
- గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కూలిన 57 విద్యుత్ స్తంభాలు
- దెబ్బతిన్న 44 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ ఫార్మర్లు
- శుక్రవారం తెల్లవారే వరకూ ఫీల్డ్ లోనే సిబ్బంది
- అభినందించిన సీఎండీ ఫరూఖీ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో గురువారం మధ్యాహ్నం నుంచి అర్ధరాత్రి వరకు కురిసిన భారీ వర్షానికి విద్యుత్ సరఫరా వ్యవస్థ పెద్ద ఎత్తున దెబ్బతిన్నది. చెట్లు విరిగి విద్యుత్ తీగలపై పడడంతో విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ ఫార్మర్స్ నేలకొరిగాయి. ఈ నేపథ్యంలో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. అప్రమత్తమైన అధికారులు, సిబ్బంది నిర్విరామంగా విధులు నిర్వహించి.. దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్థను పున:రుద్ధరించారు.
విరిగిన స్తంభాలు, ట్రాన్స్ ఫార్మర్ల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేసి, రికార్డు సమయంలో సరఫరాను పునరుద్ధరించారు. ఒక్క గ్రేటర్ హైదరాబాద్ లోనే వర్ష ప్రభావానికి 57 కరెంట్ పోల్స్ కూలిపోయాయి. అదేవిధంగా మరో 44 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ ఫార్మర్లు దెబ్బతిన్నాయి. ప్రధానంగా హైదరాబాద్ సెంట్రల్ సర్కిల్ పరిధిలో 7 డీటీఆర్లు దెబ్బతినగా.. 23 కరెంట్పోల్స్ కూలిపోయాయి. హైదరాబాద్ సౌత్ సర్కిల్ పరిధిలో 11 డీటీఆర్లు దెబ్బతినగా.. 15 కరెంట్ పోల్స్ కూలాయి.
సికింద్రాబాద్ సర్కిల్ పరిధిలో 5 డీటీఆర్లు, సరూర్ నగర్ సర్కిల్ పరిధిలో 14 డీటీఆర్లు, 3 కరెంట్ పోల్స్ దెబ్బతిన్నాయి. హబ్సిగూడ సర్కిల్ పరిధిలో 7 డీటీఆర్లు దెబ్బతినగా.. 7 కరెంట్ పోల్స్ కుప్పకూలాయి. గురువారం వర్షం, ఈదురుగాలులు.. పునరుద్ధరణ పనులకు ఆటంకం కలిగిస్తున్నా సిబ్బంది లెక్కచేయకుండా సరఫరాను పునరుద్ధరించారు. వేగవంతంగా చర్యలు చేపట్టిన సిబ్బందిని, అధికారులను సదరన్ డిస్కం సీఎండీ ముషారఫ్ ఫరూఖీ అభినందించారు. ఇదే స్ఫూర్తితో వినియోగదారులకు మెరుగైన సేవలు అందించాలని సీఎండీ సూచించారు.