బంగాళాఖాతంలో అల్లకల్లోలం.. దూసుకొస్తున్న తుఫాను..

బంగాళాఖాతంలో అల్లకల్లోలం.. దూసుకొస్తున్న తుఫాను..

బంగాళాఖాతం అల్లకల్లోలంగా మారింది. భారత వాతావరణ శాఖ తుఫాను హెచ్చరిక చేసింది. ఈ తుఫాను కారణంగా దేశంలోని 13 రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈశాన్య భారతదేశంలోని రాష్ట్రాలపై ఈ తుఫాను ప్రభావం ఎక్కువగా ఉండొచ్చని ఐఎండీ హెచ్చరించింది. ఫిబ్రవరి 19న ఈశాన్య భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని తెలిపింది. అస్సాం, మేఘాలయలో ఫిబ్రవరి 19న భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, సబ్ హిమాలయన్ వెస్ట్ బెంగాల్, సిక్కింలో రానున్న వారం రోజులు మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు తెలిపారు. హిమాచల్ప్రదేశ్, ఉత్తరాఖండ్లో ఫిబ్రవరి 19, 20 తేదీల్లో హిమపాతం కారణంగా దట్టంగా మంచు కురుస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. ఫిబ్రవరి 17 నుంచి 19 లోపు రాజస్థాన్లో.. పంజాబ్, హర్యానాతో పాటు ఉత్తరప్రదేశ్లోని పశ్చిమ ప్రాంతాల్లో ఫిబ్రవరి 19, 20న భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

ఇదిలా ఉంటే.. తెలంగాణలో మాత్రం ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఫిబ్రవరిలోనే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఉదయం 11 గంటలు దాటకముందే ఎండ సెగలు పుట్టిస్తోంది. గత ఐదారు రోజులుగా ఉష్ణోగ్రతలు పెరుగుతూనే ఉన్నాయి. గాలిలో తేమ శాతం బాగా తక్కువగా ఉంటోంది. మధ్యాహ్నం ఒంటి గంట దాటాక ఇళ్లలోంచి బయటికి రావాలంటేనే జనం భయపడిపోతున్నారు. ఫిబ్రవరిలోనే ఇలా ఎండలు మండిపోతే.. ఇక మే నెలలో పరిస్థితి ఎలా ఉంటుందోనని ప్రజలు ఆందోళనలో ఉన్నారు.