భద్రాచలంలో శ్రీరామనవమి వేడుకలకు వాన ఆటంకం

భద్రాచలం, వెలుగు: భద్రాచలంలో శ్రీరామనవమి, శ్రీరామ పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం పనులకు వాన ఆటంకంగా మారింది. రూ.1.5 కోట్ల వ్యయంతో ఉత్సవాల కోసం ఏర్పాట్లు చేపట్టారు. అయితే రెండు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. భద్రాచలంలో 37.6, బూర్గంపాడులో 44.4, దుమ్ముగూడెంలో 45.8, అశ్వాపురంలో 34.8, గుండాలలో 27.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఎడతెరిపి లేకుండా కురిసిన వానలకు భద్రాచలం రామాలయంలో జరుగుతున్న పనులు ఆగిపోయాయి. నవమి ఏర్పాట్లు పర్యవేక్షించేందుకు శుక్రవారం జిల్లా కలెక్టర్​అనుదీప్​రావాల్సి ఉంది. వానల కారణంగా ఆయన పర్యటన రద్దైంది. 30న సీతారాముల కల్యాణం కోసం మిథిలాస్టేడియంలో చేపట్టిన చలువ పందిళ్ల నిర్మాణం, ఆలయంతో పాటు గోపురాలకు వేయాల్సిన రంగుల కార్యక్రమం నిలిచిపోయాయి. 

19న పుష్కర తీర్థయాత్ర

ఈ నెల 19న భద్రాచలం గోదావరి బ్రిడ్జి సెంటర్​ నుంచి రామాలయం వరకు పుష్కర తీర్థయాత్ర నిర్వహిస్తున్నట్లు ఈవో రమాదేవి ప్రకటించారు. 31న శ్రీరామ పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం కోసం అర్చకుల బృందాలు దేశం నలుమూలలకు వెళ్లి సముద్ర, నదుల, పుష్కరిణిల నుంచి జలాలు సేకరించి తీసుకొస్తున్నారు. ఈ తీర్థ జలాలతో వైదిక సిబ్బంది నిర్వహించే పుష్కర తీర్థయాత్రలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఈవో రమాదేవి శుక్రవారం పిలుపునిచ్చారు.