హైదరాబాద్లో వర్ష బీభత్సం.. చెరువులను తలపిస్తున్న రోడ్లు.. కూలిన చెట్లు

హైదరాబాద్లో వర్ష బీభత్సం.. చెరువులను తలపిస్తున్న రోడ్లు.. కూలిన చెట్లు

హైదరాబాద్ నగరంలో కుండపోత వర్షం బీభత్సం సృష్టించింది. ఆదివారం (జూలై14) సాయంత్రం కురిసిన వర్షానికి నగరమంతా జలమయమయింది. రోడ్లు, రహదారులు చెరువులను తలపిం చాయి. గాలివానకు పెద్ద పెద్ద చెట్లు విరిగిపడ్డాయి.  సిటీలోని పలు ప్రాంతాల్లో డ్రైనేజీ ఉప్పొంగింది. రోడ్లపై నీరు ప్రవహిస్తుండటంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడి ఇబ్బందులు పడ్డారు. ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు ట్రాఫిక్ పోలీసులు వర్షంలోనే డ్యూటీలు చేశారు. కొన్నిచోట్ట షార్ట్ సర్క్యూట్ కారణంగా కరెంట్ అంతరాయం ఏర్పడింది. 

నిజాంపేట్ లో చెరువులను తలపిస్తున్న రోడ్లు 

ఆదివారం సాయంత్రం కురిసన వర్షానికి నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రోడ్లు, రహదారులు  చెరువులను తలపించాయి. దీంతో జనం ఇండ్లను బయటికి వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. జీహెచ్ ఎంసీ అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరారు. 

మరోవైపు సైబరాబాద్ పరిధిలో భారీ వర్షం కురవడంతో పలు ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు, జీహెఛ్ ఎంసీ మాన్ సూన్ బృందం ట్రాఫిక్ క్లియరెన్స్ చేశారు. మణికొండ మున్సిపాలిటీలో కూడా ఇదే పరిస్థితి. పంచవటి కాలనీలో వర్షపు నీరు జలదిగ్భంధనంతో చేయడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పంచవటి కాలనీ వాసులు బయటికి వెళ్లే పరిస్థితి లేకుండా పోయింది.

 ముషీరాబాద్ పరిధిలోని రాంనగర్ లో స్ట్రీట్ నెం 17 భారీ వర్షం కారణంగా కాలనీలు నీట మునిగాయి. వరద ఉధృతిలో ఓ కారు చిక్కుకుపోయింది. కారులో ఉన్న నలుగురు వ్యక్తులను స్థానికులు రిస్క్ చేసి కాపాడారు. డోర్లు ఓపెన్ కాకపోవడంతో నలుగురు వ్యక్తులు కారులోనే ఉండిపోవాల్సి వచ్చింది. స్థానిక యువకులు రిస్క్ చేసి కారును గోడ వైపు తెచ్చి, అద్దాలు పగలగొట్టి నలుగురిని రక్షించారు. 

పంజాగుట్ట పీవీఆర్ థియేటర్ ముందు ప్రేక్షకుల ఆందోళన 

భారీ వర్షం కారణంగా హైదరాబాద్ పంజాగుట్ట పీవీఆర్ థియేటర్ లో వర్షం నీరు వచ్చి చేరింది. దీంతో యాజమాన్యం కల్కి సినిమా ప్రదర్శన నిలివేయాలని ప్రేక్షకులు ఆందోళనకు దిగారు. షార్ట్ సర్క్యూట్ జరిగి జరగరానిది ఏదైన జరిగితే ఎవరు బాధ్యులు అంటూ థియేటర్ యాజమాన్యాన్ని నిలదీశారు. సినిమా చూసేవారు చూడొచ్చు.. వెళ్లేవారు వెళ్లొచ్చ అని ఎటకారపు సమాధానమి చ్చారని సినిమాకు వచ్చినవారు చెప్పారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎట్టకేలకు ప్రేక్షకుల కోరిక మేరకు కల్కి సినిమా ప్రదర్శన నిలిపివేశారు.