధ్వంసమైంది. దీంతో రాకపోకలకు ఇబ్బందిగా మారింది. వీణవంక మండలం మామిడాలపల్లి - పచ్చనూరు–గొల్లపల్లి మధ్య కొత్తగా నిర్మిస్తున్న కల్వర్టు తాత్కాలిక మట్టి రోడ్డు కొట్టుకుపోయింది. దీంతో కరీంనగర్ నుంచి వీణవంక మండలం మీదుగా జమ్మికుంటకు రాకపోకలు నిలిచిపోయాయి. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో శంకరపట్నం మండలం మొలంగూర్ గ్రామంలో పెంకుటిల్లు పాక్షికంగా కూలింది.  రామడుగు మండలం షానగర్ ఎల్లమ్మ చెరువుకు గండి పడింది. 

 కోనరావుపేట/ముస్తాబాద్​: రాజన్నసిరిసిల్ల జిల్లాలోనూ పలుచోట్ల రోడ్లు, కల్వర్టులు దెబ్బతిన్నాయి. కోనరావుపేట, బోయినిపల్లి, ముస్తాబాద్‌‌, ఎల్లారెడ్డిపేట మండలాల్లో పలుచోట్ల రోడ్లు తెగిపోయి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కోనరావుపేట మండలం నిమ్మపెల్లి వద్ద మూలవాగు ఉప్పొంగి బ్రిడ్జి పూర్తిగా ధ్వంసమైంది. దీంతో మరిమడ్ల మీదుగా నిజామాబాద్ జిల్లాకు రాకపోకలు బంద్‌‌ అయ్యాయి. మూలవాగు పరివాహక గ్రామాలు వట్టిమల్ల, బావుసాయిపేట, మామిడిపల్లి గ్రామాల రైతులు వాగు అవతలి పొలాలకు వెళ్లేందుకు అవస్థలు పడుతున్నారు. మామిడిపల్లి గ్రామంలో పూలేరు పోషవ్వ ఇల్లు కూలిపోయింది. 
 

Also Read : -మహబూబ్​నగర్, జడ్చర్లలో కుంటలు, చెరువుల కబ్జా

సుల్తానాబాద్: భారీ వర్షాలకు సుల్తానాబాద్ మండలంలోని కొదురుపాక గ్రామంలో పలు ఇండ్లు నీట మునిగాయి. సోమవారం తెల్లవారుజామున నీటమునిగిన ఇండ్లల్లో వారిని అధికారులు తరలించి జీపీలో ఆశ్రయం కల్పించారు. అడిషనల్ కలెక్టర్ అరుణ శ్రీ గ్రామాన్ని పరిశీలించారు. మండలంలోని హుస్సేనిమియా, మానేరు వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. వరద తాకిడికి రెబ్బల్‌‌దేవ్‌‌పల్లి గ్రామానికి వెళ్లే రోడ్డుకు గండి పడి రాకపోకలు స్తంభించాయి. 
రాయికల్‌‌: జగిత్యాల–నిర్మల్​ జిల్లాలను కలిపే రాయికల్​ మండలం బోర్నపెల్లి బ్రిడ్జి వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎస్సారెస్పీ వరద గేట్లను ఎత్తి నీటిని విడుదల చేయడంతో ఉధృతి పెరిగింది.