- పలుచోట్ల గ్రామస్తులే రోడ్లు వేసుకుంటున్నరు
- టెంపరరీ రిపేర్లకూ పైసలియ్యని సర్కారు
- తామేం చేయలేమని చేతులెత్తేస్తున్న ఆఫీసర్లు
- వరదలకు 22 జిల్లాల్లో 515 చోట్ల డ్యామేజ్
- 217 చోట్ల గండ్లు పడి రాకపోకలు బంద్
వెలుగు, నెట్వర్క్: భారీ వర్షాలు, వరదల కారణంగా దెబ్బతిన్న రోడ్లకు సర్కారు కనీసం టెంపరరీ రిపేర్లు కూడా చేయకపోవడంతో రాకపోకలు నిలిచి జనం అరిగోస పడ్తున్నారు. వరదలు పోటెత్తి రాష్ట్రవ్యాప్తంగా 22 జిల్లాల్లో 515 రోడ్లు మేజర్‌గా డ్యామేజీ అయ్యాయి. 217 చోట్ల గండ్లు పడి కనీసం నడిచి కూడా పోలేని పరిస్థితి ఉంది. చాలాచోట్ల కల్వర్టులు, లోలెవల్ వంతెనలు కొట్టుకపోయాయి. దీంతో వారం, పదిరోజులుగా మండల, జిల్లాకేంద్రాల్లోని ఆసుపత్రులకు, నిత్యావసర సరుకులు తెచ్చుకునేందుకు జనం వెళ్లలేకపోతున్నారు. వెంటనే రిపేర్లు చేపట్టాలని అధికారులకు, ప్రజాప్రతినిధులకు మొరపెట్టుకుంటున్నారు.
కానీ సర్కారు నుంచి ఫండ్స్ రాకపోవడంతో తామేమీ చేయలేకపోతున్నామని ఆఫీసర్లు చేతులెత్తేస్తున్నారు. దీంతో పలు గ్రామాల్లో జనమే పలుగు, పార పట్టి రిపేర్లు చేసుకుంటున్నారు. చందాలు వేసుకొని మొరం, రాళ్లు తెప్పించి తాత్కాలిక ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
రూ.500 కోట్లు అవసరం
రాష్ట్రంలో ఇటీవల కురిసిన వర్షాలు, వరదలకు 22 జిల్లాల్లో 515 చోట్ల స్టేట్ రోడ్లు దెబ్బతిన్నట్లు ఆర్ అండ్ బీ ఆఫీసర్లు సర్కారుకు నివేదించారు. 217 చోట్ల రోడ్లు తెగిపోయాయని, అనేక చోట్ల కల్వర్టులు, లోలెవల్ వంతెనలు కొట్టుకపోయాయని గుర్తించారు. మొత్తంగా 828 కిలోమీటర్ల మేర రోడ్లు డ్యామేజీ అయ్యాయని, వీటి రిపేర్లకు రూ.500 కోట్లు అవసరమని ప్రతిపాదించారు. ఈ రోడ్ల రిపేర్లకు ఎక్కువ సమయం పట్టే అవకాశముందని, వేలాది గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయినందున యుద్ధప్రాతిపదికన రిపేర్లు చేపట్టాల్సి ఉందని సర్కారు దృష్టికి తెచ్చారు.
టెంపరరీ రిపేర్ల కోసం రూ.38.45 కోట్లు అవసరమని, వెంటనే రిలీజ్ చేయాలని కోరారు. అన్ని జిల్లాల నుంచి ప్రపోజల్స్ పంపినప్పటికీ సర్కారు నుంచి ఫండ్స్రాకపోవడంతో క్షేత్రస్థాయిలో పనులు చేపట్టలేకపోతున్నామని ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ఆఫీసర్లు చెప్తున్నారు. దీంతో ఎమర్జెన్సీ టైంలో అంబులెన్స్‌లు రాక రోగులు, గర్భిణుల ప్రాణాల మీదికి వస్తోంది.
జనమే రిపేర్లు చేసుకుంటున్నరు..
ప్రజాప్రతినిధులు, ఆఫీసర్లు పట్టించుకోకపోవడంతో చాలా గ్రామాల్లో ప్రజలే రోడ్లకు తాత్కాలికంగా రిపేర్లు చేసుకుంటున్నారు. ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండలంలోని పెసరిగుంట రోడ్డు ఇటీవల వరదలకు రెండు చోట్ల కొట్టుకపోయింది. రెండు వారాలైనా ఆఫీసర్లు, లీడర్లు పట్టించుకోకపోవడంతో గ్రామ యువకులు శ్రమదానం చేసి బైక్ లు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు.
