దేశ రాజధాని ఢిల్లీలో గత 46 ఏళ్లలో ఎన్నడూ లేనంత భారీ వర్షాలు కురుస్తున్నాయి. 1975 తర్వాత రికార్డు స్థాయిలో వెయ్యి మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావడం ఇదే మొదటి సారి అని ఇండియా మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ (IMD) తెలిపింది. భారీ వర్షాల కారణంగా ఢిల్లీలోని ఇందిరాగాంధీ విమానాశ్రయం చెరువును తలపిస్తోంది. రోడ్లు నదుల్ని తలపిస్తున్నాయి. వాతావరణం కారణంగా నాలుగు దేశీయ విమానాలు.. ఒక అంతర్జాతీయ విమానం మొత్తం ఐదు విమానాలను పొరుగున ఉన్న నగరాలకు మళ్లించారు. అలాగే ఢిల్లీ నుండి బయలుదేరాల్సిన మూడు ఇండిగో విమానాలను రద్దు చేశారు. స్పైస్ జెట్ విమాన సంస్థ.. తమ విమాన రాకపోకలపై ప్రయాణీకులు ఎప్పటికప్పుడు వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవాలని సూచించింది.
ఢిల్లీలో అక్షరధామ్, షహద్రా, ప్రీత్, వంటి కొన్ని ప్రదేశాల్లో మాత్రమే కాదు.. నోయిడా, గ్రేటర్ నోయిడా, ఘజియాబాద్ వంటి రాజధాని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోందని IMD తెలిపింది.