నిర్మల్ జిల్లా కేంద్రానికి సమీపంలోని కౌట్ల (కే ) గ్రామానికి వెళ్లే రోడ్డు కల్వర్టు వద్ద తెగిపోయింది. గ్రామస్తులంతా ఆఫీసర్లకు, ప్రజాప్రతినిధులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదు. సమస్య తీవ్రంకావడంతో గ్రామ యువకులే కల్వర్టుకు రిపేర్‌చేసి, గుంతలను పూడ్చుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం దన్నూర్ రహదారి వరదలకు డ్యామేజీ కావడంతో గ్రామస్తులే బాగు చేసుకున్నారు. భారీ డ్యామేజీ జరిగిన చోట, కల్వర్టులు, లోలెవల్ బ్రిడ్జిలు కొట్టుకపోయిన చోట రిపేర్లు చేసుకోలేక జనాలు ఇబ్బందులు పడుతున్నారు.
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలం రొంపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని పెర్కాగూడ వెళ్లే రోడ్డు తెగిపోవడంతో దవాఖానకు, నిత్యావసర సరుకుల కోసం మండల కేంద్రానికి వెళ్లే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో ఊరు ఊరంతా శ్రమదానం చేసి మట్టి, రాళ్లతో టెంపరరీగా మరమ్మతులు చేసుకున్నారు.
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం కోయపల్లి వద్ద కల్వర్టు తెగడంతో ఈ నెల 21న బెజ్జూర్ మండలం నాగేపల్లికి చెందిన మల్లుబాయి అనే గర్భిణి దగ్గరికి అంబులెన్స్ వెళ్లలేకపోయింది. ఆమె కుటుంబసభ్యులు అష్టకష్టాలు పడి గర్భిణిని కల్వర్టు దాకా తీసుకువచ్చినా టైం దాటిపోవడంతో అక్కడే ప్రసవించింది. ఆ పసికందు శనివారం రాత్రి చనిపోయింది. కొడుకును కోల్పోయి మల్లుబాయి కన్నీరుమున్నీరవుతున్నది.
రిపేర్ చేస్తలే
వరదలకు రోడ్డు తెగింది. 2 వారాలైనా రిపేర్ చేస్తలేరు. దహెగాం నుంచి కాగజ్ నగర్‌కు రోజూ పోయి రావాలి. అతికష్టం మీద బైక్ దాటించాల్సి వస్తోంది. ఎమర్జెన్సీలో ఏ వెహికల్స్ పోయే పరిస్థితి లేదు. తప్పనిసరి పరిస్థితుల్లో 40 కిలోమీటర్లు తిరిగి పోవాల్సి వస్తోంది. - కాటెల సాయి, దహెగాం, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా
ఇటు దిక్కు చూసినోళ్లు లేరు
భారీ వానలకు సుల్తానాబాద్– ఎలిగేడు రోడ్డు తెగి పోయినా.. ఇటువైపు చూసిన వాళ్లే లేరు. సుల్తానాబాద్‌కు పోవాలంటే ఇబ్బందయితున్నది. 3 కిలోమీటర్ల దూరం దాటేందుకు 15 కిలోమీటర్లు తిరిగిపోతున్నం. టెంపరరీ రిపేర్లన్నా చేస్తలేరు. ఎలిగేడు, సుల్తానాబాద్ 2 మండలాల్లో రోడ్లు వెంటనే బాగు చేయాలి. - సీహెచ్ రామచంద్రం, ర్యాకల్ దేవ్ పల్లి, ఎలిగేడు మండలం, పెద్దపల్లి జిల్లా
భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని వెంచరామి, భావుసింగ్ పల్లి గ్రామాలను కలిపే రోడ్డు ఇది. ఇటీవల కురిసిన వర్షాలకు ఓ చోట కొట్టుకపోయి రాకపోకలు నిలిచిపోయాయి. ఆఫీసర్లు పరిశీలించి రోడ్డు రిపేర్లకు ప్రపోజల్స్ పంపించామని, సర్కారు నుంచి ఫండ్స్ వచ్చాక పనులు మొదలుపెడ్తామని చెప్పారు. రోజులు గడుస్తున్నా ఎలాంటి స్పందన లేదు. విధిలేని పరిస్థితుల్లో వెంచరామి గ్రామ యువకులు ఇటీవల శ్రమదానం చేశారు. రాళ్లు ఎత్తి, మొరం పోసి రాకపోకలకు టెంపరరీ ఏర్పాట్లు చేసుకున్నారు.
జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం రాజారాం పల్లి నుంచి పాతగుడూర్ వెళ్లే మార్గంలో వాగుపై ఉన్న లోలెవల్ బ్రిడ్జి ఇటీవల వరదలకు కొట్టుకపోయింది. దీంతో వారంపాటు నాలుగు గ్రామాల నడుమ రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో రాజారాంపల్లి గ్రామస్తులు రాళ్లు వేసుకొని రాకపోకలకు తాత్కాలిక ఏర్పాట్లు చేసుకున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి శాశ్వత బ్రిడ్జి నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు.